
క్షణాల్లో..
చిలకలూరిపేట,న్యూస్‌లైన్ :అంతా క్షణాల్లో జరిగిపోయింది. రెప్పపాటులో 60 అడుగుల ఎత్తు గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మూడు నిండు జీవితాలను బలి తీసుకుంది. ఆటోల మరమ్మతుల కోసం షెడ్‌కు వచ్చి.. అప్పటిదాకా పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్న వారు ముగ్గురిపై షెడ్డు గోడ మృత్యుకెరటంలా విరుచుకు పడింది. శిథిలాల్లో సమాధి చేసింది. కొత్త ఆటో కొనుక్కుని చిన్నచిన్న మరమ్మతుల కోసం షెడ్‌కు వచ్చిన ఆటోవాలా ఒకరు...ఆటోలో పాతసామాన్లు అమ్ముకుని జీవించే వారొకరు..పొలం పనులు చేసుకుంటూ, ఖాళీ సమయంలో ఆటో తోలుకునే యువకుడొకరు.. ఇలా ముగ్గురి జీవితాలు మట్టిలో కలిసిపోయాయి.
అల్లా మాకేంటి ఈ విషమపరీక్ష...
ఆటోలో పాతసామాను అమ్ముకొని జీవిస్తున్న షేక్ నాగూర్‌వలికి భార్య జాన్‌బీ, ముగ్గురు ఆడపిల్లలు ఆషిరూన్‌బీ,సాహిరా, సానియా ఉన్నారు. పెద్ద కుమార్తె ఆషిరూన్‌బీ ఈ ఏడాది పదో తరగతిలోకి వచ్చింది. రెండో కుమార్తె ఆరోతరగతి, మూడో కుమార్తె సానియా నాల్గో తరగతి చదువుతున్నారు. నాగూర్‌వలి మృతిచెందిన సమాచారం తెలుసుకొన్న బంధుమిత్రులు ముందుగా ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాసుత్రికి చేరుకొని భోరున విలపించారు. అల్లా.. మాకేంటీ విషమపరీక్ష.. ముగ్గురు ఆడపిల్లల గతి ఏంకావాలి? అంటూ గోడకూలి ప్రమాదంలో మరణించిన బంధువుల ఆక్రందనలు, రోదనలతో ప్రభుత్వాసుపత్రి ప్రతిధ్వనించింది. మృతుడి నివాసమైన పోలీస్‌స్టేషన్ వెనుక భాగంలో ఉన్న నివాసం వద్ద కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆటో తెచ్చిన రెండోరోజే.....
ఈ ఘటనలో మృతి చెందిన షేక్ ఆదాం షఫీ(65)ది మరో విషాద సంఘటన. పట్టణంలోని రాగన్నపాలెంకు చెందిన ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రాత్రి ఆటోను కొనుగోలు చేసి మరమ్మతుల నిమిత్తం బుధవారం షెడ్‌కు తెచ్చాడు. షెడ్‌లో నాగూర్‌వలితో మాట్లాడుతుందగానే అకస్మాత్తుగా గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతలోకాలకు వెళ్లిపోయావా...
గోవిందపురం(చిలకలూరిపేటరూరల్) : ఆంజనేయా ... అనంత లోకాలకు వెళ్లిపోయావా అంటూ తల్లిదండ్రులు ... బంధుమిత్రులు ... గ్రామస్తులు కన్నీరు మున్నీరై విలపించారు. ఆటో మరమ్మతుల నిమిత్తం బుధవారం పట్టణంలోని మెకానిక్ షెడ్డు గోడకూలిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన వీరవల్లి వీరాంజనేయులు (23) గుంటూరులో చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురాగా అంబులెన్స్ చుట్టూ బంధుమిత్రులు చేరి కన్నీరుమున్నీరై విలపించారు. గ్రామానికి చెందిన చిన్నకారు రైతు వీరవల్లి కోటేశ్వరరావు, భ్రమరాంబ దంపతుల రెండో కుమారుడైన వీరాంజనేయులు వ్యవసాయ పనులు నిర్వహిస్తూ ఖాళీ సమయాల్లో ఆటో నడుపుకుంటున్నాడు. త్వరలో వివాహం చేసి ఇంటివాడిని చేయాలనుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరిగిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.
ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది...
ఓ ఆటో రిపేరుకు అవసరమైన విడిభాగం కోసం సమీపంలో ఉన్న ఆటోమొబైల్ దుకాణానికి వెళ్లా. ఒక్క సారిగా పెద్ద శబ్దంతో షెడ్‌లో ఉన్న వ్యక్తులు పరుగులు పెట్టడం కనిపిం చింది. వెంటనే షెడ్‌కు వెళ్లి చూస్తే భీతావహ వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. వెంటనే తేరుకొని స్థానికుల సహాయంతో పలువురుని రక్షించి 108 వాహనం ద్వారా ఆసుపత్రికి పంపా.
- బడేమియా,మెకానిక్
ఏం జరిగిందో అర్ధం కాలేదు
ఆటో రిపేరుకోసం షెడ్‌కు వచ్చా. మాట్లాడుతుండగానే ఒక్కసారి గోడ పడిపోవడం కనిపించింది. ప్రాణభయంతో పెద్దగా అరుస్తూ పరుగులు తీశా. అప్పటికే గోడ తాలూకు శిథిల భాగాలు నాపై పడడంతో గాయపడ్డా. ప్రాణాలు దక్కించుకొన్నా.
-పచ్చవ నాగేంద్రం, నాదెండ్ల, ఆటోడ్రైవర్