- కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు గండి
రూ.1,350 కోట్లు పాయె!
Published Tue, Jan 28 2014 2:29 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
సాక్షి, హైదరాబాద్: మూడున్నరేళ్లు గడచినా ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించని కారణంగా... రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,350 కోట్లకు గండిపడింది! అధికారులు నివేదికలు పంపినా, సీఎం కిరణ్ లేఖలు రాసినా ఆ నిధుల్లో కేంద్రం నయాపైసా కూడా ఇవ్వనంటోంది. జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. వాస్తవానికి 2012తోనే ఈ పథకం కాల పరిమితి ముగిసింది. అయితే ఏడాదిపాటు పొడిగిస్తూ... ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఇచ్చింది. ట్రాన్సిషన్ పీరియడ్‌కుగాను బడ్జెట్‌లో మొత్తం రూ.14 వేల కోట్లు కేటాయించింది. ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక (డీపీఆర్)లు సమర్పించాలని, భూసేకరణ, వివిధ శాఖల అనుమతులు అన్ని ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని వెల్లడించింది.
దీంతో రాష్ట్ర పురపాలక శాఖలోని ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం అధికారులు 17 మున్సిపాలిటీల అధికారులతో సమన్వయం చేసుకుని మొత్తం రూ.1,350 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టు పనులను ప్రతిపాదించారు. పార్వతీపురం, నర్సీపట్నం, ఏలేశ్వరం, జంగారెడ్డిగూడెం, హుస్నాబాద్, హుజురాబాద్ తదితర మున్సిపాలిటీల్లో పనులు చేయాలని భావించి నివేదికలు సిద్ధం చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీ సైతం ఈ పనులకు ఆమోద ముద్ర వేసింది. నివేదికలను అధికారులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలన నిమిత్తం పంపించారు.
జాతీయ పట్టణ నవీకరణ పథకంలో పేర్కొన్న సంస్కరణలన్నింటినీ అమలు చేసిన రాష్ట్రాల కన్నా ముందు వరుసలో ఉంది. అయితే 2010 సెప్టెంబర్‌లో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులు విడుదల చేసేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 2 నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇక ఈ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.
Advertisement