లారీ కిందకు దూసుకుపోయిన బస్సు
ఏలూరు : మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. గమ్యానికి చేరాల్సిన ప్రయాణీకులు గాయలతో బయటపడ్డారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు (AP07 TC 3444) ఆగివున్న లారీని ఢీ కొట్టింది. దీంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. విజయనగరం నుంచి గుంటూరుకు వెళ్తున్న యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆగివున్న లారీని అతి వేగంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు 30 మంది ప్రయాణికులు బస్సులో వున్నారు. ఏమి జరిగిందో అర్థంగాక... బస్సులోని వాళ్లు భయంతో పెద్దగా అరిచారు.
మరి కొంతమంది ధైర్యం చేసి... బస్సులు అద్దాలు పగలగొట్టుకుని బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాళ్లు నుజ్జయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్యాబిన్లో చిక్కుకుపోయిన బస్సు డ్రైవర్ను క్రేన్ సాయంతో బయటకు తీశారు. మంచు విపరీతంగా కురవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్దంగా లారీ జాతీయ రహదారిపైనే నిలపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే చివరి నిమిషంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఘోర ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.