కలహాల కాపురానికి ముగ్గురు బలి
మధిర : ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి తండ్రి ఆత్మహత్య మధిరకలహాల కాపురం ముగ్గురిని బలిగొంది. తండ్రి క్షణికావేశం ముక్కుపచ్చలారని పిల్లలను మత్యువుపాల్జేసింది. భార్యతో గొడవపడి కూతురు, కుమారుడిని వెంటబెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిన భర్త పిల్లలతో సహా రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. జిల్లాలోని మధిర రైల్వేస్టేషన్‌కు కిలోమీటరు దూరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపలిలో విషాదాన్ని నింపింది. పర్వతగిరి మండలం గోపనపల్లి గ్రామానికి చెందిన గుండా సరోజన, యాకయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతు రు ఉన్నారు.
చిన్న కుమారుడు వెంకటరమణ(34) హైదరాబాద్‌కు చెందిన వసంతను ప్రేమించి యూదగిరిగుట్టలో 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు అశ్రుద్ (10), కూతురు అభిజ్ఞ(7) ఉన్నారు. వెంకటరమణ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఎయిర్‌టెల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వసంత తల్లిదండ్రులు కొన్నాళ్ల క్రితం వరంగల్ నగరానికి మకాం మార్చారు. ఈ క్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో వారం రోజుల క్రితం పిల్లలను తీసుకుని వెంకటరమణ ఇంట్లో నుం చి బయటికి వెళ్లాడు. వారం రోజులు వివిధ ప్రాంతాల్లో తిరిగిన వారు బుధవారం రాత్రి మధిర రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్ దూరంలో ట్రాక్‌పై విగతజీవులయ్యారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
శోకసంద్రంలో గోపనపల్లి..
వెంకటరమణ, అశ్రుద్‌ధ, అభిజ్ఞ మతదేహాలను పోస్టుమార్టం అనంతరం గోపనపల్లికి గురువారం రాత్రి తరలించారు. మృతదేహాల రాకతో గ్రామస్తులంతా మృతుల ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలపై పడి వెంకటరమణ తల్లి సరోజన, భార్య వసంత బోరున విలపించారు.
విచారణ చేపట్టాలి
వెంకటరమణ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని, ప్రభుత్వం విచారణ చేపట్టాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్ను నర్సయ్య డిమాండ్ చేశారు. అది ఆత్మహత్య కాకపోవచ్చని, హత్య జరిగి ఉండొచ్చన్నారు.