కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా జిల్లాలో పాలన స్తంభించింది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రభుత్వ యంత్రాంగం కార్యకలాపాలు దాదాపు నిలిచిపోయాయి. కలెక్టరేట్‌లో కీలకమైన శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఎటువంటి సమస్యలు వచ్చినా, వ్యక్తిగత, సామాజిక పనులకోసమైనా ఈ కార్యాలయాలకు రావాల్సిందే. సమైక్య ఉద్యమం మిన్నంటడం, ఉద్యోగులు సైతం ఆందోళనలో పాల్గొనడంతో కలెక్టరేట్ ప్రాంగణం బోసిపోతోంది. ఖాళీ కుర్చీలు, కదలని ఫైళ్లు అధికారులను వెక్కిరిస్తున్నాయి.
సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఈ నెల 13 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే. దీంతో జిల్లా పాలనలో కీలకంగా ఉన్న శాఖల కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 16 శాఖల కార్యాలయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కలెక్టర్ కార్యాలయం, ఖజానా, పంచాయతీరాజ్, పౌర సరఫరాలు, బీసీ, ఎస్సీ, గిరిజన, వికలాంగుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల్లో సుమారు 500 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు.
రెవెన్యూశాఖలో తహశీల్దార్ నుంచి నైట్‌వాచ్‌మెన్ వరకు 120 మంది, పంచాయతీరాజ్‌లో 50మంది, ఖజానా శాఖలో 50మంది, ఇతర శాఖల్లోని ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రతి శాఖలోను జిల్లాస్థాయి ఉన్నతాధికారి మినహా మిగిలినవారు సమ్మె బాట పట్టారు. ఉన్నతాధికారులు వచ్చినా కార్యాలయం తలుపులు వేసుకుని లోపల కూర్చొని ఆఫీసు వేళలు ముగియగానే ఇంటిముఖం పడుతున్నారు.
దీంతో పాలనా వ్యవహారాలు నిలిచిపోయాయి. అవనిగడ్డ ఉప ఎన్నిక కారణంగా బందరు డివిజన్‌లోని ఎక్కువ మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వహించారు. ఎన్నికల విధులను బహిష్కరించకూడదన్న నిబంధనతో వారంతా విధులకు హాజరయ్యారు. ఈ నెల 24వ తేదీన ఓట్ల లెక్కింపు పూర్తికానుండటంతో 25వ తేదీ నుంచి బందరు డివిజన్‌లోని మరింత మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్.వి.చంద్రశేఖరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
28 నుంచి జిల్లా అధికారుల సమ్మె
సమైక్యాంధ్ర ఉద్యమలో భాగంగా జిల్లా అధికారులు ఈ నెల 28 నుంచి సమ్మెలో పాల్గొంటారని తెలుస్తోంది. అవనిగడ్డ ఉప ఎన్నిక కారణంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈ నెల 27వ తేదీ వరకు అమలులో ఉండటంతో జిల్లా అధికారులు ఇప్పటి వరకు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనటం లేదు. అయితే ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాత 28 నుంచి సమైక్యాంధ్ర ఉద్యమానికి తమ మద్దతు తెలుపుతామని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల చేతిలోకి వెళ్లడంతో ప్రభుత్వ అధికారులు అందుకు జై కొడితే జిల్లాలో ప్రభుత్వ కార్యకలపాలు లేనట్టే. అదే జరిగితే మన ప్రభుత్వం ఉండి లేనట్టే.
జిల్లాలో పాలన పడక..
Published Sat, Aug 24 2013 12:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement