రహస్యంగా గుడాల విచారణ | 4 Held in Krupamani Suicide Case, Manhunt On for A1 | Sakshi
Sakshi News home page

రహస్యంగా గుడాల విచారణ

Published Sat, Nov 28 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

4 Held in Krupamani Suicide Case, Manhunt On for A1

జంగారెడ్డిగూడెం : తణుకు మండలం వేల్పూరులో కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్‌లోని ఒక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇత న్ని ఉంచి గోప్యంగా విచారిస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గుడాల సాయి శ్రీనివాస్‌ను పట్టుకున్నాయి. ఇతను వెల్దుర్తి కృపామణి ఆత్మహత్యానంతరం పరారయ్యాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు.

పోలీసులు ఇతని బ్యాంకు ఖాతాలన్నీ సీజ్ చేశారు. ముంబైలో ఉన్న సాయిశ్రీనివాస్ వద్ద డబ్బులు అయిపోవడంతో బ్యాంకు ఖాతాలు సీజ్ అయిన కారణంగా ఏటీఎం నుంచి నగదు రాకపోవడంతో హైదరాబాద్ చేరుకున్నాడు. అప్పటికే అతని కోసం గాలిస్తున్న ఒక బృందం ముంబైకు చేరుకుంది. ఆ సమయానికి సాయి శ్రీనివాస్ హైదరాబాద్ చేరుకున్నాడని తెలుసుకున్న ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో ఇతన్ని అదుపులోకి తీసుకుంది. ఇదంతా సాయి శ్రీనివాస్ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ఆధారంగా పోలీసులు సాగించారు.

ఇతన్ని హైదరాబాద్ నుంచి ఈ నెల 25న జంగారెడ్డిగూడెం సబ్‌డివిజన్ పరిధిలో ఓ రహస్య ప్రాంతానికి తీసుకువచ్చి పోలీసులు విచారిస్తున్నారు. విచారణకు ప్రత్యేకాధికారిగా ఉన్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, ఇంటెలిజెన్స్ డీఎస్పీ, తణుకు సీఐ అంకబాబులు సాయి శ్రీనివాస్‌ను విచారిస్తున్నట్టు తెలిసింది.
 
నోరు మెదపని నిందితుడు!

విచారణ అధికారులు ఎంతసేపు ప్రశ్నించినా సాయిశ్రీనివాస్ నోరు మెదపడం లేదని తెలిసింది. నోరువిప్పితే చాలామంది పోలీసులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జరిగిందేదో జరిగిందని, తాను ఇరుక్కున్నానని, అందువల్ల ఇతరుల పేర్లు ఏవీ కూడా సాయి శ్రీనివాస్ బయట పెట్టడం లేదని సమాచారం.

సాయి శ్రీనివాస్ వ్యవహారం మొత్తం పోలీసులకు, రాజకీయ నాయకులకు, స్పెషల్‌బ్రాంచి పోలీసులకు పూర్తిగా తెలుసునని తెలుస్తోంది. వీరందికీ సాయి శ్రీనివాస్ నెలవారీ మామూళ్లు పెద్దఎత్తున ముట్టజెప్పేవాడని సమాచారం.
 
బాగా సంపాదించిన శ్రీనివాస్
 వ్యభిచార గృహాలు నిర్వహించేవారు

 సాయి శ్రీనివాస్ ద్వారా అమ్మాయిలను తీసుకుని వెళ్లేవారని తెలిసింది. సాయి శ్రీనివాస్ ఇదే
 వృత్తిలో బాగా సంపాదించినట్టు సమాచారం. ఒక్కొక్క అమ్మాయికి మూడు నెలల పాటు కాంట్రాక్ట్ కుదుర్చుకుని రూ.లక్ష చెల్లించే విధంగా ఒప్పందంతో ముంబై తరలిస్తుంటాడని సమాచారం.

అక్కడి నుంచి నాగ్‌పూర్, పూణె ప్రాంతాలకు కూడా మహిళలను తరలిస్తాడని సమాచారం. సాయి శ్రీనివాస్ నిర్వహించిన లావాదేవీల్లో ఒక అమ్మాయికి 3 నెలలకు గాను అత్యధికంగా రూ. 5లక్షల వరకు ఇచ్చినట్టు తెలుస్తోంది. కృపామణి తలిదండ్రులు సాయి శ్రీనివాస్ వద్ద రూ.లక్ష తీసుకుని తమ కుమార్తెను పంపిసామని ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. కృపామణి అంగీకరించకపోవడంతో సాయిశ్రీనివాస్ తన సొమ్ము వెనక్కి ఇచ్చేయమని అడిగాడు.

దీంతో కృపామణి తల్లితండ్రులు లక్ష్మి, రామలింగేశ్వరరావులు తమ కుమార్తెపై ఒత్తిడి తేవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయిశ్రీనివాస్ చెబుతున్నట్టు తెలిసింది. సాయి శ్రీనివాస్‌కు రాజకీయ నాయకుల అండ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. ఎక్కడ ఉంచింది, అతను ఏం చెప్పింది చెప్పడం లేదు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement