మంకమ్మతోట, న్యూస్‌లైన్: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా.. అంటూ ఆప్యాయంగా పలకరించే వైఎస్.రాజశేఖరరెడ్డి గొంతు మూగబోయి నేటికి నాలుగేళ్లవుతోంది. తాను ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్వర్ణయుగానికి బాటలు వేసిన ఆ మహానేత ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ముఖ్యమంత్రిగా తన పాలనా కాలంలో జిల్లాకు ఆయన చేసిన మేలు మరువలేనిది. ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే.
రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో రెండున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో సుమారు రెండు లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందుతోంది. దీనిద్వారా వేలాది మంది రైతులు బావులు, బోర్ల కింద రెండు పంటలు పండించుకుంటున్నారు. తమ కడుపు నింపుకోవడంతోపాటు నలుగురికి అన్నం పెడుతున్నారంటే అది మహానేత చలవే. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రపరికరాలు, పంట రుణాలు అందించడంతోపాటు పండించిన ధాన్యానికి మద్దతుధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు. జలయజ్ఞం పథకం కింద జిల్లాలో ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల భారీ ప్రాజెక్టులకు పునాది వేశారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సారెస్పీ వరదకాల్వ పనులను వేగవంతం చేశారు. మధ్యమానేరు, తోటపల్లి, గండిపల్లి, గౌరవెల్లి జలాశయాల ద్వారా సాగుభూములను సస్యశ్యామలం చేయాలని సంకల్పించారు. పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలో ఇప్పటివరకు పదివేల మందికి పైగా వైద్యసహాయం పొందారు. వారంతా వైఎస్సార్‌ను ప్రాణదాతగా కొలుస్తున్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కారాదనే ఉద్దేశంతో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ పథకం ద్వారా వేలాది మంది లబ్ధిపొందారు. ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతకుముందు రూ.75 ఉన్న సామాజిక పింఛన్లను రూ.200కు పెంచడం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా వేలాది మంది పేదలకు పస్తులుండాల్సిన బాధలు తప్పాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధితోపాటు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించడంతో ఆపద నుంచి గట్టెక్కారు. సింగరేణి కార్మికులకిచ్చే లాభాల వాటా పెంచడంతోపాటు గోదావరిఖనిలో 40 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో వారికి శాశ్వతంగా ఆశ్రయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వేలాది మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరింది.
వైఎస్సార్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వైఎస్సార్‌కే దక్కుతుంది. సంక్షేమ పథకాలే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు వైఎస్.రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తికాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు.
నేడు వర్ధంతి కార్యక్రమాలు
వైఎస్సార్ నాలుగో వర్ధంతిని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కుమార్ తె లిపారు. కరీంనగర్ వావిలాలపల్లిలో గల తేజ హై స్కూల్ వద్ద జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యాలయంలో జరిగే వై ఎస్సార్ వర్ధంతి వేడుకల్లో వైఎస్సార్‌సీపీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. నగరంలోని హౌసింగ్‌బోర్డు కా లనీలో గల శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధుల ఆశ్రమంలో పార్టీ జిల్లా నాయకుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వైఎస్సార్‌సీపీతోపాటు పలు సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నిను మరువం రాజన్నా..
Published Mon, Sep 2 2013 5:51 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement