ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ‘చంద్రన్న సంచార చికిత్స’ పథకంలో(104) పనిచేస్తున్న మహిళలపై వేధింపులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పలువురు మహిళలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధను దిగమింగి ఉద్యోగం చెయ్యడమా, లేదంటే మానేయడమో చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పిరమిల్ స్వాస్థ్య యాజమాన్య సిబ్బంది తీవ్ర వేధింపులకు గురిచేసినట్టు ఓ మహిళా ల్యాబ్ టెక్నీషియన్ ఆరోపించింది. పిరమిల్ స్వాస్థ్య జిల్లా మేనేజర్ శంకరనారాయణ, ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ లక్షణరావులపై జిల్లా కలెక్టర్‌కూ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యకూ ఫిర్యాదు చేశారు. మేము ఎక్కడ వాడుకుంటే అక్కడకు రావాలి అంటూ వ్యంగ్యంగా, కించపరిచే మాటలు మాట్లాడారని, మాట వినకపోతే రోజుకో ఊరికి వెళ్లాలని చెప్పి వేధించేవారని వాపోయింది. దీనిపై యూనియన్ కూడా స్పందించి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు.
అలాగే పాడేరు డివిజన్‌లో పనిచేస్తున్న ఒక ఏఎన్‌ఎంను కూడా ఇలాగే వేధించడంతో ఆమె కూడా యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. విజయవాడలో ఒక మహిళకు ఏఎన్‌ఎం ఉద్యోగం ఇప్పిస్తామని కార్యాలయానికి పిలిపించి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని, తనపేరు అందరికీ తెలిసిపోతుందనే ఉద్దేశంతో అదే సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగితో చెప్పుకుని వాపోయింది. ఇలా ‘చంద్రన్న సంచార చికిత్స’లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై ఆగడాలు మితిమీరిపోయాయి. ప్రత్యేకంగా మహిళా ఫిర్యాదులపై ఓ మహిళా అధికారిని ఏర్పాటు చేశామని చెబుతున్నా అది తూతూమంత్రంగా ఉంది.
మీడియాకు చెబితే ఉద్యోగం నుంచి తొలగిస్తాం..
సంస్థలో వేధింపులపై మీడియాకు సమాచారమిస్తే ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తొలగించే హక్కు ఉందని యాజమాన్యం హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మిగతా ఉద్యోగుల్లో భయభ్రాంతులు సృష్టించారు. మీడియాలో వచ్చిందంటే మీరే కారణం, మీరు కారణం కాదనుకుంటే వార్తలు రాసిన రిపోర్టరుపై సదరు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయండి అంటూ ఉద్యోగులకు చెప్పారంటే యాజమాన్యం ఏ స్థాయిలో వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. గత 11 సంవత్సరాలుగా ఈ పథకం కింద పనిచేస్తున్నాం, గతంలో ఎప్పుడూ ఇలాంటి వేధింపుల ధోరణి లేదని, ప్రస్తుతం ఈ సంస్థ వేధింపులు భరించలేకున్నామని మహిళలు వాపోతున్నారు. చివరకు అధికారులకు ఫిర్యాదు చేసినా తమను బదిలీ చేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment