ప్రకాశం: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వైదన గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న బస్సు వైదన సమీపంలోని రహదారిపై ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.