భూములను తెగనమ్మిన ‘స్వగృహ’
సాక్షి, హైదరాబాద్: అన్ని వసతులతో కూడిన గృహ సముదాయాలు నిర్మించి తక్కువ ధరకే ప్రజలకు అమ్మే లక్ష్యంతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటైంది. అయితే, ఇళ్లను నిర్మించి అమ్మటం కంటే.. ఏకంగా భూములనే అమ్మేందుకు ఆ కార్పొరేషన్ ఇప్పుడు ఆసక్తి చూపింది. గత 3 నెలల్లో రికార్డు స్థాయిలో 300 ఎకరాలను తెగనమ్మేసింది. తద్వారా రూ.90 కోట్ల వరకు నిధులు సమకూర్చుకుంది. బ్యాంకు రుణాలు చెల్లించాల్సిన గడువు దగ్గరపడుతున్నందన ఆ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనూ ఈ- వేలంలో భూ విక్రయాల కార్యక్రమం కొనసాగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు ప్రాంతాల్లోనూ కొత్త ప్రభుత్వాలు వస్తే భూములు అమ్మడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో.. ఆ లోపే ఈ తంతు పూర్తి చేయాలనే ఆలోచనతో గత 3 నెలలుగా కార్పొరేషన్ ఇదే పనిలో ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేక అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌పై బ్యాంకుల నుంచి ఒత్తిడి తీవ్రం కావటంతో.. తమ ఆధీనంలోని భూములనమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణాలు తీర్చేందుకు సాయం కోరితే.. భూములమ్మి అప్పులు తీర్చుకొమ్మంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. దాంతో అధికారులు ఈ వేలం ద్వారా భూముల అమ్మకం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే.. భూముల అమ్మకానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని, అందుకు ఆ ప్రభుత్వాలు అనుకూలంగా లేకపోతే బ్యాంకు రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధికారులు.. ఈ లోపే ‘ఈ వేలం’ ద్వారా సాధ్యమైనన్ని భూములను అమ్మే పనిలో పడ్డారు. ఇప్పటికే తాండూరులో 150 ఎకరాలు, నల్లగొండలో 40 ఎకరాలను అమ్మేశారు. మహబూబ్‌నగర్, తణుకు, కర్నూలు, శ్రీకాళహస్తి, కాకినాడ తదితర ప్రాంతాల్లోనూ పలు విక్రయాలు చేశారు. ఇదే మంచి అవకాశమని భావించిన రాజకీయ నేతలు కొందరు కొన్నిచోట్ల తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకున్నారు. ఇంకా కార్పొరేషన్‌కు దాదాపు 1350 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో మరికొంత భూమిని అమ్మేందుకు యత్నించినా అనుకున్నంత స్పందన రాకపోవటంతో పాటు పరిపాలనపరమైన జాప్యం వల్ల అమ్మలేకపోయారు. దాంతో వాటిపై కొత్త ప్రభుత్వాల ఆదేశాల మేరకు నడుచుకోవాలని అధికారులు నిర్ణయించారు.
సమీపిస్తున్న బ్యాంకుల డెడ్‌లైన్: ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు దాదాపు రూ. 1100 కోట్ల మేర అప్పు ఉంది. ఈ మొత్తాన్ని ఈ సెప్టెంబరు లోపు తీర్చాల్సి ఉంది. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద బ్యాంకులు ఈ గడువు విధించాయి. డిమాండ్ ఉందని సంస్థ గుర్తించిన 10 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ఆ ఇళ్లను అమ్మి అప్పు తీర్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
3 నెలలు.. 300 ఎకరాలు!
Published Tue, May 20 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement