సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటిని వాడుకునే విషయంలో ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల రాష్ట్రానికి కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి మనకు రావాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుకోవాలని ట్రిబ్యునల్ తాజాగా సూచించింది. ఈ ప్రతిపాదనపై మూడు రాష్ట్రాలు ఈ నెల 24, 25 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నాయి. ఈ చర్చల సారాంశాన్ని 26న ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కృష్ణా నదిలో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 2,130 టీఎంసీల నీరు ఉన్నట్టు ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నీటిలో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మన రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే మన రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఎగువ ప్రాంతం (మహారాష్ట్ర, కర్ణాటక) నుంచి 459 టీఎంసీలు రావాల్సి ఉంది. మిగిలిన 352 టీఎంసీల నీరు మన రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ద్వారా రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిన తర్వాతే మన రాష్ర్టంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 65 శాతం డిపెండబులిటీ ప్రకారం కృష్ణా నదిలో 2,578 టీఎంసీల నీరు ఉన్నట్టు బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనినే పరిగణనలోకి తీసుకుని మూడు రాష్ట్రాలకు అదనపు కేటాయింపుల్ని కూడా చేసింది. అంటే...ఇప్పటివరకు మనకే వాడుకునే స్వేచ్ఛ ఉన్న మిగులు జలాల్ని ఎగువ రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునే విధంగా మధ్యంతర తీర్పును వెల్లడించారు. దీనిపై మన రాష్ర్టం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దాంతో 75 శాతం డిపెండబులిటీ నీటి లభ్యత ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే....65 శాతం డిపెండబులిటీ నీటిని (మిగులు జలాలు) ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది.
రాష్ట్రానికి కొంత మేలే... నిపుణులు: ట్రిబ్యునల్ సూచనల మేరకు ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవాలంటే.. మనకు ముందుగా నికర జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ట్రిబ్యునల్ సూచించిన ఈ కొత్త ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రతిపాదన వల్ల కలిగే లాభ నష్టాలను అంచనా వేస్తూ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారం ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగే సమావేశంలో అధికారులు రాష్ట్ర అభిప్రాయాన్ని చెప్పనున్నారు.
తుది తీర్పు దిశలో ట్రిబ్యునల్: బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పును వెల్లడించడానికి సిద్ధమవుతోంది. 2010 డిసెంబర్‌లో ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సవరణల కోసం ఈ మూడేళ్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు విన్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ట్రిబ్యునల్ తాజా గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆ లోపు తుది తీర్పును వెల్లడించాలని ట్రిబ్యునల్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 26న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ముందుగా రాష్ట్రానికి 459 టీఎంసీలు
Published Fri, Aug 16 2013 3:18 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement
Advertisement