వేర్వేరు కేసుల్లో 21 మంది అరెస్టు
Published Tue, Oct 1 2013 5:53 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఇచ్ఛాపురం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో వేర్వేరు కేసుల్లో 21 మంది నిందితులను ఆయా ప్రాంతాల పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్ఛాపురం మండలంలో వేర్వేరు కేసులకు సంబంధించి ఆరుగురిని రూరల్ ఎస్‌ఐ చిన్నంనాయుడు సోమవారం అరెస్టుచేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొళిగాం గ్రామానికి చెందిన జగన్నాథొ మండల్ సెప్టెంబర్ 1న తనను అసభ్యకరంగా దూషించాడని అదే గ్రామానికి చెందిన ఊర్మిల మండల్ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి జగన్నాథొ మండల్‌ను అరెస్టు చేశారు.
తనను అసభ్యంగా దూషించారని బిర్లంగి పంచాయతీకి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుజ్జు సరోజిని ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన బాకి లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. సెప్టెంబర్ 24న హరిపురం గ్రామానికి చెందిన దక్కత రామారావు, శాస్త్రి దాడి చేశారని అదే గ్రామానికి చెందిన వడ్డెన మురళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రామారావు, శాస్త్రిని అరెస్టు చేశారు. బొడ్డబడ గ్రామానికి చెందిన భీమో బెహరపై అదే గ్రామానికి చెందిన ముకుంద బెహర, దమ్మో బెహరా దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొట్లాట కేసులో నలుగురు...
లావేరు : మండలంలోని ఆరంగిపేట గ్రామంలో జరిగిన కొట్లాట కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రామారావు తెలిపారు. సెప్టెంబర్ 23న పొల్లాలో నీటి కోసం ఆరంగి సూరిబాబు, ఆరంగి కారువాడు వర్గీయుల మధ్య తలెత్తిన వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరంగి కారువాడ, అతని వర్గానికి చెందిన ఆరంగి మల్లేష్, ఆరంగి కళావతి, బడగల రమణను సోమవారం అరెస్టు చేసి శ్రీకాకుళం కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఘర్షణ కేసులో 9మంది...
సారవకోట రూరల్ : మండలంలోని కేళవలస గ్రామంలో చెరువు లీజుకు సంబంధించి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీరామమూర్తి తెలిపారు. రాళ్లతో దాడి చేసి గాయపర్చారని ఆ గ్రామానికి చెందిన రెడ్డి శ్రీరాముల ఫిర్యాదు మేరకు చిన్నాల అప్పన్న, మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి పాతపట్నం కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
వేధింపుల కేసులో భర్త..
వేధింపుల కేసులో మండలంలోని పద్మాపుర ం గ్రామానికి చెందిన చింతు భాస్కరరావును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శ్రీరామమూర్తి తెలిపారు. తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భాస్కరరావు భార్య చింతు లక్ష్మి ఫిర్యాదు చేసిందని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.
గాయపర్చిన కేసులో ఒకరు..
పాతపట్నం : మండలంలోని చాకిపల్లి గ్రామంలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. జన్నిపాపారావు, మామిడి లక్ష్మీనారాయణ ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు. లక్ష్మీనారాయణ ఇంటి వర్షపు నీరు పాపారావు ఇంట్లో పడుతుండడంతో అడిగాడు. దీంతో లక్ష్మీనారాయణ దాడి చేశాడని పాపారావు ఫిర్యాదుచేశాడు. నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు.
Advertisement
Advertisement