రూ.5.2 కోట్లతో కొత్త భవనాలు
Published Tue, Oct 1 2013 1:20 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
చేవెళ్ల, న్యూస్‌లైన్: జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయాలకు, వికారాబాద్, మహేశ్వరంలలో తహసీల్దార్‌ల కార్యాలయాల భవన నిర్మాణాలకు రూ.5 కోట్ల 20 లక్షలు మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అధికారులను ఆదేశించారు. చేవెళ్లలో సోమవారం ఆయన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో రఘువీరా మాట్లాడుతూ.. చేవెళ్ల చెల్లెమ్మ సబితమ్మ అడిగితే తప్పుతుందా అంటూ.. చేవెళ్ల ఆర్డీఓ భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయానికి కూడా రూ. 60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆ వెంటనే మంత్రి ప్రసాద్‌కుమార్ లేచి..
వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎప్పటినుంచో ప్రైవేటు భవనంలో కొనసాగుతోందని.. తహసీల్దార్ కార్యాలయం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. దీంతో ఆయన అక్కడే ఉన్న వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని పిలిచి ఇది నిజమేనా అని అడిగారు. వికారాబాద్ ఆర్డీఓ ఆఫీసు నిర్మాణానికి రూ.2 కోట్లు, తహసీల్దార్ కార్యాలయానికి రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నిధుల జీవోను రేపే (మంగళవారం) విడుదల చేయాలని సీసీఎల్ కమిషనర్ కృష్ణారావును ఆదేశించారు. పరిగిలో తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మంత్రికి విన్నవించగా ఈ విషయాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిశీలించి నిధులు విడుదల చేయాలని రఘువీరారెడ్డి ఆదేశించారు.
చేవెళ్ల ఆర్డీఓగా చంద్రశేఖర్‌రెడ్డి
చేవెళ్ల ఆర్డీఓగా చంద్రశేఖర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఈ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం పంపిచామని, రెండు రోజుల లో చేవెళ్లకు నూతన ఆర్డీఓ వస్తారని పేర్కొన్నారు.
ఫ్లెక్సీలో రత్నం ఫొటో లేదంటూ టీడీపీ నాయకుల ఆందోళన
ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రత్నం ఫొటో లేదంటూ టీడీపీ నాయకులు శేరిపెంటారెడ్డి, రాంచంద్రయ్య, తదితరులు సభ ప్రారంభంలో ఆందోళనకు దిగారు. అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో పెట్టకపోవడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. దీంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని.. రత్నం ఫొటో ఎందుకు పెట్టలేదంటూ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను ప్రశ్నించారు. పొరపాటు జరిగిందంటూ ఆయన సర్దిచెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని శ్రీధర్‌బాబు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం ఎమ్మెల్యే రత్నం మాట్లాడుతూ అధికారిక కార్యక్రమాల్లో తన ఫొటో పెట్టకపోవడం ఇప్పటికే చాలా సార్లు జరిగిందని, ఇకముందు జరిగితే సహించేదిలేదని హెచ్చరించారు.
సభా ఏర్పాట్లు ఇలాగేనా.. ఆగ్రహించిన సబితారెడ్డి
ముగ్గురు మంత్రులు వస్తున్న సందర్భంగా సభా ఏర్పాట్లు ఇలాగేనా చేసేది.. నీ పనితీరు ఏమీ బాగా లేదని స్థానిక ఎంపీడీఓ రత్నమ్మపై మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులు రాకముందే చేవెళ్లకు చేరుకున్న ఆమె ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకున్నారు. ఐదారువందల మంది హాజరయ్యే సభ ఏర్పాట్లు ఇలాగేనా అంటూ ఎంపీడీఓను నిలదీశారు. ఏర్పాట్లను మీరైనా చూసుకోవచ్చు కదా అంటూ అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి అడిగారు. ఎంపీడీఓ, తహసీల్దార్‌ల పనితీరుపై సబితారెడ్డికి ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement