గోదావరి ఎక్స్‌ప్రెస్ వద్ద కేక్ కట్ చేస్తున్న లోకో పైలట్ వీరభద్రరావు, వై.ఆర్.రెడ్డి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఉత్తరాంధ్ర వాసుల ఇష్ట రైలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు విశాఖ నుంచి నేరుగా నడిచే ఏకైక రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్. జంట నగరాలకు ఎన్ని రైళ్లు నడుస్తున్నా గోదావరికి ఉన్న ఆదరణ వేరు. ఎప్పుడూ పూర్తి ఆక్యుపెన్సీతో నడిచే ఈ రైలు ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని కాదు.. కాదు.. కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీన్ని ప్రయాణికులు ముద్దుగా వీఐపీ రైలు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి, అధికారి అయినా హైదరాబాద్ వెళ్లాలంటే వారి మొదటి చాయిస్ గోదావరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే. ఇప్పుడీ పరిచయం అంతా ఎందుకంటే ఈ రైలు ప్రారంభమై శుక్రవారానికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ వై.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సాయంత్రం ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న ఈ రైలు వద్ద లోకోపైలట్ జి.వీరభద్రరావు, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, స్టేషన్ సూపరింటెండెంట్ వరకుమార్‌లు కేక్ కట్ చేశారు. ముందుగా ఇంజన్‌న్‌తో పాటు వెనక బోగీలను పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా వై.ఆర్.రెడ్డి మాట్లాడుతూ 1975లో తాను ఏయూలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఈ రైలులో ప్రయాణిస్తున్నానన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు 1974 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పట్టాలపై పరుగులు తీస్తున్నట్టు ఇంటర్‌నెట్‌లో తెలియజేస్తుందని తెలిపారు. ఇంజన్ వద్ద కేక్ కట్ చేసి, ప్రయాణికులకు, శానిటేషన్ సిబ్బందికి, అధికారులకు, లోకో, అసిస్టెంట్ లోకో పైలట్‌లకు తినిపించారు. కేరింతల నడుమ హ్యాపీ జర్నీ అంటూ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ మాజీ ఏజీఎం నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం ఆగస్టు నెలలో ఈ రైలును ప్రారంభించినట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment