కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి?
Published Mon, Jan 20 2014 4:15 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
టి.నరసాపురం, న్యూస్‌లైన్ : విభజన కుట్రతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ప్రశ్నించారు. టి.నరసాపురంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్‌కు పట్టాభిషేకం కోసం సోనియా తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పనులు చేస్తానన్నా ప్రజలు ఆయనను విశ్వసించరని స్పష్టం చేశారు. ఇప్పుడు మహిళలకు రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వడమే మానేశాయని చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎప్పుడూ ఇది చేస్తానని చెప్పలేదని, చేసి చూపించారన్నారు. ముఖ్యమంత్రికాగానే 68 వేల కోట్ల రుణాలను మాఫీ చేశారని గుర్తుచేశారు. జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఏం చేయాలో ఇప్పటికే స్పష్టత కలిగి ఉన్నారన్నారు. త్వరలోనే మరిన్ని కొత్తపథకాలతో పార్టీ మ్యానిఫెస్టో విడుదల కాబోతుందని తెలిపారు.
అదంతా ఎల్లోమీడియా సృష్టే
వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని సర్వేలు వెల్లడిస్తుంటే టీడీపీకి అనుకూలంగా ఉన్న ఎల్లోమీడియా కావాలనే దుష్ర్పచారం చేస్తోందని తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వచ్చే రెండు, మూడు నెలల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరిన్ని జిమ్మిక్కులు చేస్తాయన్నారు. సమైక్యాంధ్రలోనే ఎన్నికలు జరుగుతాయని, సునాయాసంగా వైసీపీ 200 సీట్లుపైనే సాధించడం ఖాయమని చెప్పారు. కార్యకర్తలు వైసీపీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పోలవరాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
పోలవరం నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని తోట చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎంపీలు వారి వ్యాపారాలను పెంచుకున్నారే గాని, ప్రజా సేవను విస్మరించారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల భరతం పట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మండలంలోని వైసీపీ బలపర్చిన సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ సభకు మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య అధ్యక్షత వహించగా రాష్ట్రయువజన కమిటీసభ్యుడు బీవీఆర్‌చౌదరి, తాడికొండ మురళీ, ఆరేటి సత్యనారాయణ, జీలుగుమిల్లి మండల కన్వీనర్ బోధా శ్రీనివాసరెడ్డి, టి.నరసాపురం మండల నాయకులు కాశీరాజు, శ్రీనురాజు, కాల్నీడి రాంబాబు, శ్రీనివాసరెడ్డి, యర్రా గంగాధరరావు, దాసరి దేవానంద్, మల్లిబాబు, పొటేలు సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత తెడ్లెం నుంచి టి.నరసాపురం వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం గడపగడపకు వైసీపీ నిర్వహించారు.
Advertisement