పుట్టుకలోనే రికార్డు | 5.2 Kgs baby Born in Tamil nadu | Sakshi
Sakshi News home page

పుట్టుకలోనే రికార్డు

Published Fri, Dec 14 2018 11:52 AM | Last Updated on Fri, Dec 14 2018 11:52 AM

5.2 Kgs baby Born in Tamil nadu - Sakshi

తల్లీ బిడ్డతో వైద్యులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: పుత్రోదయం ఏ దంపతులకైనా ఆనందమే. అదే బిడ్డ పుట్టుకతోనే రికార్డు సృష్టిస్తే ఇంకేముంది అమితానందం. చెన్నైలోని ఓ దంపతుల విషయంలో అదే జరిగింది. తమ కుమారుడు తమిళనాడుకే రికార్డని చెప్పుకుని మురిసిపోతున్నారు. ఇంతకూ అసలు విషయం ఏమిటంటే.ఇటీవల తమిళనాడులోని అనేకశాతం గర్భిణులు సంప్రదాయ ఆహారానికి గుడ్‌బై చెప్పడంతో కాన్పు సమయంలో సిజేరియన్‌ శస్త్రచికిత్స తప్పనిసరిగా మారిపోయింది. అయితే పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయ ఆహారాన్ని గర్భిణులు భుజిస్తే పండంటి బిడ్డను సాధారణ కాన్పు ద్వారానే పొందవచ్చని ఇటీవల నిరూపితమైంది. చెన్నై సైదాపేటకు చెందిన ఇందిరోస్‌ కుమార్‌ గుప్త (35), జయశ్రీ (35) దంపతులకు ఇప్పటికే పదేళ్లబాబు ఉన్నాడు. కాగా రెండోసారి గర్భవతైన జయశ్రీ ప్రసవం కోసం చెన్నై ట్రిప్లికేన్‌లోని కస్తూరిభా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.

వారం రోజుల క్రితం ఆమెకు సాధారణ కాన్పు జరగ్గా 5.2 కిలోల బరువున్న మగబిడ్డ పుట్టాడు. ఈ సందర్భంగా ఆసుపత్రి డైరక్టరర్‌ డాక్టర్‌ విజయ గురువారం మీడియాతో మాట్లాడుతూ, జయశ్రీకి తొలి కాన్పుగా పదేళ్ల క్రితం సాధారణ కాన్పుద్వారా 3.9 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. రెండో కాన్పులో 4.5 కిలోల బరువున్న బిడ్డ పుడతాడని అంచనావేయగా 5.2 కిలోల బరువున్న ఆరోగ్యకరమైన బిడ్డ జన్మించాడు. పైగా రెండోది కూడా సాధారణ కాన్పు. ప్రసవ సమయంలో తల్లి సహకరించడంతో కాన్పు చేయడం సులువైంది. రెండేళ్ల కిత్రం ఇదేఆస్పత్రిలో 4.8 కిలోల బరువున్న బిడ్డ పుట్టింది.  సహజంగా గర్భం దాల్చిన సమయంలో చక్కెరవ్యాధి సోకితే బరువైన బిడ్డ పుట్టే అవకాశం ఉంది.

అయితే జయశ్రీకి అలాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకుండానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ అధిక బరువుతో ఉన్నందున తల్లిపాలను ఎక్కువగా తాగుతుంది. అయినా ఇబ్బందేమీ లేదు, మావద్ద తల్లిపాల బ్యాంకు ఉంది. తమిళనాడులో వైద్య ఆరోగ్యశాఖాధికారి ఒకరు మాట్లాడుతూ, చెన్నై వేలాచ్చేరికి చెందిన ఒక వివాహితకు తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా 2014లో 5.2 బరువుగల మగబిడ్డ పుట్టాడు. అయితే అది సిజేరియన్‌ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిగింది. అయితే తాజా కేసులో సాధారణ కాన్పులో 5.2 కిలోల బరువైన బిడ్డ పుట్టడం రాష్ట్రంలో ఒక రికార్డు. సహజంగా బిడ్డ 4 కిలోలకు పైగా బరువుంటే తప్పనిసరిగా సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే 5.2 కిలోల బరువున్న బిడ్డను కలిగి ఉన్న జయశ్రీకి సాధారణ ప్రసవం చేసిన వైద్య బృందం అభినందనీయమని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement