అప్పలరాజు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు
విజయనగరం, గరివిడి: సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో నిండుప్రాణం పోయింది. అత్యవసర సమయంలో రోగికి వైద్యం అందించడంతో పాటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం 108 వాహనాలను ఏర్పాటు చేసింది. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృత్యువాత పడిన సంఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కొండదాడి గ్రామానికి చెందిన ముదునూరు అప్పలరాజు (37) ట్రాక్టర్ నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గరివిడి నుంచి గర్భాం మీదుగా రాత్రి 10 గంటల సమయంలో స్వగ్రామం వస్తుండగా గుర్ల మండలంలో పెదబంటుపల్లి గ్రామంలో వచ్చేసరికి తనకు ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో వాహనాన్ని పక్కనే నిలిపివేశాడు.
అయన వెంటున్న చిన్న అనే కుర్రాడు ఆ సెంటర్లో ఉన్న స్థానికులకు విషయం చెప్పి అనంతరం 108కు ఫోన్ చేశాడు. అయితే కాల్‌సెంటర్ వాళ్లు ఎన్నిసార్లు చేసినా వాహనాల వారి ఫోన్‌లు అవ్వడం లేదని...ఇంకో వాహనం నంబర్ మోగుతున్నా స్పందించడం లేదని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన 108 వాహనాలు ఖాళీగానే ఉన్నాయి. రాత్రి సమయం కావడంతో ప్రైవేట్ వాహనాలు లేవు. దీంతో అప్పలరాజు సుమారు రెండు గంటల పాటు అక్కడే కొట్టుమిట్టాడి ప్రాణం వదిలాడు. 108 వాహనం వచ్చి ఉంటే అప్పలరాజు బతికేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment