godavari express
-
గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లు రద్దు: సౌత్ సెంట్రల్ రైల్వే
సాక్షి,హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో రైళ్లు భారీగా రద్దవుతున్నాయి. తాజాగా గోదావరి ఎక్స్‌ప్రెస్ సహా 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదివారం సేవలందించాల్సిన హైదరాబాద్- విశాఖ- హైదరాబాద్ (12728/12727) గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు మొత్తం 19 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తాజా బులిటెన్ విడుదల చేసింది. భారీ వర్షాలకు పట్టాలపై వరదనీరు చేరడంతో మరో 15 రైళ్లను దారిమళ్లిస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య సర్వీసులందించే విశాఖ ఎక్స్‌ప్రెస్ (17016) రైలును ఈ సాయంత్రం 4.50 గంటలకు బదులుగా సాయంత్రం 6.50గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తాజా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రైలు సర్వీసుల పునరుద్ధరణ, భద్రతాపరమైన చర్యలపై ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద అధికారులతో చర్చించారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్.. కోట్ల మంది ఎమోషన్!
ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా.. బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో.. అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ గొడావరికి దొరకవండీ.. ట్రైన్ అంటే ట్రైన్ గొడావరి.. షార్ప్.. విమానం కన్నా పర్ఫెక్ట్ టైమింగ్.. అదీ.. అదీ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న పాపులారిటీ. యాభయ్యేళ్ళ క్రితం హైదరాబాద్ డెక్కన్.. విశాఖ మధ్య ప్రారంభమైన ఈ ట్రైన్ మామూలు ఇనుప యంత్రం కాదు.. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికీ ఉన్న ఒక ఎమోషనల్ బంధం.. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ యాభయ్యేళ్లలో ఎన్నో కోట్లమందిని కలిపిన ఆత్మీయ బంధం.. అన్నిటికీ మించి అది ఒక వీఐపీ ట్రైన్. రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా.. అప్పుడే బీకామ్.. బీఎస్సీ చదివిన సింహాచలానికి ఉద్యోగం కావాల్సి వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు.. నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా.. ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు.. అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి. హైదరాబాద్‌లో కొత్తకాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్లో దిగబెడుతూ కిటికీ ఇవతల నుంచి కన్నీళ్ల మాటున తల్లి జాగ్రత్తలు చెబుతూ.. కాసింత దూరాన నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు.. రెణ్ణెల్ల తరువాత ఆషాఢానికి బయల్దేరిన భార్యను హైద్రాబాదులో ఎక్కిస్తూ 'నువ్వు ఒంటరిగా పోవచ్చుగా.. నా మనసును.. ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలా' అంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం.. ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం.. ఐడ్రాబాడ్లో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు సన్యాసి దగ్గరకు బయల్దేరిన నారాయణమ్మ, బంగార్రాజు దంపతులు స్టీల్ కేరేజిలో పులిహోరా.. పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కితే మళ్ళా సికింద్రాబాదు వరకూ ఏమీ కొనేది లేదు.. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మా అంటూ పిల్లా పెద్దా గోదాట్లో కాయిన్లు వేయడం.. అదో నమ్మకం.. గోదారిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం.. అదో గొప్ప సంస్కృతి. విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయల్దేరే గోదారి.. రెండున్నర గంటల తరువాత స్టయిల్ మార్చేస్తుంది.. యాండీ.. మీది ఆ సీటు కదండీ.. ఇక్కడ ఉన్నారేంటీ.. వెళ్లిపోండి.. ఆయ్.. అంటూ గదమాయించే ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులూ, నేతి పూతరేకులూ అని అరుపులు వినిపిస్తే ఓ.. ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం. ఏమిరా భాయ్.. ఇంకెంతసేపు ఆపుతాడు మల్ల.. ఈ ఫుడ్ మస్తుందిరా.. మనూళ్ళో ఇలా ఉండదేందిరా అని మల్లేశం చెప్పే కామెంట్లు.. ఆయన భోనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి.. ఇలా వేర్వేరు సంస్కృతులు.. పద్ధతులు.. ఎన్నో.. ఎన్నెన్నో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం.. మరువలేని అనుబంధం. -సిమ్మాదిరప్పన్న -
గోదావరి ఎక్స్‌ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. నేటితో ఆ రైలు పరుగులు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. విశాఖ స్టేషన్‌లోని ప్లాట్ఫార్మ్పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. నేటి రాత్రి 11 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్‌ప్రెస్ సంబరాలు జరపనున్నారు. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఈ రైలు విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ల మధ్యలో నడుస్తుంది. ఇదీ చదవండి: ‘కానుక’ తలుపు తడుతోంది! -
భద్రతకు భరోసా.. ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ రైలు బోగీల మధ్య ప్రధాన తేడాలివే...
2017 జనవరి: ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఏపీలోని విజయనగరం సమీపంలో పట్టాలు తప్పింది. కోచ్‌లు చెల్లాచెదురై ఒకదానిపైకి ఒకటి చొచ్చుకెళ్లాయి. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023 ఫిబ్రవరి 15: విశాఖపట్నం నుంచి వస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరికాసేపట్లో సికింద్రాబాద్ చేరుకుంటుందనగా బీబీనగర్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. ఆరు కోచ్‌లు పక్కకు ఒరిగినా ఒకదానిపైకి ఒకటి మాత్రం దూసుకెళ్లలేదు. ఫలితంగా ప్రాణనష్టం లేకుండానే ప్రయాణికులు బయటపడ్డారు. ఈ రెండు దుర్ఘటనల్లో ఉన్న తేడా.. తొలి ప్రమాదంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లు ఉన్నాయి, రెండో ప్రమాదానికి గురైన గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను వినియోగించారు. ఈ మార్పే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. సాక్షి, హైదరాబాద్: బీబీ నగర్ సమీపంలో బుధవారం ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాయి. ప్రమాద సమయంలో రైలు దాదాపు 80 కి.మీ. వేగంతో వెళ్తున్నప్పటికీ ప్రయాణికులకు పెద్దగా గాయాలు కూడా కాకపోవడం విశేషం. దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ రైలుకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మార్పే ప్రయాణికులకు వరంగా మారింది. జర్మనీ పరిజ్ఞానంతో... భారతీయ రైల్వే దశాబ్దాలుగా తమిళనాడులోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఉత్పత్తి చేస్తున్న బోగీలను వినియోగిస్తూ వస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు అవి ప్రయాణికులపాలిట మృత్యులోగిళ్లుగా మారుతున్నాయి. దీంతో వాటిని కాకుండా, జర్మనీ పరిజ్ఞానంతో రూపొందే లింక్ హాఫ్మాన్బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలను వినియోగించాలని నిర్ణయించి మారుస్తోంది. ఈ మార్పు జరిగిన రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలుగుతున్నారు. దీంతో ఇవి సత్ఫలితాలనిస్తున్నట్టు గుర్తించిన రైల్వే, వీలైనంత వేగంగా అన్ని రైళ్లకు వాటినే వాడాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐసీఎఫ్ కోచ్ తయారీని నిలిపేసింది. అన్ని కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తయారు చేస్తోంది. ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ బోగీల మధ్య ప్రధాన తేడాలివే... ►ఈ బోగీలలో డ్యూయల్ బఫర్ హుక్ కప్లర్స్ ఉంటాయి. బోగీకి, బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. ►రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి దూసుకుపోతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం వీటి వల్లే జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ►ఈ బోగీల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ. మాత్రమే. కానీ చాలా రైళ్లను గరిష్టంగా 110 కి.మీ. వేగంతోనే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోతూ భారీ శబ్దం చేస్తాయి. ►వీటిలో స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించినప్పుడు బోగీలు ఊయల లాగా ఊగకుండా ఈ విధానం నిరోధించలేకపోతోంది. ►ఇందులో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేక్ వేశాక రైలు చాలా దూరం ముందుకెళ్లి ఆగుతుంది. ►స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ. కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ. 85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ►ఒక్కో కోచ్‌లో 64 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ ఉంది. ►ఈ బోగీలకు సెంటర్ బఫర్ కప్లర్లుంటాయి. ►ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిపై ఒకటి దూసుకుపోవు. ►బోగీలు 200 కి.మీ. వేగాన్ని సైతం తట్టుకొనేలా ఉంటాయి. కానీ వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వేగంతో పరుగుపెట్టేందుకు వీలుంటుంది. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ►వీటిల్లో ఎయిర్ కుషన్ సస్పెన్షన్వ్యవస్థ ఉంటుంది. రైలు వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండవు. ►బోగీలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనివల్ల రైలు కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు. ►మైల్డ్ స్టీల్‌తో రూపొందే ఏసీ కోచ్‌లు రూ.2.5 కోట్లు, స్లీపర్ అయితే రూ. కోటిన్నర వరకు ఖర్చవుతోంది. ►ఐసీఎఫ్ కంటే 2 మీటర్ల ఎక్కువ పొడవు ఉండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,428 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 43 ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి 68 రేక్స్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నాటికి ఈ సంఖ్య 53గా ఉండగా ఏడాది కాలంలో అదనంగా మరో 15 రేక్స్‌కు వాటి ఏర్పాటు పూర్తయింది. వెరసి ఇప్పటివరకు 1,428 కోచ్‌లను బదలాయించి సంప్రదాయ ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయగలిగారు. అయితే ఇంకా 150 రైళ్లకు మార్చాల్సి ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ మరింత ఊపందుకుంటే తప్ప వాటి బదలాయింపులో వేగం పుంజుకోదు. -
పట్టాలు తప్పిన గోదావరి
-
గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం (ఫొటోలు)
-
పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్.. ‘ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు’
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో ఈ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. అంకుషాపూర్‌లోని రైలు ప్రమాద స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. 16 పైగా బోగిలతో విశాఖ నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్ బయల్దేరిందని, అందులోని ఆరో బోగీలు పట్టాలు తప్పినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అన్నారు. రైలులోని వారిని ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్ (040 27786666) ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. దెబ్బ తిన్న పట్టాలు, సిమెంట్ దిమ్మెల తొలగింపు కొనసాగుతోందని.. సుమారు 400 మంది రైల్వే సిబ్బంది మరమత్తు చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. Train No.12727 (Visakhapatnam - Secunderabad) Godavari Express got derailed btw Bibinagar - Ghatkesar. *6 coaches derailed:* S1 to S4, GS, SLR *No casualties/Injuries* Passengers are being cleared by the same train by detaching the derailed coaches. Helpline No: 040 27786666 pic.twitter.com/YuBIln1BgK — South Central Railway (@SCRailwayIndia) February 15, 2023 ‘గోదావరి ఎక్స్‌ప్రెస్ భోగిలన్నీ జర్మనీకి చెందిన ఎల్‌హెచ్‌బీ(లింకే-హాఫ్మన్-బుష్) బోగిలే. ఒక ఎల్ఎహెచ్బీ కోచ్ కాలపరిమితి 35 ఏళ్లు. కరంబూర్ చెన్నై రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇవి ఉత్పత్తి అవుతాయి. ఎల్‌హెచ్‌బీ టెక్నాలజీతో రైలు పల్టీ కొట్టే అవకాశం ఉండదు. స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం స్టీల్‌తో కోచ్‌ల తయారీ అవుతాయి. 2020 నుంచి ఈ టెక్నాలజీ కోచ్‌లను తయారు చేయిస్తున్నాం. ఈ టెక్నాలజీనే అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడింది. ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఏ కోచ్‌కు ఆ కోచ్ విడిపోతాయి. ఒక బోగీతో, మరో బోగీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎత్తు ఎక్కువగా ఉండటం వల్ల బోగీలు పక్కకు జరగవు. ఎల్‌హెచ్‌బీ కోచ్ వల్లే ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు ఎంత స్పీడ్‌లో ఉన్నా.. ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం ఆధునాతనంగా ఉంటుంది. ఎయిర్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ద్వారా బోగీలు ఢీ కొనడం లాంటివి, స్లయిడ్ అవ్వకుండా ఆపగలుగుతుంది.’ అని తెలిపారు. -
బీబీనగర్ వద్ద పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్
-
Godavari Express: పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్
సాక్షి, యాదాద్రి: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలోని అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. ప్రమాద సమయంలో మరో ట్రాక్‌పై నుంచి గూడ్స్ రైలు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితమని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని వివిధ రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. బీబీనగర్ స్టేషన్లో విశాఖ-మహబూబ్‌నగర్ ప్రత్యేక రైలును ఆపేశారు. తిరుపతి-పూర్ణా (నాందేడ్) స్పెషల్, దిబ్రూగఢ్-సికింద్రాబాద్ స్పెషల్ రైళ్లను భువనగిరిలో నిలిపేశారు. ట్రాక్ మరమ్మతులు పూర్తయిన తర్వాత వీటిని పంపనున్నారు. -
గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్లాట్‌ఫామ్‌ల మార్పు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన రైల్వే స్టేషన్లో ఒకే చోట ఎక్కువ రద్దీ ఏర్పడకుండా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పక్కపక్క ప్లాట్‌ఫామ్స్‌లోకి ఒకేసారి మూడు, నాలుగు రైళ్లు వచ్చే వేళల్లో కొన్ని రైళ్లను దూరంగా ఉన్న వేరే ప్లాట్‌ఫామ్స్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దీన్ని అమలు చేస్తున్నారు. ఈనెల 12 (నేటి) నుంచి 21 వరకు మూడు ప్రధాన రైళ్లలో ఈ మార్పులు చేశారు. హైదరాబాద్–విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 1కి బదులు ప్లాట్‌ఫామ్ 10 నుంచి బయల్దేరుతుంది. లింగంపల్లి–కాకినాడ పోర్టు గౌతమి ఎక్స్‌ప్రెస్ కూడా ప్లాట్‌ఫామ్ 1కి బదులు 10 నుంచి బయల్దేరుతుంది. ఇక హజ్రత్ నిజాముద్దీన్ బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ నెం 10 నుంచి కాకుండా ప్లాట్‌ఫామ్ 1 నుంచి బయల్దేరుతుంది. కాగా, సికింద్రాబాద్ స్టేషన్లో మాస్కులు ధరించని 169 మంది నుంచి రూ.34,100ను పెనాల్టీగా వసూలు చేశారు. ( సంక్రాంతి రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో జన సాధారణ రైళ్లు) -
ఆ రైల్లో సీటు దొరకడమే కష్టం.. ఇప్పుడు మాత్రం
విశాఖపట్నం: విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే అత్యధిక డిమాండ్ ఉన్న ఏకైక రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్. ఎన్ని రైళ్లు వచ్చినా గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ రైలులో రిజర్వేషన్ దొరికితే చాలు అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. ఇక జనరల్ బోగీల్లో ప్రయాణించేందుకే ఉదయం నుంచి చాంతాడంత క్యూ కట్టాల్సిందే. తీరా రైలొచ్చాక సీటు కోసం కుస్తీ పట్టాల్సిందే. ఎప్పుడూ కిక్కిరిసి బయలుదేరే ఈ రైలు కరోనా ప్రభావంతో.. సాఫీగా రాకపోకలు సాగిస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్ ఉన్నవాళ్లు మాత్రమే ప్రయాణించడం వలన ఈ రైలు ప్రశాంతంగా బయలుదేరుతోంది. జనరల్ బోగీల్లో ప్రయాణించాలన్నా.. ముందుగా సీటు రిజర్వేషన్ చేయించుకోవాల్సిందే. దీంతో అందరూ రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులే వస్తున్నారు. దీంతో ఈ రైలు ఏ విధమైన తోపులాటలు, రద్దీ లేకుండా బయలుదేరుతోంది. -
16న న్యూఢిల్లీ–విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ రద్దు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): సాంకేతిక కారణాల దృష్ట్యా న్యూఢిల్లీ – విశాఖపట్నం మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 16న రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్ ఇన్చార్జ్ పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం తాటిచెట్లపాలెం (విశాఖ): విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లే (12727) గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు విశాఖ నుంచి శుక్రవారం సాయంత్రం 5.20కి హైదరాబాద్‌కు బయల్దేరింది. ప్లాట్‌ఫాం దాటిన వెంటనే కేరేజ్ అండ్ వేగన్ రోలింగ్ సిబ్బంది అప్పారావు, వెంకటరావు.. గార్డ్ బోగీలో ఉన్న హ్యాండ్ బ్రేక్ పట్టేయడాన్ని గుర్తించారు. ఈ బ్రేక్ పట్టేయడం వల్ల అప్పటికే ట్రాక్ కొన్ని మిల్లీమీటర్ల మేర గాడి తప్పింది. విషయాన్ని రోలింగ్ సిబ్బంది సూపరిండెంట్ ఇంజనీర్ అచ్యుతరావుకు తెలిపారు. ఆయన వాకీ టాకీ ద్వారా గోదావరి ఎక్స్‌ప్రెస్ గార్డును, డ్రైవర్‌ను అప్రమత్తం చేసి వెంటనే రైలును ఆపాలని ఆదేశించారు. సాంకేతిక సిబ్బంది అక్కడికి చేరుకుని హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి, వాక్యూమ్ క్లియర్ చేసి రైలును పంపించారు. గార్డ్ బోగీ బ్రేక్ పట్టేసిన చిత్రం -
గోదావరి ఎక్స్‌ప్రెస్ @ 45 ఏళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఉత్తరాంధ్ర వాసుల ఇష్ట రైలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు విశాఖ నుంచి నేరుగా నడిచే ఏకైక రైలు గోదావరి ఎక్స్‌ప్రెస్. జంట నగరాలకు ఎన్ని రైళ్లు నడుస్తున్నా గోదావరికి ఉన్న ఆదరణ వేరు. ఎప్పుడూ పూర్తి ఆక్యుపెన్సీతో నడిచే ఈ రైలు ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని కాదు.. కాదు.. కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీన్ని ప్రయాణికులు ముద్దుగా వీఐపీ రైలు అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధి, అధికారి అయినా హైదరాబాద్ వెళ్లాలంటే వారి మొదటి చాయిస్ గోదావరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే. ఇప్పుడీ పరిచయం అంతా ఎందుకంటే ఈ రైలు ప్రారంభమై శుక్రవారానికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత గీతం యూనివర్సిటీ ప్రొఫెసర్ వై.ఆర్.రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సాయంత్రం ఎనిమిదో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న ఈ రైలు వద్ద లోకోపైలట్ జి.వీరభద్రరావు, స్టేషన్ డైరెక్టర్ రాజగోపాల్, స్టేషన్ సూపరింటెండెంట్ వరకుమార్‌లు కేక్ కట్ చేశారు. ముందుగా ఇంజన్‌న్‌తో పాటు వెనక బోగీలను పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా వై.ఆర్.రెడ్డి మాట్లాడుతూ 1975లో తాను ఏయూలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఈ రైలులో ప్రయాణిస్తున్నానన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు 1974 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పట్టాలపై పరుగులు తీస్తున్నట్టు ఇంటర్నెట్లో తెలియజేస్తుందని తెలిపారు. ఇంజన్ వద్ద కేక్ కట్ చేసి, ప్రయాణికులకు, శానిటేషన్ సిబ్బందికి, అధికారులకు, లోకో, అసిస్టెంట్ లోకో పైలట్లకు తినిపించారు. కేరింతల నడుమ హ్యాపీ జర్నీ అంటూ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ మాజీ ఏజీఎం నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రైల్వే ఉన్నతాధికారులు మాత్రం ఆగస్టు నెలలో ఈ రైలును ప్రారంభించినట్టు చెబుతున్నారు. -
ఎల్ఈడీ లైట్లు.. జీపీఎస్ సౌకర్యం
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఇకపై ప్రయాణికులకు గొప్ప అనుభూతిని మిగల్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఇకపై ఎల్ఈడీ లైట్లు, జీపీఎస్ సౌకర్యాలతో పాటు అదనపు హంగులు జతచేరనున్నాయి. పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారతీయ రైల్వే చేపట్టిన ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా వివిధ రైళ్లలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగానే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని 24 బోగీలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ప్రారంభించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అమిత్ వర్ధన్ సర్క్యులర్ విడుదల చేశారు. ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా 2018–19 సంవత్సరంలో మొత్తం మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 640 బోగీలను వివిధ హంగులతో పునరుద్ధరించనున్నారు. తొలి విడతలో భాగంగా 140 బోగీలను.. రెండవ విడతలో మిగిలిన 500 బోగీలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి బోగీకి రూ. 60 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది మార్చిలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. – సాక్షి, హైదరాబాద్ ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్న కొత్త సొగసులు.. ►కలర్ స్కీంలో భాగంగా రొటీన్ ఎరుపు, పసుపు రంగుల్లో కాకుండా అందమైన పోలీయురిథేన్ (పీయూ) పెయింటింగ్‌లో రైలు బోగీలు ప్రయాణికులను ఆకట్టుకోనున్నాయి. ►బోగీల్లో జీపీఎస్ సదుపాయంతో ఎల్ఈడీ ఇండికేషన్ బోర్డ్‌లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. ►అన్ని బోగీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. ►టాయిలెట్లు, డోర్లు, బెర్త్‌ల మధ్యన, బోగీల లోపల అంతా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ►అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే సాధనాలు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. అలాగే రైళ్లలోని వాష్బేసిన్లన్నీ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసినవి అమరుస్తారు. ► తడిని పీల్చేలా, పొడిగా, పరిశుభ్రంగా ఉండేందుకు టాయిలెట్స్‌లో సైతం పాలిమెరైజ్డ్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. ► బెర్త్‌లు సైతం మరింత సౌకర్యవంతంగా తయారు చేస్తున్నారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
-
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ
సాక్షి, సికింద్రాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ చోరీ జరిగింది. నగరానికి వస్తున్న వాణి అనే ప్రయాణికురాలి వద్ద నుంచి గుర్తుతెలియని దుండగులు కోటి రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ చోరీ జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
రైల్లో నుంచి జారిపడి యువకుడి మృతి
పరుగులు తీస్తున్న రైలు బండిలో నుంచి జారిపడి యువకుడు మృతిచెందిన సంఘటన రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న దాడి శివ అనే యువకుడు ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ సోదాల్లో ‘గోదావరి’ టికెట్లు లభ్యం
నేడో రేపో రౌడీషీటర్ అరెస్టుకు సన్నాహాలు విశాఖలో కొంతకాలం అనుచరులతో నయీం మకాం? నగరంలో కొనసాగుతున్న సిట్ విచారణ పూర్తి వివరాలు రాబట్టే పనిలో మూడు రోజులుగా ఇక్కడే మకాం హైదరాబాద్ సోదాల్లో ‘గోదావరి’ టికెట్లు లభ్యం ఆ డేటా కోసం భువనేశ్వర్‌కు.. సీసీ ఫుటేజీల కోసం కోల్‌కతాకు.. తీగ లాగితే డొంక కదులుతోంది.. గ్యాంగ్‌స్టర్ నయీం జాడలు స్పష్టంగా కనబడుతున్నాయి.. నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖ నగరంపై కరడుగట్టిన నేరగాడు నయీం నీడలు కమ్ముకోవడం నిజమేనని.. అతగాడి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు నిర్థారణకు వచ్చారు. తమకు లభించిన కొద్దిపాటి ఆధారాలతో విశాఖలో నయీం కార్యకలాపాలపై దృష్టి సారించిన సిట్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలే లభిస్తున్నాయి. మూడురోజులుగా నగరంలోనే మకాం వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలక సమాచారాన్నే రాబట్టగలిగారు. నగర శివారులోని పోతిన మల్లయ్యపాలెంలో పేరుమోసిన రౌడీషీటర్, భూకబ్జాదారుడిగా పోలీసు రికార్డుల్లోకెక్కిన ఓ నేరస్తుడితో నయీంకు సన్నిహితసంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులుఅనుమానిస్తున్నారు. దాంతో కొన్నాళ్లుగా ఆ రౌడీషీటర్ కదలికలు.. అతగాడు సాగించిన భూదందాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. విశాఖపట్నం : గ్యాంగ్‌స్టర్ నయీం ఇళ్లలో సిట్ అధికారులు జరిపిన సోదాల్లో విశాఖ, సికింద్రాబాద్ మధ్య రైళ్లలో రాకపోకలు సాగించిన టికెట్లు లభ్యమయ్యాయి. వాటిలో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీల్లో ప్రయాణించిన టికెట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆధారంగానే నయీం పలుమార్లు విశాఖకు వచ్చినట్టు నిర్థారించుకున్నారు. విశాఖ నగరంలో భూదందాలు, సెటిల్మెంట్లు చేసేందుకే వచ్చినట్టు సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే నగర శివార్లలో పేరుమోసిన రౌడీషీటర్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. దర్యాప్తులో ఆ రౌడీషీటర్‌తో పాటు నగరానికి చెందిన మరికొందరు భూకబ్జాదారులతో కలిసి నయీం దందాలు సాగించినట్టు భావిస్తున్నారు. అయితే ముందుగా పీఎంపాలెంకు చెందిన రౌడీషీటర్‌ను నేడో రేపో అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని భావిస్తున్నారు. కాగా, రెండు నెలల కిందట పెద్దసంఖ్యలో అనుచరులను వెంటేసుకుని విశాఖకు వచ్చిన నయీం కొంతకాలం ఇక్కడే మకాం వేసినట్టు సిట్ విచారణలో తేలింది. దాంతో వారు ఎక్కడ ఉన్నారు.. ఎవరు ఆశ్రయం కల్పించారనే విషయాలపై పక్కాగా సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. ఫుటేజీలు మావల్ల కాదన్న ఆర్పీఎఫ్ అధికారులు ఇదిలా ఉంటే రైల్వే స్టేషన్‌లోని సీసీ ఫుటేజీలను సిట్‌కు పూర్తి స్థాయిలో అందించే విషయంలో విశాఖ ఆర్పీఎఫ్(రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) అధికారులు చేతులెత్తేసినట్టు తెలిసింది. అందుబాటులో ఉన్న వివరాలను గత రెండురోజులుగా అందించిన ఆర్పీఎఫ్ వర్గాలు మరింత సమాచారం కావాలంటే కోల్‌కతాలోని ఆర్పీఎఫ్ కమిషనర్‌ను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు సీసీ ఫుటేజీ వీడియోల కోసం కోల్‌కతాకు వెళ్లాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. కాగా, నయీం బృందం విశాఖ- సికింద్రాబాద్ మధ్య ప్రయాణించిన సందర్భాల్లో రైల్వే టికెట్ల రిజర్వేషన్‌ను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గానే తీసుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఆ టికెట్లు రెండు నెలల ముందువి కావడంతో వాటి సమాచారం విశాఖ రైల్వే అధికారుల వద్ద లేదు. కానీ ఆ సమాచారం తూర్పు కోస్తా రైల్వే జోన్ కేంద్రం భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఆఫీసులో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఆ సమాచారం కోసం సిట్ వర్గాలు భువనేశ్వర్ పయనమైనట్టు తెలిసింది. కాగా, విశాఖ నగరంలో మకాం వేసిన సిట్ అధికారుల బృందంలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నట్టు తెలిసింది. డాక్యుమెంట్ రైటర్‌తో సంబంధాలు? విశాఖపట్నం విభజనతో ఆర్థిక రాజధానిగా మారిన విశాఖ పరిసరాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆదే అదనుగా నగరంలో ఓ గ్యాంగ్ తయారైంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితో తయారైన ఈ గ్యాంగ్ వెనక నయీమ్ ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధురవాడలో అనేక భూ కబ్జాలు ఈ గ్యాంగ్ చేసిందన్న అనుమానాలు ఉన్నాయి. కబ్జా చేసిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, వాటిని కోర్టులో వేసి అసలు భూ యజమానులను ముప్పుతిప్పలు పెట్టడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. దీనికోసం వారు నగరంలో ఓ డాక్యుమెంట్ రైటర్‌ను ఉపయోగించుకునేవారు. సిట్ అధికారుల తాజా విచారణలో నయీమ్‌కు నగరంలోని ఓ డాక్యుమెంట్ రైటర్‌తో సంబంధాలున్నాయని తేలింది. దీంతో ఈ మూఠా నయీమ్దేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక కొందరు పోలీసు ఉన్నతాధికారులతోనూ నయీమ్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంబంధాలపై కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది. -
ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ..
⇒ శ్రీనగర్ అల్లర్లలో చిక్కుకున్న అనపర్తివాసులు ⇒ వారం రోజులు భయూందోళనల గుప్పిట్లోనే.. ⇒ ఎట్టకేలకు గురువారం స్వస్థలానికి చేరిక ⇒ అమరనాథుడి కటాక్షమే కాపాడిందని ఉద్వేగం అనపర్తి(బిక్కవోలు): తిరిగి ప్రాణాలతో వస్తామనుకోలేదని, అమరనాథుడి కరుణా కటాక్షాల వల్లే తామంతా బతికి బయటపడ్డామని అనపర్తి నుంచి అమరనాథ్ యాత్రకు వెళ్లి, శ్రీనగర్ అల్లర్లలో, కర్ఫ్యూలో చిక్కుకున్న భక్తులు ఉద్వేగభరితంగా చెప్పారు. గురువారం రాత్రి గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో అనపర్తి చేరుకున్న వారికి బంధువులు,స్నేహితులు సాదరంగా స్వాగతం పలికారు. తమ వారు క్షేమంగా తిరిగి రావడంతో వారంతా పరమానందభరితులయ్యూరు. కాగా సురక్షితంగా తిరిగి వచ్చిన వారు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ అనుభవాల్ని వివరించారు. అనపర్తికి చెందిన 17 మంది సభ్యులతో కూడిన బృందం జూన్ 30న పవిత్ర అమర్నాథ్ యాత్రకు బయలుదేరి వెళ్ళామని అనపర్తికి చెందిన సబ్బెళ్ళ త్రినాథరెడ్డి తెలిపారు.తనతో పాటు సబ్బెళ్ళ భామిరెడ్డి, సబ్బెళ్ళ పార్వతి, పడాల కళ్యాణ్‌రెడ్డి, పడాల ధనలక్ష్మి, చిర్ల లక్ష్మీతులసి,తేతలి బుల్లిగంగిరెడ్డి, తేతలి అనంతలక్ష్మి, నల్లమిల్లి పార్వతి, తేతలి గౌరీదేవి(బేబి), సందక అనిల్‌కుమార్, నల్లమిల్లి నాగిరెడ్డి, కె.కాంచన, నల్లమిల్లి రాజేశ్వేరి, తేతలి రామచంద్రరెడ్డి, తేతలి మణిలతో కూడిన బృందం 6న శ్రీనగర్ చేరుకున్నామన్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో అక్కడ చిక్కుకుపోయామన్నారు. శ్రీనగర్ చేరుకున్నది మొదలు కష్టాలు పడుతూనే యాత్ర కొనసాగించామని, 7వ తేదీన అమరనాథుడిని దర్శించుకోవలసి ఉండగా రెండు రోజుల పాటు కర్ఫ్యూ కారణంగా బస్సులోనే ఉండి పోవలసి వచ్చిందని చెప్పారు. సోమవారం కర్ఫ్యూ సడలించిన తరువాత స్వామిని దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా మరలా అల్లర్లు చెలరేగడంతో శ్రీనగర్ పట్టణ శివారులో బస్సును నిలిపి వేశారని, దీంతో తిరిగి రెండు రోజుల పాటు బస్సులోనే ఉండిపోవలసిన పరిస్థితి ఎదురైందని తెలిపారు. వెంట తెచ్చుకున్న ఆహర పదార్థాలు, తాగునీరు కూడా అయిపోవడంతో భయాందోళనల మధ్య బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపామన్నారు. మంగళవారం రాత్రి ఆందోళనకారులు బస్సుపై రాళ్లు రువ్వడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును వేగంగా నడిపి అందరినీ రక్షించాడని తెలిపారు. భద్రతా దళాల రక్షణతో బస్సును శ్రీనగర్ దాటించారని, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారి సలహా మేరకు ఉదంపూర్ మీదుగా గురువారం తెల్లవారేసరికి ఢిల్లీ చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి ముందస్తు ప్రణాళిక ప్రకారం విమానంలో హైదరాబాద్ మీదుగా విశాఖపట్నం చేరుకున్నామని గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి అదే రోజు రాత్రికి అనపర్తి చేరుకున్నట్లు వారు తెలిపారు. ‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. నిజంగా అమరనాథుడి దయ వల్లే మేమంతా బతికి బయటపడ్డా’మని వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. దేవుడే మా కుటుంబాన్ని రక్షించాడు కుటుంబ సమేతంగా అమరనాథ్ యాత్రకు వెళ్లాం. అక్కడ పరిస్థితి చూస్తే మరలా ఇంటికి వస్తామా అని అనుమానం కలిగింది. ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా ఇంటికి చేరుకున్నాం - సబ్బెళ్ళ పార్వతి, గృహిణి, అనపర్తి టీవీల్లో వీక్షించింది నిజంగా చూశాం ఉగ్రదాడుల గురించి టీవీలలో చూపిస్తుంటే సాధారణంగా పట్టించుకోం. కానీ దేవుడి దర్శనానికి వెళ్లిన మేము మా కళ్లారా అలాంటి దృశ్యాలు చూశాం. ఆ అనుభవం జీవితంలో మరిచిపోలేనిది. - నల్లమిల్లి రాజే శ్వరి, గృహిణి, అనపర్తి భద్రతా దళాల సహకారం మరువలేనిది భద్రతా దళాలు చేసిన సహకారం మరిచిపోలేనిది. వారి సహకారం లేకుంటే ఇంకా అక్కడే భయాందోళనల మధ్య ఉండేవాళ్ళం. అడుగడుగునా ప్రాణాలకు తెగించి యాత్రికులకందిస్తున్న సహాయం అభినందించదగినది. - తేతలి అనంతలక్ష్మి, గృహిణి, అనపర్తి స్వచ్ఛంద సంస్థల సేవలు భేష్ ఇబ్బందుల్లో ఉన్న యాత్రికులను ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా స్వచ్ఛంద సంస్థలు మాత్రం అడుగడుగునా సేవలందించారుు. నీరు, ఆహారం అందిస్తూ యాత్రికులకు అన్ని విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నాయి. - తేతలి గౌరీదేవి(బేబి), గృహిణి, అనపర్తి -
‘గోదావరి ఎక్స్‌ప్రెస్’ దొంగ ఊహాచిత్రం విడుదల
హైదరాబాద్: గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు మత్తు మందు ఇచ్చి నిలుపు దోపిడీ చేసిన అపరిచితులపై నాంపల్లి రైల్వే పోలీసుస్టేషన్లో దోపిడీ కేసు నమోదైంది. వీరిలో ఒకరి ఊహా చిత్రాన్ని రైల్వే పోలీసులు విడుదల చేశారు. మత్తు శీతల పానీయాలను సేవించిన ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి చేరుకుని హైదరాబాదులోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ప్రయాణికులు కలకత్తాకు చెందిన అంజన్ సర్కార్ (58), అతని భార్య సుభ్ర సర్కార్(58), కుమారుడు సుంక్ సర్కార్ (26)గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా మత్తు మందు ఇచ్చిన వ్యక్తుల కోసం రైల్వే పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లకు పంపింది. బాధితులు చెప్పిన వివరాల ప్రకారం ఓ వైద్యుడు ఇలాంటి దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
మత్తు మందిచ్చి నిలువు దోపిడీ
హైదరాబాద్: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు తెగబడ్డారు. ఏలూరు-తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ల మధ్య రైలులో ప్రయాణికులకు మత్తు మందిచ్చి సొత్తు దోచుకెళ్లారు. వారిచ్చిన శీతల పానీయాలు స్వీకరించిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రయాణికులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలివి... పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎ.సర్కార్(65), ఎస్.సర్కార్(58), ఎస్.సర్కార్(26)లు గోదావరి ఎక్స్‌ప్రెస్ హెచ్1 ఏసీ కోచ్‌లోని 15, 16, 17 బెర్త్‌ల్లో ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరు మహిళ. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో అదే బోగీలో ప్రయాణిస్తున్న అపరిచితులు బాదం పాలలో మత్తు మందు కలిపి ముగ్గురికీ ఇచ్చారు. కొంతసేపటికీ ముగ్గురూ గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దీంతో దొంగలు వారి వద్దనున్న సొత్తు దోచుకెళ్లారు. గురువారం ఉదయం రైలు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుంది. అపస్మారక స్థితిలో ఉన్నవారిని గమనించిన పోలీసులు గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారని, ఏపీ, తెలంగాణాల్లో విహార యాత్రకు వచ్చారని పోలీసులు తెలిపారు. వారి వద్ద ఉన్న వీడియో కెమెరా, సెల్‌ఫోన్, ఆపిల్ ఐ ప్యాడ్, రూ.4,630 నగదు, లగేజీని రైల్వే స్వాధీనం చేసుకున్నారు. హెచ్1 బోగీని ఇన్స్పెక్టర్ రంగయ్య బృందం పరిశీలించింది. సంఘటనా స్థలంలో బాదం పాల బాటిల్స్ సేకరించారు. బోగీ ఏసీ మెకానిక్ వెంకటేశ్వర్లును అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రయాణికులు మాట్లాడే స్థితిలో లేరని, కోలుకోగానే పూర్తి వివరాలను రాబడతామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి
-
రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ
-
రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ
విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీబోగీలో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన ఓ తండ్రి, తల్లి, కుమారుడు గురువారం రాత్రి ఏసీ బోగీలో హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి వేళలో వారికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు కలిపిన బాదం మిల్క్ సరఫరా చేసి వారి వద్ద ఉన్న నగలు, నగదుతో పాటు సెల్ఫోన్లను దోచుకున్నారు. గురువారం ఉదయం వారు నాంపల్లి చేరుకున్న తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. తాడే పల్లి - ఏలూరు మధ్యలో మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కలహాల కాపురానికి ముగ్గురు బలి
మధిర : ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య మధిరకలహాల కాపురం ముగ్గురిని బలిగొంది. తండ్రి క్షణికావేశం ముక్కుపచ్చలారని పిల్లలను మత్యువుపాల్జేసింది. భార్యతో గొడవపడి కూతురు, కుమారుడిని వెంటబెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిన భర్త పిల్లలతో సహా రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్‌కు కిలోమీటరు దూరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపలిలో విషాదాన్ని నింపింది. పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన గుండా సరోజన, యాకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతు రు ఉన్నారు. చిన్న కుమారుడు వెంకటరమణ(34) హైదరాబాద్‌కు చెందిన వసంతను ప్రేమించి యూదగిరిగుట్టలో 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు అశ్రుద్ (10), కూతురు అభిజ్ఞ(7) ఉన్నారు. వెంకటరమణ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్టెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వసంత తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం వరంగల్ నగరానికి మకాం మార్చారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం పిల్లలను తీసుకుని వెంకటరమణ ఇంట్లో నుం చి బయటికి వెళ్లాడు. వారం రోజులు వివిధ ప్రాంతాల్లో తిరిగిన వారు బుధవారం రాత్రి మధిర రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో ట్రాక్‌పై విగతజీవులయ్యారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శోకసంద్రంలో గోపనపల్లి.. వెంకటరమణ, అశ్రుద్ధ, అభిజ్ఞ మతదేహాలను పోస్టుమార్టం అనంతరం గోపనపల్లికి గురువారం రాత్రి తరలించారు. మృతదేహాల రాకతో గ్రామస్తులంతా మృతుల ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలపై పడి వెంకటరమణ తల్లి సరోజన, భార్య వసంత బోరున విలపించారు. విచారణ చేపట్టాలి వెంకటరమణ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని, ప్రభుత్వం విచారణ చేపట్టాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్ను నర్సయ్య డిమాండ్ చేశారు. అది ఆత్మహత్య కాకపోవచ్చని, హత్య జరిగి ఉండొచ్చన్నారు. -
రైలు కిందపడి ముగ్గురి ఆత్మహత్య
-
దురంతో ఇక దగ్గరగా..
ప్రయాణికులకు అనుకూలంగా వేళల మార్పు సెప్టెంబర్ నుంచి అమలు తెల్లారేసరికి రాజధాని చేరిక ఇక దురంతో వైపు అందరూ మొగ్గు విశాఖపట్నం : హైదరాబాద్ వెళ్లాలంటే అందరికీ గుర్తుకొచ్చేది గోదావరి ఎక్స్‌ప్రెస్. సమయపాలనలో క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ ట్రెయిన్ విశాఖ స్టేషన్లో నంబర్ వన్. ఇక్కడ ఒకటో నంబర్ ప్లాట్ఫారం నుంచి బయల్దేరి రాజధానిలోనూ అదే నంబర్ ప్లాట్ఫారంలో ఆగుతుంది. సాయంత్రం బయల్దేరి ఆరునూరైనా తెలతెలవారుతుండగా ప్రయాణికులను హైదరాబాద్‌లో దించేస్తుంది. వీఐపీలంతా ఈ రైలుకే ప్రియారిటీ ఇస్తారు. అత్యంత వేగంగా ప్రయాణించే నాన్‌స్టాప్ ట్రెయిన్ దురంతో ఎక్కుదామంటే ఉదయాన్నే రాజధానికి చేరుకోలేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు రాబోతుంది. గోదావరిని కాదని జనం దురంతో వైపు అడుగులేయబోతున్నారు. గోదావరి కంటే ముందుగా హైదరాబాద్‌కు చేరుకోబోతోంది. రాజధానికి మూడేళ్ల క్రితం దురంతో ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు భారీగా ఉన్న రద్దీని తగ్గించాలనే ప్రయత్నంతోనే ఈ రైలును తీసుకొచ్చారు. వారానికి మూడు రోజుల పాటు ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ నుంచీ గోదావరి ఎక్స్‌ప్రెస్ కన్నా ముందుగానే సికింద్రాబాద్‌కు చేరుకునేలా రాకపోకల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం విశాఖలో ఈ రైలు 10.30 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవాలి. కానీ అరగంట ఆలస్యంగానే చేరుకుంటుంది. దీంతో వీఐపీలంతా ఈ రైలు వేళలపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నాన్‌స్టాప్ రైలుగా పేరుగాంచిన దురంతో ఎప్పుడూ ఆలస్యంగానే గమ్యానికి చేరుకోవడాన్ని సీరియస్‌గా పరిగణించిన రైల్వే అధికారులు ఎట్టకేలకు రాకపోకల వే ళలు మారిస్తే గానీ ప్రయోజనం ఉండదని గుర్తించారు. అందుకే ఈ రైలు వేళల్ని రాత్రి 10.30 గంటలకు బదులు రాత్రి 8.15 గంటలకే బయల్దేరేలా రైల్వే టైంటేబుల్ పట్టిక లో మార్పు చేశారు. అంతేకాదు గోదావరి మాదిరిగా ఉదయం 6 గంటల్లోగానే సికింద్రాబాద్ చేరుకుంటుంది. గోదావరి కన్నా దాదాపు 3 గంటలు ఆలస్యంగా బయల్దేరి ఆ రైలుతో సమానంగా గమ్యానికి చేరుతుండడంతో ఇకపై ఎక్కువ మంది దురంతోనే ఆశ్రయిస్తారని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అత్యాధునికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్
స్టార్ హోటళ్లను తలపిస్తున్న ఏసీ బోగీలు ఈ ప్రయోగం ఫలిస్తే మరో 14 ఎక్స్‌ప్రెస్‌లలోనూ ఆధునిక వసతులు హైదరాబాద్, వేసవి సెలవుల్లో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ బోగీలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ముందుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం ఫలిస్తే మరో 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ఇదే విధంగా రూపొందించనున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ఏసీ బోగీలను అత్యంత ఖరీదైనవిగా, స్టార్ హోటళ్ల తరహాలో తీర్చిదిద్దారు. టిలో ఏపీ టూరిజం చిత్రాలను ఆకట్టుకుంటున్నాయి. టాయిలెట్, మిర్రర్ లైటింగ్, ఎమర్జెన్సీ విండో, కోచ్ నెంబరు, నెంబర్ ఇండికేషన్ బోర్డు, రైళ్ల రాకపోకల వివరాలను అమర్చారు. టాయిలెట్లలో కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల టాయిలెట్ ద్వారా ఎప్పటికప్పుడు బయటకు రావాల్సిన వ్యర్థం రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బయటకు వస్తుంది. ఫలితంగా రైల్వే స్టేషన్లు అపరిశుభ్రం కాకుండా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వారికి ఫస్ట్ ఏసీ చార్జి రూ.2,205, సెకండ్ ఏసీ రూ.1,310, థర్డ్ ఏసీ రూ.925గా నిర్ణయించారు. -
అత్యాధునికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్, న్యూస్‌లైన్: వేసవి సెలవుల్లో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ బోగీలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ముందుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం ఫలిస్తే మరో 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ఇదే విధంగా రూపొందించనున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ఏసీ బోగీలను అత్యంత ఖరీదైనవిగా, స్టార్ హోటళ్ల తరహాలో తీర్చిదిద్దారు. వీటిలో ఏపీ టూరిజం సీనరిస్ ఆకట్టుకుంటున్నాయి. టాయిలెట్, మిర్రర్ లైటింగ్, ఎమర్జన్సీ విండో, కోచ్ నెంబరు, నెంబర్ ఇండికేషన్ బోర్డు, రైళ్ల రాకపోకల వివరాలను అమర్చారు. టాయిలెట్లలో కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల టాయిలెట్ ద్వారా బయటకు రావాల్సిన వ్యర్థం రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బయటకు వస్తుంది. ఫలితంగా రైల్వే స్టేషన్లు అపరిశుభ్రం కాకుండా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వారికి ఫస్ట్ ఏసీ చార్జి రూ.2,205, సెకండ్ ఏసీ రూ.1,310, థర్డ్ ఏసీ రూ.925గా నిర్ణయించారు. -
‘గోదావరి’లో బాంబు కలకలం
సామర్లకోట, న్యూస్‌లైన్ : గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందన్న వదంతులతో సామర్లకోటలో ఆ రైలును శనివారం రాత్రి నిలిపివేశారు. రాత్రి 8.20 గంటల నుంచి 9.40 వరకు పోలీసులు రైలులో గాలించారు. బాంబు బెదిరింపు ఉట్టిదేనని తేలాక రైలు కదిలింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రైస్‌లో బాంబు ఉందని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం వచ్చిన్నట్టు పెద్దాపురం డీఎస్పీ అరవింద్‌బాబు తెలిపారు. రైలు తుని దాటిన తరువాత రాత్రి 7.45 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రతి బోగీలోనూ గాలించాయి. ఎస్ 3 బోగీలోని 52వ నంబర్ బెర్త్‌లో అనుమానాస్పదంగా ఓ సూట్‌కేసు ఉండడంతో దానిని తెరచి చూశారు. లోపల ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎస్-1 బోగీ దిగువ భాగంలో అనుమానంగా ఉన్న వైరు కట్టను స్వాధీనం చేసుకున్నారు. సామర్లకోటలో రైలును నిలిపి వేసి ప్రయాణికులు అందరూ మూడో నంబరు ప్లాట్ ఫామ్ నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌కు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. 24 బోగీల్లోని ప్రయాణికులు దిగి అక్కడకు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ మేనేజరు సీహెచ్ సుబ్రహ్మణ్యం, రైల్వే జీఆర్పీ సీఐ బి.రాజు, ఆర్పీఎఫ్ ఎస్సై రవిశంకర్ సింగ్, జీఆర్పీ ఎస్సై గోవిందరెడ్డి, పెద్దాపురం సీఐ కె. నాగేశ్వరరావు, ఎస్సైలు ఎండీఎంఆర్ ఆలీఖాన్, నాగార్జున, రమణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ప్రయాణికులు అందరూ రైలు ఎక్కిన తరువాత రాత్రి 9.50 గంటలకు రైలు బయలుదేరింది. -
పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు నెక్కొండలో హాల్ట్
విజయవాడ, న్యూస్‌లైన్: ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే పద్మావతి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12764/12763)కు వరంగల్ జిల్లా నెక్కొండలో హాల్ట్ కల్పిస్తున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్వో మైకేల్ శుక్రవారం తెలిపారు. ఈ రైలు నెక్కొండకు రాత్రి 8.55కి చేరి 8.56కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.56కి వచ్చి 1.57కి బయలుదేరుతుంది. ఈ మార్పు శనివారం నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుందన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు మహబూబాబాద్‌లో హాల్ట్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే గోదావరి ఎక్స్‌ప్రెస్ (నంబర్ 12728/12727)ను వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో ఒక నిమిషం పాటు నిలుపుతారు. ఈ ట్రైన్ మహబూబాబాద్‌కు రాత్రి 8.32కి చేరి 8.33కి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి 1.54కి వచ్చి 1.55కి బయలుదేరుతుంది. ఈ మార్పు శని వారం నుంచి ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది.