
మూగరోదన
60 ఆవులకు రెండు రోజులు నరకయాతన
17 మృతి, ఎనిమిదింటి పరిస్థితి విషమం
గడువు తీరిన బొంబాయి రవ్వే కారణం
గోశాలలో నిబంధనలు శూన్యం
అడ్డూఅదుపులేని నిబంధనలు.. అందుబాటులో లేని సౌకర్యాలు.. అక్కరకు రాని వైద్యం.. మల్లికార్జునపేట గోశాల నిర్వహణ
తీరును ప్రశ్నిస్తున్నాయి. తక్కువ రేటుకు వస్తుందన్న సాకుతో కాలంచెల్లిన బొంబాయిరవ్వను తినిపించిన కనికరం లేని మనుషుల మధ్య మూగజీవాలు నలిగిపోతున్నాయి. కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన నేపథ్యంలో గోశాలలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విజయవాడ : మల్లికార్జునపేటలో గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో కలుషిత ఆహారం తిని 17 ఆవులు మృతిచెందిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు వందేళ్లుగా నడుస్తున్న ఈ గోశాలలో ఒకేసారి సుమారు 60 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురికావడం, వాటిలో 17 చనిపోవడం, మరో ఎని మిదింటి పరిస్థితి విషమంగా ఉండటం గోప్రేమికులను కలవరపరుస్తోంది. మరో రెండు రోజులు గడిస్తే కానీ గోవులు పూర్తిగా కోలుకునే అవకాశం కనిపించడం లేదు.
ఈ పాపం ఎవరిది?
గోశాలలో మూడు షెడ్లలో 280 ఆవులు ఉన్నాయి. ఇందులో కొన్ని వయస్సు మళ్లినవి కాగా, కొన్ని సాధారణ, మరికొన్ని చూడి ఆవులు. సోమవారం ఉదయం భవానీ ట్రేడర్ నుంచి తెప్పించిన సుమారు 750 కేజీల బొంబాయిరవ్వను ఆవులకు మేతగా వేశారు. ఈ రవ్వను జనవరిలోగానే ఉపయోగించాల్సి ఉంది. గడువు తీరిన బొంబాయి రవ్వను అధిక మోతాదులో తినడం వల్లే మూగజీవాలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. మంగళవారం ఉదయానికే సుమారు 60 ఆవులు అస్వస్థతకు గురైనట్లు వెటర్నరీ వైద్యులు గుర్తించారు. 35 ఆవులు కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో ఉన్నాయి. కొన్ని ఆవులు కింద పడే ఉన్నాయి.. ఇంకొన్ని కళ్లు తేలేశాయి. ఉదయం నుంచి ఆహారం, నీరు ముట్టలేదు. దీంతో వెటర్నరీ వైద్యులు ఏడు బృందాలుగా ఏర్పడి వైద్యసేవలు అందించినా బుధవారం సాయంత్రం వరకు గోవులు నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాయి. తీవ్రంగా అనారోగ్యం పాలైన 17 ఆవులు చనిపోయాయి. మిగిలిన ఆవులకు సెలైన్లు, గ్లూకోజ్‌లు అందించి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు 15 చూడి ఆవులు గర్భస్రావం అవుతాయేమోననే ఆందోళనలో వైద్యులు ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన భవానీ ట్రేడర్స్ వ్యాపారి సాంబశివరావును వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుందని గడువు ముగిసిన బొంబాయి రవ్వను గో సంరక్షణ సంఘం ప్రతినిధులు కొనుగోలు చేశారనే విమర్శలు వస్తున్నాయి.
ఆహారంపై నిబంధనలు నిల్
నిత్యం అనేకమంది భక్తులు గోశాలకు వచ్చి గోవులకు కావాల్సిన మేత వేస్తుంటారు. దాతలు వేసే మేతపై ఎటువంటి నియంత్రణ లేదు. గోవులకు ఏవిధమైన ఆహారం ఇవ్వొచ్చు, ఏది ఇవ్వకూడదనే సూచనలు తెలియజేసే నోటీసు బోర్డులు గో సంరక్షణ కేంద్రంలో లేవు. వాస్తవానికి బొంబాయి రవ్వ, అన్నం, గంజి, స్వీట్లను ఆవులకు అధిక పరిమాణంలో ఇవ్వకూడదు. అయితే, కొంతమంది దాతలు గోవులకు స్వీట్లు, అన్నం పెడుతున్నట్లు సమాచారం. దాతలు ఇచ్చే ఆహారాన్ని నిర్వహకులు తనిఖీ చేయడం లేదు.
అంబులెన్స్, వైద్య సలహాలు అంతంతమాత్రమే
ఆవులకు అత్యవసర వైద్యం కోసం లబ్బీపేటలోని పశువైద్యశాలకు తీసుకువెళ్లాలంటే అంబులెన్స్ వంటి కనీస సౌకర్యం లేదు. దీంతో అస్వస్థతకు గురైన ఆవుల్ని అక్కడే ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రతి మంగళవారం పశువైద్యుడు వచ్చి గోవులకు పరీక్షలు చేస్తారు తప్ప ఏయే వాతావరణ పరిస్థితుల్లో పశువులకు ఏవిధమైన ఆహారం ఇవ్వాలి అనే సూచనలు ఇస్తున్న దాఖాలాలు లేవు. వెంటి లేషన్, ఫ్లోరింగ్, దాణా తొట్లు, మురుగునీరు పోయే సౌకర్యాలు మాత్రం బాగానే ఉన్నాయి.
కేసు మాఫీకి యత్నం
17 మూగజీవాల మరణానికి కారణంపై మంత్రి దేవినేని ఉమా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించే కంటే వారిని రక్షించేందుకే ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు కావాల్సిన నివేదికలు తయారవుతున్నాయని అధికార పార్టీలోనే జోరుగా ప్రచారం జరుగుతోంది.