పేదవాడికి గూడు కోసం ఏళ్ల తరబడి చెప్పులరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సెంటు భూమి కూడా ఇవ్వరు.
చీరాల, న్యూస్‌లైన్: పేదవాడికి గూడు కోసం ఏళ్ల తరబడి చెప్పులరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సెంటు భూమి కూడా ఇవ్వరు. అదేమంటే ప్రభుత్వ భూములు ఈ ప్రాంతంలో ఎక్కడా లేవని సెలవిస్తారు. కానీ కండబలం, అధికార పార్టీ అండదండలుంటే చాలు సర్కారు భూముల్ని కబ్జా చేసినా అదేమని అడిగేవారుండరు. చీరాలలో కోట్ల రూపాయల విలువ చేసే డ్రైనేజీ శాఖ భూములు ఇలా ఆక్రమణదారుల కబందహస్తాల్లో చిక్కుకుంటున్నాయి. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి రొయ్యల చెరువులు వేసినా..ఆశాఖాధికారుల కళ్లకు కనిపించడం లేదు. దాదాపు 400 ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. వివరాల్లోకి వెళితే..వ్యవసాయ భూముల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వచ్చే వరద నీరు సముద్రంలో కలిసేందుకు వీలుగా కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కుడి మురుగునీటి కాలువను ఏర్పాటు చేశారు.
వరద నీరు, పొలాల నుంచి వచ్చే మురుగు నీరంతా ఈ కాలువ నుంచి పెదగంజాం వద్ద సముద్రంలో కలుస్తుంది. భవిష్యత్తులో కాలువ వెడల్పు పెరుగుతుందన్న ఉద్దేశంతో ముందు చూపుగా డ్రైనేజీ శాఖ కాలువకు ఇరువైపులా 400 ఎకరాల వరకు ఉంచింది. కారంచేడు నుంచి పెదగంజాం వరకు రొంపేరు కాలువ 35 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. అదే పొడవున ఆశాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కాలువ పక్కనే ఉన్న భూముల్ని ఆక్రమించుకుని కొందరు వ్యవసాయం చేస్తుండగా మరికొందరు ఏకంగా రొయ్యల చెరువులను తవ్వి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.
కారంచేడు నుంచి పందిళ్లపల్లి వరకు 200 ఎకరాలను ఆక్రమించుకుని వరిసాగు చేస్తుండగా, పందిళ్లపల్లి నుంచి పెదగంజాం వరకు 200 ఎకరాలకుపైగా ఆక్రమించుకున్న భూముల్లో రొయ్యల చెరువులు తవ్వారు. ఏళ్ల తరబడి ఈ అక్రమ వ్యవహారం నిరాటంకంగా సాగుతున్నా సంబంధిత డ్రైనేజీ శాఖ వాటిని కాపాడుకునేందుకు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు.
ఆక్రమిత భూములకు పట్టాలు: భూములను ఆక్రమించుకున్న కొందరికి రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిదేళ్ల క్రితం బీ-ఫారాల పట్టాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే నకిలీ పట్టాలిచ్చారనే ఆరోపణలున్నాయి. డ్రైనేజీ శాఖ భూములు బదలాయింపు జరగకుండా బీ-ఫారాలు ఇవ్వడం అక్రమం.
రొంపేరు ఆధునికీకరణకు భూమి కరువు: ఇదిలా ఉంటే రూ.130 కోట్లతో మురుగు కాలువల ఆధునికీకరణలో భాగంగా రొంపేరు కాలువలను ఆధునికీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలువ కంటే 20 శాతం వెడల్పున కాలువను విస్తరించి అభివృద్ధి పనులు చేపట్టారు. గతేడాది ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా డ్రైనేజీశాఖ తమ భూములకు హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ అధికారులను కోరినా నేటికీ వారు ముందుకు రాలేదు. ఆధునికీకరణ జరగాలంటే తప్పనిసరిగా ఆక్రమణలో ఉన్న కొందరి భూములను స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రొంపేరు భూములకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఇంకా మిగిలి ఉన్న భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. పెపైచ్చు తాము సాగు చేస్తున్నాము కనుక భూమిపై హక్కు తమకే ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఎకరం నుంచి ఐదు ఎకరాలకు పైగా ఆక్రమించుకొని వరి, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నారు. చాలా మంది ఈ భూములను తమ సొంత భూములుగా భావించి ఇతరులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి దర్జాగా అమ్మేసుకుంటున్నా సంబంధిత డ్రైనేజీ శాఖాధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. కనీసం అక్రమార్కులకు నోటీసులు కూడా ఇవ్వకపోవడం విశేషం. కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమణలో చిక్కుకున్నా వాటిని కాపాడుకొనే ప్రయత్నం చేయకపోవడంతో ప్రస్తుతం ఆధునికీకరణ పనులకు అవసరమైన భూమి కూడా డ్రైనేజీ శాఖకు లేకపోవడం గమనార్హం.
కాలువనూ తవ్వేస్తున్నారు...
ప్రస్తుతం వేటపాలెం, చినగంజాం మండలాల్లో రొయ్యల సాగుకు అనుకూలంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఆక్రమణదారులు బరితెగిస్తున్నారు. రొంపేరు డ్రైనేజీ కోసం నిర్మించిన భారీ కరకట్టలను పొక్లెయిన్లతో తవ్వేసి రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే డ్రైనేజీ మిగులు భూములు ఆక్రమణలకు గురికాగా ప్రస్తుతం కరకట్టలను సైతం తవ్వేసి రొయ్యల చెరువులను ఏర్పాటు చేస్తుండటంతో రొంపేరు డ్రైనేజీకి ముప్పు వాటిల్లనుంది. ఎగువ ప్రాంతం నుంచి కురిసిన భారీ వర్షాలు, తుఫాను వంటి విపత్తు సమయాల్లో పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా కాపాడేవి రొంపేరు డ్రైనేజీలే. అటువంటి ప్రాధాన్యత ఉన్న డ్రైనేజీ భూములను కబ్జా చేయడంతో పాటు కరకట్టలు సైతం తవ్వేస్తున్నారు. డ్రైనేజీ భూములను తవ్వి రొయ్యల చెరువుగా ఏర్పాటు చేస్తున్న వారిలో అధికంగా అధికార పార్టీకి చెందిన నేతలున్నారు. దీంతో ఆ శాఖాధికారులు కళ్లకు గంతలు కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులు ఆడిందే అట... పాడిందే పాటగా సాగుతోంది.
ఆక్రమణదారులకు నోటీసులిస్తాం..
డ్రైనేజీ శాఖ ఈఈ సుధాకర్
రొంపేరు కుడి కాలువపై జరుగుతున్న ఆక్రమణలు ఇటీవల మా దృష్టికి వచ్చాయి. వీటిపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునేందుకు మా అధికారులను ఆదేశించాం. త్వరలో అక్రమంగా చెరువులు తవ్వుతున్న వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.