కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ అరెస్ట్ | Main Criminal Rowdy Sheeter Gudala Sai Srinivas Arrested | Sakshi
Sakshi News home page

కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ అరెస్ట్

Published Sun, Nov 29 2015 3:23 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ అరెస్ట్ - Sakshi

కృపామణి కేసులో ప్రధాన నిందితుడు గుడాల శ్రీనివాస్ అరెస్ట్

 ఏలూరు అర్బన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెల్దుర్తి కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ భాస్కరభూషణ్ కేసు వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 20వ తేదీన మృతురాలు కృపామణి భర్త వెల్దుర్తి నాగపవన్‌కుమార్ తన భార్య కనబడడంలేదని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు పాలకోడేరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని  శృంగవృక్షం కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం దొరికింది. ఈ నేపథ్యంలో అదే నెల 25 తేదీన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కృపామణి భర్త పవన్‌కుమార్ తన భార్య ఆత్మహత్య చేసుకుందని ఆమె మృతికి కాకరపర్రు గ్రామానికి చెందిన గుడాల సాయి శ్రీనివాస్, అత్తమామలు రావూరి లక్ష్మి, నాగలింగేశ్వరరావుతో పాటు బావమరిది రాజ్‌కుమార్‌లు కారణమని ఫిర్యాదు చేశాడు. తనను గుడాల సాయి శ్రీనివాస్‌తో వేశ్యావృత్తి చేయమంటూ తల్లిదండ్రులు, అన్నలు నిర్బంధించ డంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని కృపామణి లేఖ రాయడంతో పాటు సెల్‌ఫోన్‌లో తన వేదనను వివరిస్తూ రికార్డు చేసి భర్తకు పంపింది.
 
 ముమ్మర గాలింపు
 ఈ ఉదంతం పెనుదుమారం రేపడంతో జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఈ కేసు దర్యాప్తునకు జంగారెడ్డి గూడెం, కొవ్వూరు డీఎస్పీలు కె.వెంకట రావు, ఎన్.వెంకటేశ్వరరావులను ప్రత్యేకాధికారులుగా నియమించారు. కృపామణి రాసిన లేఖ, సెల్‌ఫోన్, మృతురాలి భర్త అందించిన సాక్ష్యాలను ఫోర్సెనిక్ ల్యాబ్‌కు పంపడంతో పాటు కృపామణి తన లేఖలో నిందితులుగా పేర్కొన్న పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అక్టోబర్ 31న విశాఖపట్నంలో కేసులో ఏ-1 నిందితుడు సాయి శ్రీనివాస్‌కు చెందిన కారును స్వాధీనం చేసుకున్నా నిందితుడు శ్రీనివాస్ తప్పించుకుపోయాడు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన కృపామణి తల్లిదండ్రులు, అన్నతో పాటు నిందితులు పోలీసులకు చిక్కకుండా తన ఇంటిలో ఆశ్రయం కల్పించిన దాసని మంగలను దెందులూరు సమీపంలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు. ఆ తరువాత గాలింపు ముమ్మరం చేసి చివరకు శనివారం పెరవలి బ్రిడ్జి వద్ద కారులో ప్రయాణిస్తున్న ప్రధాన నిందితుడు సాయి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని ఎస్పీ వెల్లడించారు. వివాహితను వేశ్యావృత్తి చేయమంటూ నిర్బంధించడం దారుణంగా పరిగణించి నిందితులను కఠినంగా శిక్షించేందుకు అవసరమైన విధంగా కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు.
 
 రిమాండ్‌కు తరలింపు
 తణుకు :  అరెస్ట్‌కు ముందు తణుకు ప్రభుత్వాసుపత్రిలో గుడాల సాయిశ్రీనివాస్‌కు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఏలూరులో ఎస్పీ భాస్కర్‌భూషణ్ సమక్షంలో అరెస్ట్ చూపారు. అనంతరం తణుకు తీసుకువచ్చిన పోలీసులు శనివారం పొద్దుపోయాక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించారు.
 
 గత చరిత్ర  నేరమయమే
 ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ గతంలోనూ నేరచరితుడే అని ఎస్పీ చెప్పారు. నిందితునిపై పెరవలి, ఉండ్రాజవరం పోలీసు స్టేషన్‌లలో చాలా సెక్షన్‌ల కింద కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. పెరవలి పోలీసు స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉందన్నారు. ఇటీవల పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం ఏలూరు నివాసిగా తప్పుడు డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకున్నాడని వివరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత, జంగారెడ్డిగూడెం డీఎస్పీ కె.వెంకటరావు, తణుకు సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement