ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా.. బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో.. అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ గొడావరికి దొరకవండీ.. ట్రైన్ అంటే ట్రైన్ గొడావరి.. షార్ప్.. విమానం కన్నా పర్ఫెక్ట్ టైమింగ్.. అదీ.. అదీ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న పాపులారిటీ.
యాభయ్యేళ్ళ క్రితం హైదరాబాద్ డెక్కన్.. విశాఖ మధ్య ప్రారంభమైన ఈ ట్రైన్ మామూలు ఇనుప యంత్రం కాదు.. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికీ ఉన్న ఒక ఎమోషనల్ బంధం.. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ యాభయ్యేళ్లలో ఎన్నో కోట్లమందిని కలిపిన ఆత్మీయ బంధం.. అన్నిటికీ మించి అది ఒక వీఐపీ ట్రైన్. రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా.. అప్పుడే బీకామ్.. బీఎస్సీ చదివిన సింహాచలానికి ఉద్యోగం కావాల్సి వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు.. నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా.. ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు.. అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి.
హైదరాబాద్‌లో కొత్తకాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్‌లో దిగబెడుతూ కిటికీ ఇవతల నుంచి కన్నీళ్ల మాటున తల్లి జాగ్రత్తలు చెబుతూ.. కాసింత దూరాన నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు.. రెణ్ణెల్ల తరువాత ఆషాఢానికి బయల్దేరిన భార్యను హైద్రాబాదులో ఎక్కిస్తూ 'నువ్వు ఒంటరిగా పోవచ్చుగా.. నా మనసును.. ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలా' అంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం.. ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం..
ఐడ్రాబాడ్‌లో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు సన్యాసి దగ్గరకు బయల్దేరిన నారాయణమ్మ, బంగార్రాజు దంపతులు స్టీల్ కేరేజిలో పులిహోరా.. పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కితే మళ్ళా సికింద్రాబాదు వరకూ ఏమీ కొనేది లేదు.. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మా అంటూ పిల్లా పెద్దా గోదాట్లో కాయిన్లు వేయడం.. అదో నమ్మకం.. గోదారిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం.. అదో గొప్ప సంస్కృతి.
విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయల్దేరే గోదారి.. రెండున్నర గంటల తరువాత స్టయిల్ మార్చేస్తుంది.. యాండీ.. మీది ఆ సీటు కదండీ.. ఇక్కడ ఉన్నారేంటీ.. వెళ్లిపోండి.. ఆయ్.. అంటూ గదమాయించే ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులూ, నేతి పూతరేకులూ అని అరుపులు వినిపిస్తే ఓ.. ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం.
ఏమిరా భాయ్.. ఇంకెంతసేపు ఆపుతాడు మల్ల.. ఈ ఫుడ్ మస్తుందిరా.. మనూళ్ళో ఇలా ఉండదేందిరా అని మల్లేశం చెప్పే కామెంట్లు.. ఆయన భోనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి.. ఇలా వేర్వేరు సంస్కృతులు.. పద్ధతులు.. ఎన్నో.. ఎన్నెన్నో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం.. మరువలేని అనుబంధం.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment