షాకిచ్చిన సెలైన్!
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: అనారోగ్యం చేసి ఆస్పత్రికి వెళితే.. కొత్త సమస్య తెచ్చిపెట్టాయి అక్కడి సెలైన్ బాటిళ్లు. వారిని మరింత అస్వస్థత పాల్జేసి ఆందోళనకు గురిచేశాయి. సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పింది. కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో రోగులకు ఇచ్చిన సెలైన్ వికటించడంతో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కోటబొమ్మాళి మండలం బలరాంపురం, లఖందిడ్డి, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 15 మంది డయేరియాతో బాధ పడుతూ రెండు రోజులుగా స్థానిక సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా శనివారం ఉదయం అక్కడి నర్సులు రోగులకు సిప్రాఫ్లాక్ససిన్ ఆర్‌ఎల్, మెట్రోజల్ ఎన్‌ఎస్ సెలైన్ ఎక్కించారు. వాటిని ఎక్కించి ఐదు నిమిషాల వ్యవ ధిలో రోగుల్లో విపరీత మార్పు ప్రారంభమైంది. ఒళ్లంతా చెమటలు పట్టి, చలిజ్వరం కమ్మేయడంతో వారంతా లబోదిబోమంటూ విలపించడం ప్రారంభించారు. రోగుల కుటుం బీకులు కొందరిని వేరే ఆస్పత్రులకు తరలించగా, మరికొందరిని ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించకుండా విరుగుడు చికిత్స అందించారు.
దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చికిత్స కోసం వస్తే నాసి రకం సెలైన్లు ఎక్కించి కొత్త ఆరోగ్య సమస్యలు సృష్టించడంపై రోగులు, వారి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై ఆస్పత్రి వైద్యుడు గణేష్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా సెలైన్లు రియాక్షన్ ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. 15 రోజుల కిందట హైదరాబాద్ నుంచి సెలైన్ బాటిళ్ల స్టాకు వచ్చిందని, వీటి కాలపరిమితి కూడా చాలా ఉందన్నారు. ఆ ధీమాతోనే రోగులకు ఎక్కించామన్నారు. ఇప్పటికే కొంత స్టాకు వినియోగించామని, అయితే తాజా సంఘటనతో మిగిలిన 1500 సెలైన్ బాటిళ్లను సీజ్ చేశామని వివరించారు. పక్క ఆస్పత్రుల నుంచి సెలైన్ బాటిళ్లు తెప్పించి రోగులకు ఇచ్చామని చెప్పారు. ఈ సంఘటన గురించి జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారికి సమాచారం అందజేశామని చెప్పారు.
చాలా భయమేసింది
డయేరియా చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే సెలైన్ ఎక్కించారు. అంతే ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి. చలిజ్వరం రావడంతో చాలా భయమేసింది. దీంతో ప్రభుత్వాసుపత్రులంటే భయమేస్తోంది.
-తిర్లంగి శారద, లఖందిడ్డి
సంఘటనపై విచారణ జరపాలి
సెలైన్ ఎక్కించిన 5 నిమిషాల్లోనే చలి జ్వరం వచ్చింది. ఏమైపోతానో తెలియని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక ఇక్కడకు వస్తే ఇలా జరిగింది. ఈ సంఘటనపై విచారణ జరపాలి
-కూన సోమేశ్వరరావు, హరిశ్చంద్రపురం