మాట వినలేదని వెలివేశారు
Published Mon, Mar 14 2016 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM
పసిబిడ్డలకు పాలు కూడా అమ్మొద్దని తీర్మానించారు
ఆచంటలో నాలుగు కుటుంబాలపై సంఘ బహిష్కరణ వేటు
అధికారులను ఆశ్రయించిన బాధితులు
ఆచంట : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పంచాయతీ పరిధిలోని వంగతాళ్ల చెరువు గ్రామంలో సంఘ పెద్దలు నాలుగు కుటుంబాలను వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘ పెద్దలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండకపోవడంతో గ్రామానికి చెందిన కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తి, కుడుపూడి సత్యనారాయణ కుటుంబాలపై ఆ గ్రామానికి చెందిన పెద్దలు సంఘ బహిష్కారం విధించారు. ఈ నాలుగు కుటుంబాల్లో జరిగే మంచి చెడు కార్యక్రమాలకు ఎవరూ వెళ్లకూడదని, వారితో ఎవరైనా మాట్లాడితే రూ.3 వేలు తప్పు (జరిమానా) చెల్లించాలని తీర్పు వెలువరించారు. వెలి వేయబడ్డ కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులతో పాటు కిరాణా సరుకులు కూడా అమ్మకుండా బంద్ చేశారు. వారి ఇళ్లకు కేబుల్ కనెక్షన్లు కట్ చేశారు. చివరకు ఆ కుటుంబాల్లోని చిన్నారులకు పాలు కూడా పోయకుండా చేశారు. తమకు జరిగిన అన్యాయంపై గ్రామ కుల సంఘం నుంచి మండల కుల సంఘం వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
జరిమానా చెల్లించలేదని..
సంఘ పెద్దలు విధించిన జరిమానా చెల్లిచకపోవడం, ఆక్రమిత భూములను సంఘానికి అప్పగించకపోవడమే వెలికి ప్రధాన కారణమని బాధిత కుటుంబాల వారు చెబుతున్నారు. వారి కథనం ప్రకారం.. గ్రామంలో సుమారు నాలుగు ఎకరాల రెవెన్యూ పోరంబోకు స్థలం ఉంది. ఈ భూమిని గ్రామస్తుల్లో కొందరు తలో కొంత ఆక్రమించుకుని కొబ్బరి మొక్కలు పెంచుతూ ఫలసాయం అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. అయితే గ్రామానికి ఆనుకుని ఉన్న ఆరుగురికి చెందిన భూములను రామాలయానికి ఇవ్వాలని కోరుతూ సంఘం తీర్మానించింది. ఈ విషయమై మూడేళ్లుగా సంఘ పెద్దలకు లబ్ధిదారులకు మధ్య వివాదం నడుస్తోంది. చివరకూ మగ్గురు లబ్ధిదారులు స్థలానికి బదులుగా ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున సంఘానికి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తిలకు చెందిన స్థలాలను మాత్రం సంఘం స్వాధీనం చేసుకుంది. ఈ విషయమై నియోజకవరార్గనికి చెందిన ఒక ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ పెట్టారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజాప్రతినిధి చేసిన సూచన మేరకు ఈనెల 2న పాలెంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంలో సంఘ పెద్దలు, బాధిత కుటుంబాల వారు దూషణలకు దిగారు. దీనిపై కేతా ఏసు, కుడుపూడి నరసింహరావు, గుబ్బల విష్ణుమూర్తి, కుడుపూడి సత్యనారాయణలకు రూ.500 చొప్పున సంఘ పెద్దలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించేందుకు ఆ నలుగురు నిరాకరించడంతోపాటు ఆక్రమిత భూములను సంఘానికి ఇవ్వలేదనే కారణాలతో తమపై సంఘ బహిష్కారం విధించి వెలి వేశారని నాలుగు కుటుంబాల వారు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మాతో ఎవరూ మాట్లడటం లేదు
ఏళ్ల తరబడి అనుభవిస్తున్న పోరంబోకు భూమిని సంఘం ద్వారాఆలయం కోసం ఇవ్వాలని సంఘ పెద్దలు చెప్పారు. దీనికి నిరాకరించాం. సంఘ సమావేశం పెట్టి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించారు. మా తప్పు లేకపోయినా సంఘ పెద్దలు జరిమానా విధించారు. భూమి ఇవ్వకపోవడం, జరిమానా చెల్లించకపోవడంతో వెలివేశారు. మాతో మాట్లాడితే రూ.3 వేలు జరిమానా విధిస్తామని చెప్పడంతో ఎవరూ మాట్లాడటం లేదు. కేబుల్ కనెక్షన్లు కట్ చేశారు. గ్రామానికి చెందిన ఎరువులు పురుగు మందుల డీలర్ చేలకు మందులు కూడా ఇవ్వడం లేదు.
- కేతా ఏసు, బాధితుడు
చిన్న పిల్లలన్న కనికరమైనా లేదు
చిన్నపిల్లలు కిరాణా కొట్టు దగ్గరకు వెళ్లి సరుకులు ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదు. కనీసం మా కుటుంబాల వారికి పాలు కూడా పోయనివ్వడం లేదు. మా పాపను అంగన్‌వాడీ సెంటర్‌కు కూడా తీసుకు వెళ్లడం లేదు. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం. మా పుట్టింటికి వెళ్లిపోదామని అనుకుంటున్నాను.
- కుడిపూడి తనూజ, బాధితురాలు
Advertisement