మస్తు మత్తుగా...
Published Thu, Jan 16 2014 3:58 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
మందుబాబులు మస్తుగా పండగచేసుకున్నారు. పెగ్ మీద పెగ్ కొట్టారు. ఎత్తిన సీసా దించకుండా తాగేసి... వైన్‌లో మునిగితేలారు. ధరలను అమాంతంగా పెంచేసినా లెక్కచేయకుండా... పూటుగా ఎంజాయ్ చేశారు. గత ఏడాది కంటే ఇప్పుడు ఒక రోజుముందుగానే రూ.30 కోట్ల వ్యాపారం జరిగింది. 16వ తేదీన రూ.రెండుకోట్లపైనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారుల అంచనా. అన్ని మద్యం దుకాణాల గల్లాపెట్టెలు కాసులతో కళకళలాడాయి. చాలా గ్రామాల్లో మందుబాబులు స్పృహ లేకుండా దొర్లుతూ కనిపించారు.
నెల్లిమర్ల, న్యూస్‌లైన్: మందుబాబులకు బాగా కిక్కు ఎక్కింది. సంక్రాంతి పండగను మద్యం, బీర్లతో మజా చేసుకున్నారు. నాలుగురోజుల్లో ఏకంగా రూ.15 కోట్ల విలువైన మందును గొంతులో పోసుకున్నారు. ఓవైపు దుకాణదారులు ధరలు పెంచేసినా లెక్కచేయలేదు. నూతన సంవత్సరం ఆరంభం నుంచి రోజుకు రూ. రెండుకోట్ల చొప్పున మొత్తం రూ. 30కోట్ల విలువైన మందును లాగించేశారు. నూతన సంవత్సరం ముందురోజున రూ. మూడుకోట్ల విలువైన మందును గొంతులో పోసుకున్నారు. గత ఏడాదితో పోల్చిచూస్తే మద్యం కంటే బీరు అమ్మకాలు గణనీ యంగా పెరిగాయి. సుమారు ఐదువేల కేసుల బీర్లు అదనంగా అమ్ముడయ్యాయి. మందుబాబుల వీక్‌నెస్‌ను జిల్లావ్యాప్తంగానున్న వైన్‌షాపుల యజమానులు చక్కగా క్యాష్ చేసుకున్నారు.
అన్ని దుకాణాల్లోనూ ఇష్టానుసారం ధరలు పెంచేశారు. బెల్ట్ షాపుల్లో అయితే చెప్పనక్కరలేదు. ఈ నెలలో భోగీకి రెండురోజుల ముందువరకూ రూ. 15కోట్లు అమ్మకాలు జరిగాయి. ఆ తరువాత నాలుగు (భోగీ, సంక్రాంతి కలుపుకొని) రోజుల్లో మరో రూ.15కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. కనుమ, ముక్కనుమ నాడు మద్యం, బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది. గత 15రోజుల్లో జిల్లాలోని 197 షాపులద్వారా మొత్తం 68వేల మద్యం కేసులు, 48వేల బీరుకేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ సుమారు రూ.30 కోట్లు. గత ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి 16 తేదీ వరకూ రూ.30కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది ఒక రోజు ముందే రూ.30 కోట్ల వ్యాపారం సాగింది. 16 తేదీ ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గత ఏడాదికంటే ఈసారి బీర్లు అధికంగా అమ్మడుపోయాయి. గత ఏడాది 41వేల కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఈసారి 46వేల కేసులు అమ్ముడయ్యాయి. వైన్ అమ్మకాలు మాత్రం ఐదువేల కేసులు తగ్గాయి.
ఇష్టానుసారం ధరల పెంపు
పండగ సీజన్లో జిల్లావ్యాప్తంగానున్న అన్ని మద్యం దుకాణాల్లోనూ ధరలను విపరీతంగా పెంచేశారు. నెల్లిమర్ల మండలాన్నే తీసుకుంటే మండల కేంద్రంతో పాటు జరజాపుపేట, కొండవెలగాడ, సతివాడ షాపుల్లో ఒక్కొక్క బాటిల్‌పై రూ.20నుంచి 30 వరకూ ధరలు పెంచారు. చీప్‌లిక్కర్ ధర రూ.55 అయితే రూ.80కి విక్రయించారు. బీరుపై రూ.15 నుంచి రూ.25 వరకూ పెంచారు. కొన్ని బ్రాండ్లు దొరక్క పోవడంతో వైన్‌షాపుల యజమానులు ఇష్టానుసారం అమ్ముకున్నారు. ఇక బెల్ట్‌షాపుల్లో అయితే బీర్లపై ఏకంగా రూ. 30 వరకు పెంచి విక్రయించారు. అయితే ఎక్సైజ్‌శాఖ అధికారులు మామూళ్లు దండుకోవడంలో నిమగ్నమయ్యారు తప్ప ధరల నియంత్రణ,, షాపులు వేళలు పాటించేటట్టు చేయడంలో విఫలమయ్యారు.
Advertisement
Advertisement