♦ తప్పిదాలు పునరావృతం కాకూడదంటూ..
♦ సీపీఐ(ఎం) 21వ మహాసభల్లో పాతికేళ్ల ప్రణాళిక
♦ రెండో రోజు రెండు తీర్మానాలకు ఆమోదం
సాక్షి, విశాఖపట్నం : దేశ చరిత్రలో తమ ప్రత్యేకతను ఎర్రని అక్షరాలతో లిఖించుకున్న కమ్యూనిస్టులు తామెందుకు ప్రజలకు దూరమవుతున్నామనే అంశంపై ఆత్మ విమర్శ చేసుకున్నారు. విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న 21వ సీపీఐ(ఎం) జాతీయ మహాసభలు చారిత్రక నిర్ణయాలకు వేదికవుతున్నాయి. వర్తమాన పరిస్థితులకు కారణమైన తప్పిదాలను సమీక్షించుకుంటూ, భవిష్యత్‌కు బాటలు వేసేలా చర్చలు సాగుతున్నాయి. మరో పాతికేళ్ల వరకూ పార్టీని తిరుగులేని అజేయశక్తిగా నిలిపేందుకు చేపట్టాల్సిన చర్యలు, తప్పనిసరి మార్పులపై పార్టీ పెద్దలు, ముఖ్య నేతలు రెండవ రోజు తీవ్రంగా చర్చించారు. దానితో పాటు రెండు ప్రధాన తీర్మానాలను కూడా సభలో ఆమోదించారు.
రైతులు, పేదలు, వృత్తిదారులకు నష్టం చేకూర్చి కార్పొరేట్‌లకు లాభం కలిగేలా మోడీ ప్రభుత్వం భూసేకరణ-సహాయ, పునరావాస చట్టం 2013కు సవరణ చేస్తోందని, దానిని వ్యతిరేకి స్తూ మహాసభ తీర్మానం చేసింది. దానికి సంబంధించిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కన్నన్‌మొల్లా చేసిన ప్రతిపాధనను డాక్టర్ హేమలత బలపర్చగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని సభ రెండవ తీర్మానం చేసింది.
నూతన ఆర్ధిక విధానాల వల్ల దళితుల స్థితిగతులు దిగజారడంతో పాటు అంటరానితనంతో వివిధ రూపాల్లో వివక్ష కొనసాగుతోందని, అయినా నామ మాత్ర సంఖ్యలోనే దోషులకు శిక్షలు పడుతున్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాలను మరింత బలోపేతం చేసి, అమలు చేయాలని డిమాండ్ చేసింది. దళిత క్రిస్టియన్లు, ముస్లీంలను ఎస్సీలుగా గుర్తించడానికి నిరాకరించడంతో ఉద్యోగాల భర్తీలో వారు సౌకర్యాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మహాసభల వద్ద ప్రత్యేకంగా పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కాశ్మీర్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సమావేశం వివరాలను ప్రకాష్‌కారత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గురువారం రాజకీయ చర్చలు కొనసాగనున్నాయి.రెండో రోజు మహాసభల్లో త్రిపుర సీఎం, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్చుతానందన్, త్రిపుర మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్, పొలిబ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, బృందాకారత్‌లతో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, ఏపీ ప్రతినిధి ఎస్.వెంకటరావు పాల్గొన్నారు.
ఆత్మ విమర్శ చేసుకుంటూ...
Published Thu, Apr 16 2015 2:47 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM
Advertisement