అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఉత్సాహం... టికెట్టు ఆశించి భంగపడటం... ఏ పార్టీ టికెట్టు ఇవ్వకపోవటం... తన సత్తాపై ఉన్న వ్యక్తిగత నమ్మకం... మీరే పోటీకి దిగాలని అభిమానులు ఒత్తిడి చేయటం... ఇలా కారణమేదైతేనేం ఎన్నికల రంగంలో స్వతంత్రులు నిలుస్తారు. జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల ముద్ర బలంగానే ఉంది. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో మొత్తం 167 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో అత్యధికంగా 39 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. రెండో స్థానం ఏలేశ్వరం నగర పంచాయితీకి దక్కుతుంది. ఇక్కడ 20 మంది తలపడుతున్నారు. అత్యల్పంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో కేవలం ఐదుగురు మాత్రమే బరిలో ఉన్నారు.
ఉపసంహరణకు బేరసారాలు
తమ విజయావకాశాలను దెబ్బతీయగలరని భావించే స్వంతత్ర అభ్యర్థులను ఉపసంహరింపజేసేందుకు ప్రధానపార్టీల అభ్యర్థులు కొందరు విశ్వప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో స్వతంత్రులను ‘సైలంట్’గా ఉంచేందుకు, లోపాయికారీగా తమకు సహకరించేలా చేసేందుకు కొందరు ప్రధానపార్టీల అభ్యర్థులు బేరసారాలకు దిగుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. స్వతంత్రులు ఒక్కోసారి చైర్మన్ పీఠం ఎన్నికలో కీలకం అవుతారు. వారికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారి గొంతెమ్మ కోర్కెలను తీర్చాల్సి ఉంటుంది. ఒక్కోసారి అనుకోని... ఊహించని పదవులు సాకారమవుతాయి. 2005 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు కౌన్సిల్‌లో సమాన సంఖ్యలో కౌన్సిలర్లు ఉండడంతో ఒకే ఒక్కడుగా నెగ్గిన స్వతంత్రుడు కీలకమయ్యారు. చైర్మన్‌గిరీ సగకాలం ఇస్తామని పెద్దమనుషుల ఒప్పందంతో అతని మద్దతు పొంది కాంగ్రెస్‌పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది.
రెబెల్స్‌తో తలనొప్పులు
జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న 167 మందిలో దాదాపు 70 మంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. వీరందరూ పార్టీ టికెట్టు ఆశించి భంగపడినవారే. తమకు టికెట్టు దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో 20వ వార్డులో టీడీపీ రెబల్ స్వతంత్ర అభ్యర్థి ప్రధాన అభ్యర్థిని పరుగులు పెట్టస్తున్నారు. ఇదే మున్సిపాలిటీలో 12వ వార్డులో కూడా స్వతంత్ర అభ్యర్థి ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా పోటీలో ఉన్నారు.
అమలాపురం మున్సిపాలిటీలో 2,3,12,14,16 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్ధులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. తుని మున్సిపాలిటీలో 2,3, 20,25 వార్డుల్లో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా రంగంలో ఉన్నారు. ఇదే మున్సిపాలిటీలో మరో నాలుగు వార్డుల్లో కూడా స్వతంత్రులు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రపురం మున్సిపాలిటీ 23వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం తదితర విషయాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నారు. పెద్దాపురం మున్సిపాలిటీ 20వ వార్డులో టీడీపీ రెబెల్ దూసుకుపోతున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీలో 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి హల్‌చల్ ఎక్కువగా ఉంది.
చెమటలు పట్టిస్తున్న రెబెల్స్
Published Wed, Mar 26 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM
Advertisement
Advertisement