సాక్షి , విజయవాడ : సమైక్యవాదంపై వెనక్కి తగ్గేది లేదని, ఉద్యమంలో వెనకడుగేయబోమని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 42వ రోజైన మంగళవారం ఆందోళనలు హోరెత్తాయి. మరోపక్క సమైక్యాంధ్ర కోసం 48 గంటల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు రెండురోజులు సెలవు ప్రకటించాయి. విజయవాడలో బుధవారం ఉదయం 5.30 నుంచే పారిశుద్ధ్య సిబ్బందిని అడ్డుకోవాలని మున్సిపల్ జేఏసీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలు జరిగే కార్యాలయాలపై దృష్టి పెట్టాలని జేఏసీ నిర్ణయించింది. అత్యవసర సేవలైన ఆస్పత్రులు మినహా విద్యాసంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూసివేయనున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది.
వినాయకచవితి పర్వదినాన హిందువులు ఇళ్లలో పూజలు చేసుకోవాల్సి ఉండటంతో ఉద్యమ బాధ్యతలను ముస్లిములు, క్రైస్తవులు పంచుకున్నారు. నూజివీడులో ముస్లిములు నిరాహార దీక్షలు చేపట్టగా, ఉయ్యూరులో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు సామినేని విశ్వనాధం, ఎమ్మెల్యే రాజగోపాల్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కంభంపాడు గ్రామంలో చేస్తున్న దీక్షలు మంగళవారంతో ఏడోరోజుకు చేరాయి. పామర్రులో ఉపాధ్యాయ సంఘాలు, పసుమర్రు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి రిలేదీక్షల్లో పాల్గొన్నారు. నూజివీడులో వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 15వ రోజుకు చేరాయి.
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. జగ్గయ్యపేట విజ్ఞాన్ తెలుగు, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రపతికి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ రాసిన పోస్టుకార్డులను స్థానిక పోస్టాఫీస్‌లో అందజేశారు. గుడివాడలో మూడు వేల మంది విద్యార్థులు తెలుగుతల్లి గీతం, వందేమాతరం, జాతీయగీతాలాపన చేస్తూ రాష్ట్రాన్ని విడదీయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యులు స్థానిక నెహ్రూచౌక్ సెంటర్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నడిరోడ్డుపై వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి తమ నిరసన తెలిపారు.
గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జలదీక్షలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కంచికచర్ల జాతీయ రహదారిపై ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదోరోజుకు చేరాయి. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ నాయకులు జిల్లా కోర్టు ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
దాడి ఘటనపై ఫిర్యాదు..
ఈ నెల ఏడున సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న న్యాయశాఖ ఉద్యోగులపై దాడిచేసిన వారిని శిక్షించాలని కోరుతూ న్యాయశాఖ జేఏసీ నాయకులు ఏఎస్పీ షెముశీబాజ్‌పాయ్‌కి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో 108 సిబ్బంది ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు పలకగా బందరు, గూడూరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొన్నారు. కలిదిండి సెంటరులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలో కొమాళ్లపూడి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కూర్చున్నారు. కత్తివెన్ను ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు పల్లెపాలెం - లోసరి వారధి నుంచి కత్తివెన్ను వరకు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కత్తివెన్ను ప్రధాన సెంటరులో 216 జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. నిడుమోలు సెంటర్లో రాస్తారోకో నిర్వహించి వంటా వార్పు చేశారు.
సమైక్యంపై.. వెనక్కి తగ్గం
Published Wed, Sep 11 2013 4:51 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM
Advertisement
Advertisement