Railways To Replace ICF Coaches With LHB | Read More - Sakshi
Sakshi News home page

ఇకపై అన్నీ ఆధునిక బోగీలే

Published Sat, Sep 25 2021 3:28 AM | Last Updated on Sat, Sep 25 2021 12:13 PM

Railways To Gradually Replace ICF Coaches With LHB Ones - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంప్రదాయ ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) రైలు బోగీలు క్రమేణా కనుమరుగు కానున్నాయి. ప్రయాణికుల భద్రత, వేగం పెంపు, నిర్వహణ ఖర్చులో పొదుపు తదితరాల దృష్ట్యా ఆధునిక లింక్‌ హాఫ్‌మెన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) బోగీలు వాటి స్థానాన్ని ఆక్రమించుకోనున్నాయి. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ బోగీలు రెండు దశాబ్దాల క్రితం నీలిరంగులోకి మారాయి.

అయితే ప్రస్తుతం వస్తున్న ఎల్‌హెచ్‌బీ బోగీలు నారింజ రంగు ప్రధానంగా ఉంటున్నాయి. భారతీయ రైల్వే ఇప్పటికే దాదాపు 18 వేల వరకు ఇలాంటి ఆధునిక కోచ్‌లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పాత బోగీలన్నీ మార్చి వీలైనంత తొందరలో కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటి ఉత్పత్తిని కూడా భారీగా పెంచింది.  

ఐసీఎఫ్‌లు పూర్తిగా పక్కకు.. 
భారతీయ రైల్వే ఇంతకాలం సంప్రదాయ ఐసీఎఫ్‌ కోచ్‌లను వినియోగిస్తూ వస్తోంది. తమిళనాడులోని ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో వీటిని ఉత్పత్తి చేస్తున్నందున ఐసీఎఫ్‌ బోగీల పేరిటే కొనసాగుతున్నాయి. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో చాలా మందంగా ఉండే ఈ కోచ్‌లతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ప్రత్యామ్నాయం లేక దశాబ్దాలుగా వాటినే వాడుతూ వస్తోంది. అయితే కొన్నేళ్ల కిందట జర్మనీ పరిజ్ఞానంతో కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి రావటంతో వాటివైపు మొగ్గుచూపింది.

ఈ పరిజ్ఞానంతో కొత్త కోచ్‌ల తయారీకి పంజాబ్‌లోని కపుర్తలా కోచ్‌ ఫ్యాక్టరీని కేటాయించింది. రైలు ప్రమాదాల సమయంలో భారీ ప్రాణనష్టం సంభవించకుండా తప్పించాలంటే ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల ఏర్పాటు అవశ్యమని నిపుణులు రైల్వేకు సిఫారసు చేయటంతో ఐసీఎఫ్‌ కోచ్‌ల తయారీని రెండేళ్ల కిందట నిలిపేశారు. కానీ వినియోగంలో ఉన్న ఆ కోచ్‌లు నాణ్యతతో ఉండటంతో వాటిని కొనసాగిస్తున్నారు. తాజాగా.. అవి మన్నికగా ఉన్నా సరే పక్కన పెట్టేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు అన్ని కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల తయారీ సామర్థ్యాన్ని పెంచింది. తయారైనవి తయారైనట్టుగా వినియోగంలోకి తెచ్చి సంప్రదాయ కోచ్‌లను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. దీంతో మరి కొన్నేళ్లలోనే ఐసీఎఫ్‌ బోగీలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది  

ప్రయాణికుల భద్రతే ప్రధానం 
బోగీల మార్పు వెనక భద్రతే ప్రధాన కారణంగా కినిపిస్తోంది. ఇప్పటివరకు ఐసీఎఫ్‌ బోగీలలో డ్యూయల్‌ బఫర్‌ హుక్‌ కప్లర్స్‌ను వినియోగిస్తున్నారు. బోగీకి బోగీకి మధ్య ఇవే అనుసంధానంగా ఉంటాయి. దీంతోనే సమస్య ఏర్పడుతోంది. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పరస్పరం ఢీకొని ఒకదానిమీదికొకటి ఎక్కుతున్నాయి. దీంతో భారీ ప్రాణనష్టం సంభవిస్తోంది. రైలు ప్రమాద మరణాల్లో 90 శాతం ఈ కప్లింగ్‌ వల్లనే సంభవిస్తున్నాయని గుర్తించారు. ఎల్‌హెచ్‌బీ బోగీలకు సెంటర్‌ బఫర్‌ కప్లర్లుంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బోగీలు పక్కకు పడిపోతాయి తప్ప ఒకదానిమీదకు ఒకటి ఎక్కవు.  

బరువు తక్కువ .. వేగం ఎక్కువ 
ఐసీఎఫ్‌ బోగీలు గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో వెళ్లేలా రూపొందించారు. కానీ వాటికి అనుమతించిన గరిష్ట వేగం 120 కి.మీ. మాత్రమే. కాగా 110 కి.మీ. వరకు మాత్రమే నడుపుతున్నారు. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే బోగీలు ఊగిపోవటం, పెద్ద శబ్దాన్ని సృష్టించటం ఇబ్బందిగా మారింది.

ఇక ఎల్‌హెచ్‌బీ బోగీలు 200 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా రూపొందుతున్నాయి. అయితే వాటిని ప్రస్తుతం 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల బరువు తక్కువగా ఉండటంతో ఎక్కువ వేగంతో పరుగులు తీస్తున్నాయి. కుదుపులు కూడా చాలా తక్కువగా ఉండటంతో గరిష్ట వేగానికి అనుమతించినా ఇబ్బంది ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు.  

కుదుపులకు తావులేని సస్పెన్షన్‌ వ్యవస్థ 
ఐసీఎఫ్‌ బోగీలకు సంప్రదాయ స్ప్రింగ్‌ సస్పెన్షన్‌ విధానం ఉంటుంది. రైలు వేగంగా ప్రయాణించిన సమయంలో బోగీలు పైకి కిందకు ఊగకుండా కొంతమేర అడ్డుకోగలుగుతాయి, కానీ ఊయల లాగా పక్కకు ఊగకుండా నిలువరించలేకపోతున్నాయి. ఇది ప్రయాణికులకు కొంత అసౌకర్యంగా ఉంటోంది. ఒక్కోసారి పైనుంచి బ్యాగులు కిందపడేంతగా బోగీలు ఊగుతున్నాయి. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో ఎయిర్‌ కుషన్‌ సస్పెన్షన్‌ వ్యవస్థ ఉంటోంది.

దీనివల్ల వేగంగా వెళ్లినా పెద్దగా కుదుపులు ఉండటం లేదు. మరోవైపు సంప్రదాయ బోగీల్లో సాధారణ ఎయిర్‌ బ్రేక్‌ విధానం ఉంటుంది. బ్రేక్‌ వేశాక వెంటనే నిలిచిపోతే బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముంది. దీంతో బ్రేకు వేశాక చాలా ముందుకు వెళ్లి ఆగుతుంది. ఎల్‌హెచ్‌బీ బోగీలకు డిస్క్‌ బ్రేకు విధానం ఉంటుంది. కాసేపటికే ఆగినా బోగీలు పట్టాలు తప్పే ప్రమాదముండదు.  

ఖరీదు ఎక్కువే అయినా.. 
ఐసీఎఫ్‌ కోచ్‌ల తయారీ ఖర్చు తక్కువ. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందే ఈ కోచ్‌లలో ఏసీ బోగీకి రూ.కోటిన్నర, స్లీపర్‌ బోగీకి రూ.85 లక్షల వరకు ఖర్చు అవుతోంది. అదే మైల్డ్‌ స్టీల్‌తో రూపొందే ఎల్‌హెచ్‌బీ ఏసీ కోచ్‌లు రూ. రెండున్నర కోట్లు, స్లీపర్‌ అయితే రూ.కోటిన్నర వరకు ఖర్చు అవుతోంది. తయారీ ఖరీదే అయినా నిర్వహణ వ్యయం మాత్రం తక్కువగా ఉంటుంది.

విడిభాగాల అవసరం కూడా చాలా తక్కువ. అయితే మన్నిక విషయంలో మాత్రం ఎల్‌హెచ్‌బీలే ముందుండటం గమనార్హం. ఇక సంప్రదాయ ఐసీఎఫ్‌ కోచ్‌లో 64 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. దీనికంటే దాదాపు 2 మీటర్ల పొడవు ఎక్కువుండే ఎల్‌హెచ్‌బీ బోగీలో 72 మంది ప్రయాణించవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement