ఉప్పెనలా ఉద్యమం
Published Sun, Dec 29 2013 4:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఈ ఏడాదంతా అన్నివర్గాలవారూ ఉద్యమబాట పట్టారు. వ్యాపార, రాజకీయ, కర్షక, కార్మిక, శ్రామికులు చేసిన ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలతో జిల్లా దద్దరిల్లిపోయింది. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జూలై 30న తీసుకున్న నిర్ణయంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దం టూ అన్ని వర్గాల ప్రజలు రోడ్లెక్కారు. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ, ఎన్‌జీవో సంఘాలు ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపాయి. రెండు నెలల పాటు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలన్నీ స్తంభించాయి.
పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు జనవరి తొమ్మిదో తేదీన ఉద్యమించారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఏపీడీసీఎల్ విద్యుత్ స్టేషన్లను ముట్టడించారు.
తమ ప్రాణాలైనా అర్పించి కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టును అడ్డుకుంటామని అఖిలపక్షం ఆధ్వర్యంలో మార్చి నాలుగో తేదీన మత్స్యకారులుఉద్యమించారు. అణువిద్యుత్ కేంద్ర వ్యతిరేక పోరా ట కమిటీ సభ్యులు భారీగా తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు.
అరిణాం అక్కివలసలోని శ్యాంపిస్టన్ కార్మికుల సమస్యలపరిష్కారం కోరుతూ మార్చి 13న కలెక్టరేట్ వద్ద ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు.దీంతోఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. 221 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
సమైక్యం కోసం బంద్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 2న జిల్లా బంద్ పాటించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మారుమూల గ్రామాల ప్రజ లు సైతం పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.
యువగర్జన
రాష్ట్రాన్ని ముక్కలు చేసి తమకు అన్యాయం చేయవద్దంటూ ఆగస్టు 12న విద్యార్ధులంతా ‘యువగర్జన’ పేరుతో బహిరంగ సభను నిర్వహించారు. రాష్ట్ర విభజన వలన కలిగే నష్టాలు, విద్యార్థులకు హైదరాబాద్‌తో ముడిపడిన అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
మహా మానవహారం
సమైక్యాంధ్రకు మద్దుతుగా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 31న ఇచ్ఛాపురం నుంచి పైడిభీమవరం వరకూ రెండు ల క్షల మందితో ‘మహా మానవహారం’ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి జాతీయరహదారిపైకి చేరుకుని ఎడమవైపు నిలబడి చేయి చేయి కలపి మానవహారం చేశారు.
‘టీ’నోట్ ఆమోదంతో..
ేంద్రమంత్రి వర్గం తెలంగాణ నోట్‌ను అక్టోబర్ 3న ఆమోదించడంతో జిల్లావ్యాప్తంగా సమైక్యవాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. అప్పటి పరిణామాల నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ నవీన్ గులాటి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
కదం తొక్కిన అంగన్‌వాడీలు
అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలై పదో తేదీన వందలాది మంది కార్యకర్తలు కొదం తొక్కారు. కలెక్టరేట్ ముఖద్వారం నుంచి వాంబే కాలనీ వరకూ రోడ్డుపైనే బైఠాయించి మహాధర్నా చేశారు. అధికారులను అడ్డుకొని నిరసన తెలిపారు.
సమైక్యాంధ్ర ఉద్యమ ర్యాలీతో జూలై 12న జిల్లా దద్దరిల్లింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు నినదించారు. టెక్కలిలో కేంద్రమంత్రి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు.
ధరల దాడి !
శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: విజయనామ సంవత్సరం ధరల నామ సంవత్సరంగా మారిపోయింది. ఏడాది కాలమంతా ప్రజలపై ధరలు దాడి చేశాయి. భారీగా పెరిగిన ధరలతో సామాన్యుడి జీవన చిత్రం కూడా మారిపోయింది. ఇంతటి ధరాఘాతాన్ని మిగిల్చి...జీవన చక్రాన్ని చిదిమేసిందీ ఈ సంవత్సరం. ధనిక వర్గాలను సైతం ధరల పోటు వణికించింది.
గ్యాస్ బండైంది!
ధరల పెరుగుదలలో గ్యాస్ కూడా చేరింది. ఏడాది మొదట్లో సిలిండర్ ధర 373 రూపాయలు ఉండేంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నగదు బదిలీ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో నేరుగా బ్యాంకు ఖాతాలోకి ప్రభుత్వ సబ్సిడీని జమ చేస్తున్నారు. తాజాగా గ్యాస్ బండ ధర 411 రూపాయలకు (బ్యాంకు జమ కాకుండా) చేరుకోగా, డీలర్ కమీషన్ పెంచిన కారణంగా మరో రూ. 3.50 అదనపు భారమయ్యింది. దీంతో సిలిండర్ ధర రూ. 414.50కి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వినియోగదారులపై కోట్లాది రూపాయల భారం పడింది.
కూరగాయాలు!
నిత్యావసర వస్తువుల విషయానికొస్తే ఆకు కూరల నుంచి మాంసాహారం వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటిందనే చెప్పాలి. ఒకదశలో కిలో చికెన్ ధర కంటే కేజీ ఉల్లిపాయల ధర ఎక్కువ పలికిన పరిస్థితి నెలకొంది. అల్లం కేజీ ధర రూ. 130కి చేరుకోగా, వెల్లుల్లి రూ. 75, ఉల్లిపాయలు రూ. 85, బంగాళా దుంపలు 60 రూపాయలు పలికింది. కోడి గుడ్డ ధర వింటే గుడ్లు తేలేసే పరిస్థితి వచ్చింది. ఒకగుడ్డు ధర జనవరిలో మూడు రూపాయల 30 పైసలుంటే నేడు రూ. 4.70కి చేరింది. క్యారెట్, చిక్కుడు, బెండ, బీర, వంకాయ, క్యాబేజి ధరలు కూడా కేజీ రూ. 50 వరకు వెళ్లాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల నెలవారీ బడ్జెట్ మారిపోయింది. వేలాది ఇళ్లల్లో కూర వాడకం మానేశారు.
పరుగు తీసిన పెట్రోలు
పెరుగుతున్న వాహనాల జోరుకు తగ్గట్టుగానే పెట్రో ధరలు కూడా పెరిగింది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పరిశీలిస్తే..జనవరిలో లీటర్ ధర రూ. 72.65 ఉండగా, తాజాగా రూ. 77.50 వరకు ఉంది. అలాగే డీజిల్ ధరల విషయంలో 52.68 రూపాయల నుంచి తాజాగా 58.40 రూపాయలకు చేరింది. దీంతో సగటున పెట్రోల్ 5 రూపాయలు, డీజిల్ 6 రూపాయలు పెరిగింది. వాహన చోదకులపై ఈ ఏడాది సుమారు రూ. 70 కోట్ల మేర ఇంధన అదనపుభారం పడిందని మార్కెట్ అంచనాలున్నాయి. పెట్రోల్ ధరలు మార్చి నుంచి జూన్ వరకు నాలుగు రూపాయల మేర తగ్గినా, ఆ తర్వాత మళ్లీ యథావిధిగా పెరిగిపోయింది. ఇదిలావుంటే ఆర్టీసీ ధరలు కూడా ఈ ఏడాదిలో ఒకసారి పెంచగా, కిలోమీటర్‌కు సుమారు రూ.1.20 పైసలు వరకు సగటున పెరిగింది. దీంతో రవాణా చార్జీల భారం కూడా కోట్ల రూపాయలకు చేరింది.
విద్యుత్ చార్జీల భారం రూ.16 కోట్ల పైనే..
జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు ఈ ఏడాది పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. మార్చి నెలాఖరు వరకున్న 500 వాట్ల లోపల వినియోగంపై ఉన్న పాత శ్లాబ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి వినియోగంపై మరింత భారం మోపింది. దీంతో కనీసం 50 వాట్లు కంటే వినియోగం పెరగడంతోనే యూనిట్ చార్జీల టారిఫ్ ఆటోమెటిక్‌గా పెరుగుతున్నాయి. దీని ప్రకారం ఈ ఏడాది మార్చి వరకు 500 వాట్లు లోపున ఒక యూనిట్‌కు 50 యూనిట్ల వరకు రూ. 1.45, 500 వాట్లు దాటి, 50 యూనిట్లు వరకు రూ. 2.60 ఉండేది. ప్రసుత్తం ఇదే టారిఫ్‌లో 50 యూనిట్ల లోపు, 51 నుంచి 100 యానిట్ల వినియోగ యూనిట్ చార్జి రూ. 2.60, 101 నుంచి 200 వరకు రూ. 3.60, అలాగే మళ్లీ 200 యూనిట్లు దాటిన డొమస్టిక్ వినియోగదారులకు ప్రత్యేక టారిఫ్‌లను నిర్ణయించారు.
ఈ ఏడాది మార్చి వరకు కేటగిరీ-2 వినియోగదారులకు 100 యూనిట్ల వరకు రూ. 6, 100 యూనిట్లు దాటితే యూనిట్‌చార్జి రూ. 7 ఉండేది. తాజాగా 50 యూనిట్ల వరకు రూ. 6.63, 51 నుంచి 100 యూనిట్ల వరకు రూ. 7.38, 100 నుంచి 300 యూనిట్ల వరకు రూ. 8.13, 301 నుంచి 500 వరకు రూ. 8.63, 500 యూనిట్లు దాటితే యూనిట్ చార్జి రూ. 9.13 వరకు ధరను పెంచి అమలుచేశారు. దీంతో జిల్లాలో ఉన్న సుమారు 6 లక్షల మంది విద్యుత్ వినియోగదారుల నుంచి ఈ ఏడాది మార్చి వరకు నెలకు చెల్లించిన చార్జీల వసూళ్లలకంటే ఏప్రిల్ తర్వాత పెరిగిన చార్జీలతో నెలకు 1.32 కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ శాఖకు చార్జీల రూపంలో ఆదాయం వచ్చింది. ఈ లెక్కన ఏడాదికి సుమారు 16 కోట్ల రూపాయలు భారం ప్రజలపై పడినట్లైంది.
Advertisement
Advertisement