766 రోజుల జాప్యం ఖరీదు రూ.199.67 కోట్లు | 199 crores to Pay for Delay of pulichintala Project | Sakshi
Sakshi News home page

766 రోజుల జాప్యం ఖరీదు రూ.199.67 కోట్లు

Published Sat, Jan 19 2019 11:58 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM

199 crores to Pay for Delay of pulichintala Project - Sakshi

సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ కాంట్రాక్టర్‌ బొల్లినేని శీనయ్యతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై.. వ్యూహాత్మకంగా చేసిన జాప్యానికి రాష్ట్ర ప్రజానీకం మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టును ఆశ్రయించకుండా పాలకులు 766 రోజలు జాప్యం చేశారు. మచిలీపట్నం కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలంటే.. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతాన్ని డిపాజిట్‌ చేయాలని 2018 నవంబర్‌ 23న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టులో డిపాజిట్‌ చేయడానికి రూ.199.67 కోట్లను మంజూరు చేస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల మేరకు పూచీకత్తు(గ్యారంటీలు) సమర్పిస్తే హైకోర్టు నుంచి రూ.199.67 కోట్లను తీసుకునే వెసులుబాటు కాంట్రాక్టర్‌కు ఉంటుంది. కాంట్రాక్టర్‌ లేవనెత్తిన అంశాలను కనీసం ఇప్పుడైనా తిప్పికొట్టేలా ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పిస్తే ఈ కేసు నుంచి గట్టెక్కవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేదంటే పులిచింతల కాంట్రాక్టర్‌కు ఒప్పంద విలువ రూ.268.89 కోట్ల కంటే రూ.399.36 కోట్ల మేర అదనంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, హైకోర్టును ఆశ్రయించి ఉంటే, ఖజానాపై భారీగా భారం పడేది కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

ఈనాటి ఈ బంధం ఆనాటిదే.. 

2004 ఎన్నికలకు మూడు నెలల ముందు రూ.268.89 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనులను తనకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన ఎస్‌సీఎల్‌–సీఆర్‌18జీ (జేవీ)కి అప్పటి సీఎం చంద్రబాబు అప్పగించారు. బిల్లుల విషయంలో ఏదైనా వివాదం ఉత్పన్నమైతే డీఏబీ (వివాద పరిష్కార మండలి)ని ఆశ్రయించవచ్చనే నిబంధనను కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చూడటంతో 2009 నాటికే ప్రాజెక్టు పూర్తయింది. ప్రాజెక్టు పనుల్లో 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో కాంట్రాక్టర్‌ పేచీకి దిగడంతో 2011 మే 13న డీఏబీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంట్రాక్టర్‌కు రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ డీఏబీ 2013 అక్టోబర్‌ 3న ప్రతిపాదించింది. కానీ, కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. డీఏబీ ప్రతిపాదనను సవాల్‌ చేస్తూ 2013 డిసెంబర్‌ 27న పులిచింతల ప్రాజెక్టు అధికారులు మచిలీపట్నం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంతలో 2014 ఎన్నికలు రానే వచ్చాయి. తన ప్రభుత్వాన్ని రక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు.. పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా 2014 ఫిబ్రవరి 18న జవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వ్యూహాత్మక జాప్యానికి ఇదే తార్కాణం 

రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నం కోర్టులో కాంట్రాక్టర్‌ లేవనెత్తిన 27 అంశాలను సమర్థవంతంగా తిప్పికొట్టేలా.. సాధికారికంగా వాదనలు విన్పించడంలో విఫలమైంది. పర్యవసానంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్‌ 2న తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం రూ.199.96 కోట్లను 2013 అక్టోబర్‌ 3 నుంచి 15 శాతం వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పలుమార్లు జలవనరుల శాఖ అధికారులు సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చారని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

766 రోజుల జాప్యం ఫలితం.. 

కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని.. తనకు చెల్లించాల్సిన సొమ్మును జలవనరుల శాఖ ఆస్తులు విక్రయించి, చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2017లో పులిచింతల కాంట్రాక్టర్‌ మచిలీపట్నం కోర్టులో ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్‌ (ఈపీ) ఫైల్‌ చేశారు. విజయవాడలోని స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేయడం ద్వారా వచ్చే సొమ్ముతో పులిచింతల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని మచిలీపట్నం కోర్టు పేర్కొంది. ఈ తీర్పు అమలు చేస్తే.. అసలు రూ.199.96 కోట్లు, 2018 నవంబర్‌ 23 నాటికి వడ్డీతో కలిపి రూ.399.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కేబినెట్‌ తీర్మానం ప్రకారం కాంట్రాక్టర్‌కు అదనపు పరిహారం ఇచ్చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. కానీ జలవనరులు, ఆర్థిక శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు న్యాయపోరాటానికి అనుమతి ఇచ్చింది. దాంతో మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయాలని కోరుతూ అక్టోబర్‌ 30న పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ అడ్వకేట్‌ జనరల్‌కు ప్రతిపాదన పంపారు. మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చిన 766 రోజుల తర్వాత దాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యాన్ని దాఖలు చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేయాలన్నా.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలన్నా కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతాన్ని డిపాజిట్‌ చేస్తేనే వ్యాజ్యాన్ని విచారిస్తామని తేల్చిచెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement