నల్లగొండ/నల్లగొండ రూరల్ న్యూస్‌లైన్
‘‘ఒకరి జోలికి మేమెళ్లం...మా జోలికొస్తే వదిలిపెట్టం..’’ అనే సమాచారాన్ని సీమాంధ్ర ఉద్యోగుల చెవిలో వేసేందుకే సకల జనభేరి సభ తలపెట్టినట్టు తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. తెలంగాణ నిర్ణయానికి అడ్డంపడే శక్తులకు అర్థమయ్యేలా తెలియజెప్పేందుకే సకల జనుల సమ్మెను మించి సకల జనభేరి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 29వ తేదీన నిజాం కళాశాల మైదానంలో తలపెట్టిన సకల జనభేరి సభ విజయవంతం కోసం శుక్రవారం స్థానిక ఎస్బీఆర్ ఫంక్షన్‌హాల్‌లో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు పందిరి వెంకటేశ్వరమూర్తి అధ్యక్షతన జరిగిన సన్నాహక సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన సకల జనభేరి సభకు జిల్లా నుంచి తండోపతండాలుగా తరలివచ్చి ఉద్యమస్ఫూర్తిని మరోమారు చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి ఇంటికి ఇద్దరి చొప్పున తరలిరావడం ద్వారా సీమాంధ్ర కుట్రదారులకు దిమ్మదిరిగేలా చేయవచ్చన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నేనొక్కడిని వెళ్లకపోతే ఏమవుతనుకోవద్దు.. ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మరొకరికి తీసుకొని రావడం ద్వారా తెలంగాణవాదాన్ని, తెలంగాణవాదుల ఐకమత్యాన్ని సీమాంధ్రులకు రుచి చూపించవచ్చన్నారు.
తెలంగాణలో సకల జనుల సమ్మె సమయంలో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని గగ్గోలు పెట్టి చర్చల మీద చర్చలు జరిపిన సీమాంధ్ర మీడియాకు నేటి సీమాంధ్ర సమ్మెలో విద్యార్థులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నూటికి పది మంది ఉండి తెలంగాణ వాళ్లనే వెళ్లిపోవాలని ఉచిత సలహాలు ఇస్తారా అంటూ మండిపడ్డారు. ‘హైదరాబాద్ అభివృద్ధి అంతా తామే చేశామంటున్నారు. ఏమి చేశారు? అణగారిన వర్గాల భూములు అప్పనంగా గుంజుకున్నారు. నిజాం హయాంలో కట్టిన చారిత్రాత్మక కట్టడాలు తప్ప ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ భవనం కట్టారా? జూబ్లీహిల్స్ చుట్టూ ఫ్లైఓవర్‌లు తప్ప’ అని ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించారు. దుష్ర్పచారాలతో ప్రజలను మభ్యపెడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు, ఉద్యోగ సంఘాలకు తగిన బుద్ధిచెబుతూ వారి కుతంత్రాలను తిప్పికొట్టేందుకే జనభేరి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. భేరి విజయవంతం కోసం టీఎన్జీఓలు జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సభలు అభినందనీయమన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ప్రసంగిస్తూ సచివాలయంలో ఉద్యోగులు పనిచేస్తున్నా ప్రభుత్వం తప్పుడు నివేదికలు అందిస్తుందని ఆరోపించారు. వచ్చిన తెలంగాణను వెనక్కి నెట్టేందుకు ఏపీఎన్జీఓలు ప్రయత్నాలు సాగిస్తున్నారని, వారి ఉద్యమం తోలుబొమ్మలాంటిదని అభివర్ణించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ప్రభుత్వమే ఎస్కార్ట్ పెట్టి మరీ నడిపించిందన్నారు. తమ పోరాటం ఆంధ్ర ప్రజల మీద కాదని, తెలంగాణకు అన్యాయం తలపెట్టిన పాలకుల మీదనేనన్నారు. హైదరాబాద్ నూటికి నూరుశాతం మనదని, వీధుల్లో కవాతు నిర్వహించి సత్తా చాటుదామన్నారు.
ఉద్యోగుల సమస్యపై ప్రశ్నపత్రం ఇస్తే రెండు రోజుల్లోనే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సమాధానం ఇచ్చారని, సీమాంధ్ర ఉద్యోగులు రెండు నెలల సమయం అడిగారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్టీసీని నిర్వీర్యం చేయడం ద్వారా ప్రైవేటు ట్రావెల్స్‌ను నడిపించి సీమాంధ్ర వ్యాపారులు లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు. టీఎన్జీఓ కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ తొలిప్రాధాన్యం ఉద్యమం, రెండో ప్రాధాన్యం ఉదోగ బాధ్యతలయ్యాయన్నారు. కవి,రచయిత దేశ్‌పతి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం తెలంగాణను ఆపేందుకు సకల ప్రయత్నాలు సాగిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి నేటి వరకు టీఎన్జీఓల పాత్ర, త్యాగం అనిర్వచనీయమని, టీజేఏసీకి ఉద్యోగుల పాత్ర ఆయువు పట్టు అని పేర్కొన్నారు. ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబు ఓ కోన్‌కిస్కాగొట్టమని, సీమాంధ్ర పెట్టుబడిదారుల బోయ అని అభివర్ణించారు. సమావేశంలో టీజేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, ఆయా ఉద్యోగల సంఘాల జేఏసీ నాయకులు రేచల్, మందడి ఉపేందర్‌రెడ్డి, శివశంకర్, బుచ్చిరెడ్డి, ప్రతాప్, వేణుమాధవ్, మోహన్‌రెడ్డి, రాఘవేందర్‌రావు, మోహన్‌రావు, సురభి వెంకటేశ్వర్లు, యేపాల సత్యనారాయణరెడ్డి, మామిడాల రమేష్, జహంగీర్, శ్యాంసుందర్, జవహర్‌లాల్, అరేకంటి భిక్షమయ్య, యాదయ్య, అశోక్, శ్రావణ్, ప్రహ్లాద్, జయరాంనాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు
‘భేరి’ మోగిద్దాం..
Published Sat, Sep 28 2013 2:58 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement
Advertisement