రైల్వే ప్రయాణం చేస్తున్నారా? ఏసీ కోచ్‌లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారా? అందులో వాడే ఉన్ని దుప్పట్లు ఎప్పుడు ఉతుకుతారో తెలిస్తే షాకవుతారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నలకు స్వయంగా రైల్వే విభాగం ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
ఏసీ కోచ్‌ల్లోని ఉన్ని దుప్పట్లు, బెడ్‌షీట్లు, కవర్లను ఎన్ని రోజులకు శుభ్రం చేస్తారని సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే విభాగం స్పందించింది. బెడ్‌షీట్లు, పిళ్లో కవర్లు ప్రతి జర్నీ పూర్తయిన వెంటనే శుభ్రం చేస్తామని చెప్పింది. అయితే ఉన్ని దుప్పట్లను మాత్రం నెలలో ఒకటి లేదు రెండుసార్లు ఉతుకుతామని స్పష్టం చేసింది.
‘ఏసీ కోచ్‌ల్లో రైలు ప్రయాణం పూర్తయిన వెంటనే పిళ్లో కవర్లు, బెడ్‌షీట్లు నిత్యం శుభ్రం చేస్తాం. అయితే చాలా సందర్భాల్లో దుప్పట్లు దుర్వాసన, తడిగా ఉండడం..వంటివి గమనిస్తే వెంటనే వాటిని ఉతకడానికి ఇస్తాం. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు దుప్పట్ల శుభ్రతకు సంబంధించి ఫిర్యాదు చేస్తారు. వారికి వెంటనే మరో దుప్పటి అందిస్తాం’ అని రైల్వేలో పదేళ్లు అనుభవం ఉన్న హౌజ్‌కీపింగ్ సిబ్బంది తెలిపారు.
రైల్వే ఎన్విరాన్‌మెంట్ అండ్ హౌస్ కీపింగ్ మేనేజ్‌మెంట్ (ఎన్‌హెచ్‌ఎం) సెక్షన్ ఆఫీసర్ రిషు గుప్తా మాట్లాడుతూ..‘టిక్కెట్ ధరలో బెడ్ నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి బెడ్‌షీట్లు, దిండ్లు, దుప్పట్లు ఇస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత బెడ్ షీట్లు, దిండు కవర్లు శుభ్రం చేస్తారు. ఉన్ని దుప్పట్లు ఉతకడంలో మాత్రం కొంత ఆలస్యం అవుతుంది’ అన్నారు. రైల్వేశాఖ ఆర్‌టీఐలో భాగంగా ఇచ్చిన రిప్లైలో..‘రైల్వే విభాగంలో అందుబాటులో ఉన్న లాండ్రీ సదుపాయాలకు అనుగుణంగా ఉన్ని దుప్పట్లను కనీసం నెలకు ఒకసారి లేదా రెండుసార్లు ఉతకాల్సి ఉంది’ అని పేర్కొంది. కాగా, రైల్వేలో బ్లాంకెట్లను పరిశుభ్రంగా ఉంచడం లేదని 2017లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది.
ఇదీ చదవండి: పెట్రోల్ కల్తీని ఎలా గుర్తించాలంటే..
రైల్వే విభాగానికి దేశవ్యాప్తంగా 46 డిపార్ట్‌మెంటల్ లాండ్రీ, 25 బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్-ప్రైవేట్ యాజమాన్యాలు నిర్వహించేవి) లాండ్రీ సదుపాయాలు ఉన్నాయి. డిపార్ట్‌మెంటల్ లాండ్రీల్లోని సిబ్బంది తరచు కాంట్రాక్టు ప్రాతిపదికన నియమితులవుతున్నారు. దాంతో కొంత ఇబ్బందులున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. బూట్ లాండ్రీలను ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment