![Godavari Express Accident Averted Due To LHB Coaches Advanced Safety Technology - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/16/MAXRESDEFAULT.jpg.webp?itok=k3e-WN_X)
2017 జనవరి:
ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ వెళ్తున్న హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ఏపీలోని విజయనగరం సమీపంలో పట్టాలు తప్పింది. కోచ్‌లు చెల్లాచెదురై ఒకదానిపైకి ఒకటి చొచ్చుకెళ్లాయి. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
2023 ఫిబ్రవరి 15:
విశాఖపట్నం నుంచి వస్తున్న గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరికాసేపట్లో సికింద్రాబాద్ చేరుకుంటుందనగా బీబీనగర్ సమీపంలోని అంకుషాపూర్ వద్ద పట్టాలు తప్పింది. ఆరు కోచ్‌లు పక్కకు ఒరిగినా ఒకదానిపైకి ఒకటి మాత్రం దూసుకెళ్లలేదు. ఫలితంగా ప్రాణనష్టం లేకుండానే ప్రయాణికులు బయటపడ్డారు. ఈ రెండు దుర్ఘటనల్లో ఉన్న తేడా.. తొలి ప్రమాదంలో సంప్రదాయ ఐసీఎఫ్ కోచ్‌లు ఉన్నాయి, రెండో ప్రమాదానికి గురైన గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు జర్మనీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను వినియోగించారు. ఈ మార్పే ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది.
సాక్షి, హైదరాబాద్: బీబీ నగర్ సమీపంలో బుధవారం ఉదయం గోదావరి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ప్రమాదంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాయి. ప్రమాద సమయంలో రైలు దాదాపు 80 కి.మీ. వేగంతో వెళ్తున్నప్పటికీ ప్రయాణికులకు పెద్దగా గాయాలు కూడా కాకపోవడం విశేషం. దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ రైలుకు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మార్పే ప్రయాణికులకు వరంగా మారింది.
జర్మనీ పరిజ్ఞానంతో...
భారతీయ రైల్వే దశాబ్దాలుగా తమిళనాడులోని పెరంబూర్‌లో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో ఉత్పత్తి చేస్తున్న బోగీలను వినియోగిస్తూ వస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు అవి ప్రయాణికులపాలిట మృత్యులోగిళ్లుగా మారుతున్నాయి. దీంతో వాటిని కాకుండా, జర్మనీ పరిజ్ఞానంతో రూపొందే లింక్ హాఫ్‌మాన్‌బుష్ (ఎల్‌హెచ్‌బీ) బోగీలను వినియోగించాలని నిర్ణయించి మారుస్తోంది.
ఈ మార్పు జరిగిన రైళ్లు ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలుగుతున్నారు. దీంతో ఇవి సత్ఫలితాలనిస్తున్నట్టు గుర్తించిన రైల్వే, వీలైనంత వేగంగా అన్ని రైళ్లకు వాటినే వాడాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐసీఎఫ్ కోచ్ తయారీని నిలిపేసింది. అన్ని కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను తయారు చేస్తోంది.
ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ బోగీల మధ్య ప్రధాన తేడాలివే...
►ఈ బోగీలలో డ్యూయల్ బఫర్ హుక్ కప్లర్స్ ఉంటాయి. బోగీకి, బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి.
►రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిపైకి ఒకటి దూసుకుపోతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం వీటి వల్లే జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
►ఈ బోగీల గరిష్ట వేగ పరిమితి గంటకు 120 కి.మీ. మాత్రమే. కానీ చాలా రైళ్లను గరిష్టంగా 110 కి.మీ. వేగంతోనే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోతూ భారీ శబ్దం చేస్తాయి.
►వీటిలో స్ప్రింగ్ సస్పెన్షన్ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించినప్పుడు బోగీలు ఊయల లాగా ఊగకుండా ఈ విధానం నిరోధించలేకపోతోంది.
►ఇందులో సాధారణ ఎయిర్ బ్రేక్ విధానం ఉంటుంది. బ్రేక్ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేక్ వేశాక రైలు చాలా దూరం ముందుకెళ్లి ఆగుతుంది.
►స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ. కోటిన్నర, స్లీపర్ బోగీకి రూ. 85 లక్షల వరకు ఖర్చు అవుతోంది.
►ఒక్కో కోచ్‌లో 64 మంది ప్రయాణికులు వెళ్లేలా సీటింగ్ ఉంది.
►ఈ బోగీలకు సెంటర్ బఫర్ కప్లర్లుంటాయి.
►ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిపై ఒకటి దూసుకుపోవు.
►బోగీలు 200 కి.మీ. వేగాన్ని సైతం తట్టుకొనేలా ఉంటాయి. కానీ వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ వేగంతో పరుగుపెట్టేందుకు వీలుంటుంది. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
►వీటిల్లో ఎయిర్ కుషన్ సస్పెన్షన్‌వ్యవస్థ ఉంటుంది. రైలు వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండవు.
►బోగీలకు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీనివల్ల రైలు కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు.
►మైల్డ్ స్టీల్‌తో రూపొందే ఏసీ కోచ్‌లు రూ.2.5 కోట్లు, స్లీపర్ అయితే రూ. కోటిన్నర వరకు ఖర్చవుతోంది.
►ఐసీఎఫ్ కంటే 2 మీటర్ల ఎక్కువ పొడవు ఉండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు.
దక్షిణమధ్య రైల్వే పరిధిలో 1,428 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఇప్పటివరకు 43 ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి 68 రేక్స్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. గతేడాది మార్చి నాటికి ఈ సంఖ్య 53గా ఉండగా ఏడాది కాలంలో అదనంగా మరో 15 రేక్స్‌కు వాటి ఏర్పాటు పూర్తయింది. వెరసి ఇప్పటివరకు 1,428 కోచ్‌లను బదలాయించి సంప్రదాయ ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయగలిగారు. అయితే ఇంకా 150 రైళ్లకు మార్చాల్సి ఉంది. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ మరింత ఊపందుకుంటే తప్ప వాటి బదలాయింపులో వేగం పుంజుకోదు.
Comments
Please login to add a commentAdd a comment