హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఇకపై ప్రయాణికులకు గొప్ప అనుభూతిని మిగల్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఇకపై ఎల్‌ఈడీ లైట్లు, జీపీఎస్ సౌకర్యాలతో పాటు అదనపు హంగులు జతచేరనున్నాయి. పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారతీయ రైల్వే చేపట్టిన ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా వివిధ రైళ్లలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగానే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని 24 బోగీలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ప్రారంభించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అమిత్ వర్ధన్ సర్క్యులర్ విడుదల చేశారు. ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా 2018–19 సంవత్సరంలో మొత్తం మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 640 బోగీలను వివిధ హంగులతో పునరుద్ధరించనున్నారు. తొలి విడతలో భాగంగా 140 బోగీలను.. రెండవ విడతలో మిగిలిన 500 బోగీలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి బోగీకి రూ. 60 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది మార్చిలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. – సాక్షి, హైదరాబాద్
ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్న కొత్త సొగసులు..
►కలర్ స్కీంలో భాగంగా రొటీన్ ఎరుపు, పసుపు రంగుల్లో కాకుండా అందమైన పోలీయురిథేన్ (పీయూ) పెయింటింగ్‌లో రైలు బోగీలు ప్రయాణికులను ఆకట్టుకోనున్నాయి.
►బోగీల్లో జీపీఎస్ సదుపాయంతో ఎల్‌ఈడీ ఇండికేషన్ బోర్డ్‌లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి.
►అన్ని బోగీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు.
►టాయిలెట్లు, డోర్లు, బెర్త్‌ల మధ్యన, బోగీల లోపల అంతా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.
►అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే సాధనాలు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. అలాగే రైళ్లలోని వాష్‌బేసిన్‌లన్నీ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసినవి అమరుస్తారు.
► తడిని పీల్చేలా, పొడిగా, పరిశుభ్రంగా ఉండేందుకు టాయిలెట్స్‌లో సైతం పాలిమెరైజ్డ్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు.
► బెర్త్‌లు సైతం మరింత సౌకర్యవంతంగా తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment