- అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లతోపాటు ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న వారికి కూడా పోస్టింగ్‌లు ఖరారు చేసింది. మొత్తం 24 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇందులో ఏడు జిల్లాలకు కొత్తగా కలెక్టర్లను నియమించారు. అందులో ఐదు జిల్లాలకు మహిళా ఐఏఎస్‌లే కలెక్టర్లుగా నియమితులయ్యారు.
అలాగే ఐదుగురు ఐఏఎస్‌లను జీహెచ్‌ఎంసీకి కేటాయించడం గమనార్హం. మున్సిపల్ పరిపాలనశాఖలో ఉన్న శైలేంద్ర కుమార్ జోషీని భారీ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే విద్యాశాఖలో వికాస్‌రాజు ఆంధ్రకు వెళ్లడంతో ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ ఆచార్యను ప్రభుత్వం నియమించింది. ఆంధ్ర నుంచి వచ్చిన నవీన్ మిట్టల్‌ను జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు.