హైదరాబాద్ : నిబంధనలు పాటించపోవడం, అధికారుల మొక్కుబడి తనిఖీలే గగన్ పహాడ్ రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఘటనకు కారణంగా తెలుస్తోంది. అధికారులు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పూర్తి అయిన తరువాతే క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. అయితే ప్రమాదం జరిగిన అక్షిత రబ్బర్ ఫ్యాక్టరీలో ఎలాంటి భద్రతా చర్యలు కనిపించలేదు.
కనీసం మంటలను ఆర్పే పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఫైరింజన్ వచ్చే చుట్టుపక్కల వారు నిస్సహాయులుగా ఉండవలసి వచ్చింది. ఈ ఘటనలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు స్పష్టం చేయడం ఘటనకు అద్దం పడుతోంది.
కాగా ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. బాయిలర్ పైప్ లీకేజ్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో బయటపడే మార్గం లేక నలుగురు కార్మికులు కాలి బూడిదయ్యారు. మరణించిన వారిని బీహార్‌కు చెందిన సందీప్, జోగిందర్, జైనివాస్, గోవింద్ చౌదరిలుగా గుర్తించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫ్యాక్టరీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నష్టపరిహారం మంజూరు చేయాలంటూ మృతుల కుటుంబీకులు పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసుల అదుపులో ఫ్యాక్టరీ యజమాని
Published Thu, Dec 26 2013 11:14 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement