హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్‌డీఏ)కి మరికొంత మంది నిపుణులను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నలుగురు నిపుణులను నియమిస్తున్నట్లు సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. వివిధ రంగాల్లో నిపుణులైన వారిని ఎంపిక చేసి గత కొన్ని రోజుల కిందటే సీఆర్‌డీఏ కమిషనర్ నివేదిక ఇచ్చారని, ఈ నివేదిక ఆధారంగా నిపుణులను ఎంపిక చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిపుణులలో డా.కేశవ్ వర్మ (ఇన్‌స్టిట్యూషనల్ గవర్నెన్స్ అండ్ ఫైనాన్స్ ఎక్స్‌పర్ట్, న్యూఢిల్లీ), వీకే పాఠక్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మాజీ చీఫ్, ఎంఎంఆర్‌డీఏ), క్రిస్టోఫర్ చార్లెస్ బెన్నింగెర్ (ఆర్కిటెక్ట్, పూణె), ఎస్‌ఎల్ డొంగ్రే (ప్రొఫెసర్, ఐఐటీ ముంబై)లు ఉన్నారు. వీళ్లందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న సీఆర్‌డీఏ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.