
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా.. ఆ వర్గాలకు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనుల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రెండు బిల్లులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరిన్ని అవకాశాలను కల్పించే రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను ఒక బిల్లులో ప్రతిపాదించగా, మరో బిల్లులో అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్లు కల్పిస్తూ మరో బిల్లును ప్రవేశపెట్టారు. నామినేటెడ్ పదవుల్లోనూ, పనుల్లోనూ ఆయా వర్గాల మహిళలకే 50 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సామాజిక, రాజకీయ వెనుకబాటుకు ఇక స్వస్తి
అన్ని నామినేటెడ్ ప్రభుత్వ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ వర్గాల్లో సామాజిక, రాజకీయ వెనుకబాటుతనానికి స్వస్తి పలికినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు బిల్లులో స్పష్టం చేశారు. అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థలు, సొసైటీలు, పరిపాలన విభాగాల్లో పనిచేసే కమిటీలన్నింటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా నామినేట్ చేసే వీటి చైర్‌పర్సన్ పదవుల్లోనూ ఈ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అలాగే నామినేట్ చేసే డైరెక్టర్లు, సభ్యుల పదవుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ రిజర్వేషన్లు దేవదాయ చట్టం కింద ఏర్పడిన బోర్డులు, ట్రస్టులకు, అలాగే వక్ఫ్ బోర్డు చట్టం కింద ఏర్పడిన పదవులకు వర్తించవని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ఈ రిజర్వేషన్ల అమలు తీరుతెన్నులను సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షించనుందని తెలిపారు.
ఆర్థికంగా బలోపేతం
ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, పనులు, సర్వీసుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకే కేటాయించారు. తద్వారా ఆయా వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బిల్లులో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని నామినేటెడ్ సివిల్ పనుల కాంట్రాక్టులు, నామినేటెడ్ సర్వీసు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు పేర్కొంది. నామినేటెడ్ వర్క్ కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టులు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లోని పనుల్లో రిజర్వేషన్లను వర్తింపచేయనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు. ఇందులోనే ఆయా వర్గాలకు చెందిన మహిళలకు 50 శాతం పనులను రిజర్వ్ చేయాలని స్పష్టం చేశారు. నామినేటెడ్ పనుల్లో రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఈఎన్‌సీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిల్లో నామినేటెడ్ పనుల్లో, సర్వీసు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్ల అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. సర్వీసు కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ల అమలుకు సాధారణ పరిపాలన శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.