రైలు నుంచి జారిపడి ఇద్దరి మృతి
Published Wed, Aug 28 2013 5:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఇచ్ఛాపురం, పలాస, న్యూస్‌లైన్: వేర్వేరు రైళ్ల నుంచి జారిపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు సోమవారం రాత్రి, మంగళవారం చోటు చేసుకున్నాయి. పలాసకు చెందిన తండా అరుణకుమారి(45), సోంపేటకు చెందిన రూప్‌చంద్రరావు (28) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి..పలాసలోని కస్పా జాలరి వీధికి చెందిన తండా అరుణకుమారి మంగళవారం ఉదయం ఒడిశా బరంపురంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇచ్ఛాపురం వచ్చేందుకు ఓ సూపర్‌ఫాస్ట్ రైలు ఎక్కింది.
అయితే ఆ రైలుకు ఇచ్ఛాపురం స్టేషన్‌లో హాల్ట్‌లేని విషయం అమెకు తెలీదు. రైలు స్టేషన్‌కు చేరుకున్నప్పటికీ ఆగకపోవడంతో కంగారుపడి దిగే ప్రయత్నంలో జారిపడినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయలవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే 108కు సమచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుడు శ్రీధర్ చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆమె మృతిచెందింది. మృతిరాలికి భర్త జగ్గారావు, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
గుర్తు తెలియని రైలు నుంచి...
సోంపేట మండలం పొత్రకుండ గ్రామానికి చెందిన బి.రూప్‌చంద్రరావు తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి మృతి చెందినట్టు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement