సేలం: శిశువులను అక్రమంగా విక్రయించిన వ్యవహారానికి సంబంధించి మాజీ నర్సుతో పాటు ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నామక్కల్ జిల్లా రాశిపురం సమీపంలోని కాట్టుకొట్టాయ్ ప్రాంతానికి చెందిన దంపతులు రవిచంద్రన్, అముదవల్లి. రవిచంద్రన్ రాశిపురంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులో ఆఫీస్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అముదవల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో అసిస్టెంట్ నర్సుగా ఉద్యోగం చేసి గత 2012లో వీఆర్‌ఎస్ తీసుకుని ఇంటిలో ఉంటోంది. ఈ స్థితిలో శిశువులను అముదవల్లి అక్రమంగా విక్రయిస్తున్నట్టు వీడియో బుధవారం రాత్రి వైరల్ అయ్యింది. ఈ వీడియో ఆధారంగా నామక్కల్ జిల్లా ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ కుమార్ గురువారం అముదవల్లిపై రాశిపురం పోలీసు స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు.
నాలుగు బృందాలుగా పోలీసులు..
దీనిపై స్పందించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. అప్పుడు అముదవల్లి, రవిచంద్రన్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా శిశువులను విక్రయించిన మాట నిజమే అని అంగీకరించారు. అయితే, ముగ్గురు పిల్లలను మాత్రమే తాము కొనుగోలు చేసి విక్రయించినట్లు తెలిపారు. వారిలో ఒక బిడ్డను సేలం అన్నదానపట్టిలో కొనుగోలు చేసి, ఓమలూరు మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ పొంది, మేట్టూరుకు చెందిన రవి అనే వ్యక్తికి, మరో ఇద్దరు పిల్లల్లో కొల్లిమలైలోని ప్రభుత్వ ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్ మురుగేశన్ ద్వారా ఈ రోడ్‌కు చెందిన పర్వీన్ అనే మహిళకు విక్రయించినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు పర్వీన్‌ను విచారించగా తాను నలుగురు పిల్లలను విక్రయించినట్టు చెప్పింది. దీంతో పోలీసులు శుక్రవారం అముదవల్లి, రవిచంద్రన్, మురుగేశన్‌లను అరెస్టు చేసి, రాశిపురం నేరవిభాగ కోర్టులో న్యాయమూర్తి మాలతి ముందు హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment