ఎకరాకు 1200 బస్తాల ధాన్యం! | 1200 bags weighing of grain per acre | Sakshi
Sakshi News home page

ఎకరాకు 1200 బస్తాల ధాన్యం!

Published Tue, Mar 3 2015 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

1200 bags weighing of grain per acre

ఎక్కడయినా ఎకరా పొలం ఉన్న రైతు  1200 బస్తాలు పండించగలరా?,  పోనీ  20 టన్నుల సామర్థ్యమున్న లారీలో 120 టన్నుల ధాన్యాన్ని ఒకేసారి తరలించగలరా..?, తోటలు, మెట్టు భూమిలో ధాన్యం పండించగలరా..? సాధారణంగా అసాధ్యమైనా...  మిల్లర్లు, ప్రభుత్వ సిబ్బంది కలిసి కాగితాలపై సాధ్యం చేశారు. దీంతో అధికారులు నోళ్లు వెళ్లబెట్టవలసి వచ్చింది.
 
 విజయనగరం కంటోన్మెంట్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి, దళారుల వ్యవస్థను రూపుమాపుతామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గొప్పగా ప్రకటించిన అధికారులు ఏకంగా మిల్లర్లతో కలిసిపోయారు. దీంతో  మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా తయారైంది. తమ్ముడు, భార్య, అత్త, మామ ఇలా అందరి పేరుమీద బిల్లులు రాసేసుకున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళితే ఇచ్చే ట్రక్‌షీట్లు, గోనెలు, వీఆర్వో ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రాలను తమకు అనుకూలంగా మార్చేసుకుని  కోట్లాది రూపాయలను తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయించుకున్నారు. ఇంతకీ ఎన్ని క్వింటాళ్ల ధాన్యం మిల్లులకు తరలించారు.  ఏ మిల్లు వద్ద ఎంత ధాన్యముంది అన్న విషయం   అధికారులకు తెలియకపోవడం విశేషం.  జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో   కలెక్టర్ సీరియస్‌గా స్పందించారు.
 
 నిగ్గుతేల్చేందుకు   22 బృందాలను నియమించారు. ఆ బృందాలు మిల్లుల్లో తనిఖీలు చేస్తున్నాయి.  ఈ తనిఖీల్లో మిల్లర్ల మాయాజాలం బయటపడుతున్నట్టు సమాచారం. మిల్లర్ల చేతికి ట్రక్‌షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాలను అధికారులు ఇచ్చేయడంతో వాటిని జిరాక్సు తీసి నచ్చినట్టు మిల్లర్లు బిల్లులు చేసుకున్నారని తెలుస్తోంది.   పెద్ద కమతాలున్న రైతులు జిల్లాలో తక్కువ సంఖ్యలో ఉన్నారు.   రెండు వందల బస్తాల ధాన్యం పండించిన రైతులను వేళ్లపై లెక్కించవచ్చు. అయితే చాలా మంది రెండు వేల బస్తాలు పైనే  పండించినట్టు, అది కూడా   తక్కువ విస్తీర్ణంలోనే  పండినట్టు పత్రాలు చూపించి, మిల్లర్లు బిల్లులు చేసుకున్నారు. 20 టన్నుల సామర్థ్యమున్న లారీ నంబర్లను ట్రక్‌షీట్‌లో పొందుపరిచి 120 టన్నుల ధాన్యాన్ని ఒకే సారి తరలించినట్టు గంట్యాడలో నాలుగు మిల్లులు వారు పేర్కొన్నప్పటికీ అధికారులు బిల్లులు పాస్‌చేశారు.
 
 1700, 1550, 1725 కింటాళ్ల చొప్పున ఒక ఎకరా భూమి ఉన్న వారి పేరున కూడా బిల్లుల చెల్లింపులు చేయడం,  బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయడం జరిగిపోయాయి.   ఒకే సర్వే నంబర్, ఒకే బ్యాంకు అకౌంటు నంబరున్న వారికి కూడా  రెండు మూడు బిల్లులు చెల్లించేశారు.  అయితే ఆ స్థాయిలో మిల్లుల్లో  ధాన్యం నిల్వలు మాత్రం లేవు.  ఒకే కుటుంబానికి చెందిన వారికి వరుస నంబర్లున్న  ట్రక్ షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాలుండటం విశేషం. జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లర్లు తాము కొనుగోలు చేసిన ధాన్యానికి  తమ బంధువుల పేర్లపై బిల్లులు పెట్టారు.  బిల్లులకు జతపరచిన పట్టా దారు పాసుపుస్తకాలు ఇతరుల పేరున ఉన్నాయని తెలిసింది.
 
 తోటలు, మెట్టు భూమిలో వరిపంట!
 జిల్లాలో ధాన్యం విక్రయించినపుడు వాటికి సాగు  ధ్రువీకరణ పత్రాలు  పరిశీలిస్తే మెట్టు భూమి, తోటల్లోనే పండించినట్టు ఆయా పత్రాల్లో  పేర్కొన్నారు. వాస్తవానికి మెట్టు భూమిలోనూ, మామిడి తోటల్లోనూ వరి పండదనే విషయాన్ని కూడా అధికారులు గుర్తించకుండా బిల్లులు ఎలా చేశారో  వారికే తెలియాలి.  ధాన్యం కొనుగోలు కేంద్రాలనుంచి వచ్చిన బిల్లుల్లో సెంటర్ పేరు, వాహనం నంబర్,   బస్తాల సంఖ్య వంటి వివరాల్లో తమకు నచ్చినవి పేర్కొని బిల్లులు చేసుకున్నారు.

 ఓ వైపు మిల్లర్లు- మరో వైపు దళారులు
 జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు రెండు రకాలుగా జరిగాయి. ఓ వైపు మిల్లర్లు తమ వద్దకు వచ్చిన రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని జిరాక్సులు తమ వద్ద ఉంచుకుని తమ బంధువులను కౌలు రైతులుగా చూపించి ఈ జిరాక్సులను జత చేసి బిల్లులు చేసుకున్నారు.   అదేవిధంగా దళారుల చేత చేయించిన బిల్లులు మరికొన్ని ఉన్నాయి.   మిల్లర్లు సొంత పేరున పెట్టుకుంటున్న బిల్లులను కూడా అధికారులు పాస్ చేసేశారు.  గంట్యాడ మండలం రావి వలసకు చెందిన కనకదుర్గ రైస్ అండ్ ఫ్లోర్ మిల్లు యజమాని కె. ముత్యాలయ్య తన ఒక్కరి పేరునే 2,190 బస్తాల ధాన్యం విక్రయించిన రైతుగా నమోదు చేసుకోవడం విశేషం.
 
 అదేవిధంగా ఇతని కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి పేరున  1700 బస్తాల నుంచి రెండు వేల బస్తాల వరకూ విక్రయించినట్టు నమోదు చేసుకుని బిల్లులు చేసుకున్నారు. 12536 ట్రక్ షీట్ నంబర్ నుంచి 12541 నంబర్ వరకూ వరుస క్రమంలో ఉన్న ట్రక్ షీట్‌లతో బిల్లుల చేసుకున్నట్టు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఇలాగే ప్రమీల, ఎం విమల, ఎం కనకయ్య శెట్టి, టి ప్రశాంత్ తదితరుల పేరున బిల్లులు చేశారనీ, ఇలా మిల్లర్‌కే ఇన్ని ధాన్యం పండాయా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా ఈ ఒక్క కుటుంబమే దాదాపు 11వేల బస్తాల ధాన్యం పండించిన  రైతులుగా నమోదు చేసుకుని విక్రయించినట్టు రికార్డులు చూపించారు. వీరు సుమారు రూ.60 లక్షల పైచిలుకు బిల్లులు చేసుకున్నారు. ఈ లెక్కన ఇతర మిల్లుల్లో అయిన బిల్లులు దాదాపు రూ.65 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకూ ఉంటుందని   అంచనా వేస్తున్నారు. అలాగే కౌలు రైతుల పేరుమీద కూడా వేరేవారి ఖాతాలో సొమ్ము జమఅయింది.
 
 సివిల్‌సప్లైస్ సహాయ మేనేజర్‌ను సలవుపై వెళ్లిపోమన్న జేసీ
 జిల్లాలో ధాన్యం అక్రమాలపై జాయింట్ కలెక్టర్ స్పందించారు. ధాన్యం అక్రమాలకు నీవే బాధ్యుడవంటూ సివిల్‌సప్లైస్ శాఖలో టెక్నికల్ సహాయ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వలసయ్యపై సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవుపెట్టి వెళ్లి పొమ్మని ఆదేశించారు. వాస్తవానికి ఇటీవలే వలసయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇతరుల సహాయంతో ఇప్పుడిప్పుడే మిల్లర్లతో పరిచయాలు పెంచుకుంటున్న ఇతనిని బాధ్యుడిగా చేశారని, అసలు దొంగలను వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement