ఏపీలో 43 శాతం ఫిట్‌మెంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రయాణికుల కష్టాలకు ఫుల్‌స్టాప్ పడింది. ఆంధ్రప్రదేశ్‌లో గత బుధవారం నుంచి సమ్మెలోకి దిగిన ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు ఎట్టకేలకు 43 శాతం ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె వీడి విధుల్లో చేరాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సుదీర్ఘంగా చర్చలు సాగించాయి. చివరకు 43 శాతం వేతన సవరణకు అంగీకరిస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.
ఎరియర్స్‌ను పదవీ విరమణ సమయంలో ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) తీసుకునే లోపే అందిస్తామని కార్మిక సంఘాలకు హామీనిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల ఎరియర్స్‌ను దసరా, దీపావళి పండగులకు అందిస్తామని ప్రకటించింది. 43 శాతం ఫిట్‌మెంట్ వల్ల నెలకు రూ.73 కోట్లు, ఏడాదికి రూ.936 కోట్ల భారం పడుతుందని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు నాలుగు రోజుల్లో పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించిన మర్నాడే ప్రభుత్వం దిగొచ్చిందని, లేదంటే 8 రోజులుగా సమ్మె చేస్తున్నా తమను పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఆర్టీసీ చార్జీలు పెంచే యోచన లేదు
ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె ముగిసినట్లేనని కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. కార్మిక సంఘాల నేతలతో చర్చల అనంతరం రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. చార్జీలు పెంచే యోచనేదీ లేదని చెప్పారు.
రూ.వంద కోట్ల నష్టం: మంత్రి శిద్ధా
ఆర్టీసీ కార్మికులు ఎనిమిది రోజులుగా చేసిన సమ్మె వల్ల ఆర్టీసీకి రూ.వంద కోట్ల నష్టం వాటిల్లిందని రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. సమ్మె సమయంలో 70 శాతం బస్సులు నడిపామని, ఆర్టీసీ భవిష్యత్తు దృష్ట్యా 43 శాతం ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పామన్నారు.
భారాన్ని వివిధ మార్గాల్లోసమకూర్చుకుంటాం: ఎండీ
43 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి రూ.936 కోట్ల భారం పడుతుందని, ఈ భారాన్ని వివిధ మార్గాల్లో సమకూర్చుకుంటామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. ఈ భారాన్ని ప్రజలపై మోపేది లేదన్నారు.
చార్జీలు పెంచితే సహించం: వైఎస్సార్‌సీపీ
ఆర్టీసీ సిబ్బందికి ఫిట్‌మెంట్ ఇవ్వడం వల్ల భారం పడిందనే పేరుతో ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు బస్సు చార్జీలను పెంచితే సహించేది లేదని వైఎస్సార్‌సీపీ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ తరువాత బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోరాడి తమ డిమాండ్లను సాధించుకున్న ఆర్టీసీ కార్మికులకు అభినందనలు తెలిపారు. కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చినప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే సంస్థపై మరింత భారం పడి ఉండేదే కాదని, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడే వారే కాదని పద్మ అన్నారు. ఈ సమస్యను రెండు ప్రభుత్వాలూ నాన్చి పెద్దది చేశాయని ఆమె విమర్శించారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెలో కార్మికులు విజయవంతంగా తమ డిమాండ్లను సాధించుకోవడం పట్ల వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రాజారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఏపీలో బకాయిలు 1,548 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను 2013 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. పెంచిన వేతన సవరణ ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి రానుంది. అయితే, 2013 నుంచి 2015 మార్చి వరకు ఎరియర్స్ రూ.1,548 కోట్లు మేర ఉన్నాయి. వీటికి సంబంధించి బాండ్లు జారీ చేయనున్నారు. ఆర్టీసీలో అన్ని స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి నెలా జీతాల రూపంలో రూ.180 కోట్లకు పైగా ఖర్చవుతుంది. రూ.10వేల మూల వేతనం ఉన్న ఉద్యోగికి 43 శాతం ఫిట్‌మెంట్‌తో రూ.4,300 పెరగనుంది.
ఆనందంతో ఆగిన గుండె
తొండూరు: ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందనే వార్త విని సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబైన ఓ డ్రైవర్ గుండెపోటుకు గురై మృతి చెందాడు. వైఎస్‌ఆర్ జిల్లా తొండూరుకు చెందిన పి. నారాయణ(46) పులివెందుల డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సమ్మెలో కూడా పాల్గొన్నాడు. 43% ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం అంగీకరించిందనే వార్తను టీవీలో చూసిన నారాయణ.. ఆనందంతో గుండెపోటుకు గురై కన్నుమూశాడు.