ఆదివారం జరిగిన చిలకలూరిపేట సభలో జనం లేక ఖాళీగా ఉన్న కుర్చిలు
మూడు పార్టీల అనైతిక కలయికకు ప్రజా స్పందన కరవు
తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలు రెండూ అట్టర్ ఫ్లాపే
కాపు, కమ్మ సామాజికవర్గాలు బలంగా ఉండే ప్రాంతాలైనా ప్రయోజనం శూన్యం
చిలకలూరిపేట సభ జరిగిన తీరుపై మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం
ప్రధాని మోదీకి సభలో అవమానం
జనం వచ్చారని చెప్పుకోవడానికి రోడ్డుపై కార్లు అడ్డంపెట్టి ట్రాఫిక్‌జామ్ చేసిన నేతలు
2,500 ఆర్టీసీ బస్సులు అడిగి.. ఆఖరి నిమిషంలో 1,540 బస్సులు క్యాన్సిల్
మైక్ టవర్లపై కార్యకర్తలను ఎక్కించి టీడీపీ అతి.. చురకలు వేసిన ప్రధాని
ఐదేళ్ల క్రితం విడిపోయి ఇప్పుడెందుకు కలిశారో చెప్పలేక పోతున్న మూడు పార్టీల నేతలు
తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్‌పై తిట్ల దండకానికే పరిమితం
చిలకలూరిపేటలో మోదీపై బాబు, పవన్ పొగడ్తలు, సీఎం జగన్‌పై అవే విమర్శలు.. రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో ఒక్క మాటా చెప్పలేదు
షర్మిల అంశంలో భిన్న వైఖరి
సాక్షి, అమరావతి: టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఆశలు పగటి కలలే అని తేలిపోయింది. వారి పొత్తులకు ప్రజా స్పందన కరవైంది. ఈ పొత్తులు మూడు పార్టీల ముఖ్యమైన నేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ఇష్టపడటంలేదు. నియోజకవర్గాల్లో పార్టీల నేతలు, కార్యకర్తలు ఉప్పు, నిప్పులానే ఘర్షణ పడుతున్నారు. ప్రజా స్పందన అయితే శూన్యం. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తుకు ముందు 20 రోజుల క్రితం కాపు సామాజికవర్గం బాగా బలంగా ఉండే తాడేపల్లిగూడెం ప్రాంతంలో టీడీపీ – జనసేన ‘జెండా’ సభ నిర్వహించాయి.
అది అట్టర్ ఫ్లాప్ అయింది. బీజేపీతో పొత్తు తర్వాత ఆదివారం కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడిలో సభ పెట్టారు. ప్రధాని మోదీ కూడా పాల్గొన్న ఈ సభపై చంద్రబాబు, పవన్ సహా కూటమి నేతలంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సభకూ ప్రజల నుంచి స్పందన లేక అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో మూడు పార్టీల నాయకులు, శ్రేణులు నిరాశలో మునిగిపోయారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్న ఈ సభకు ప్రజాస్పందన మొదలు సభ జరిగిన తీరు, నాయకుల ప్రసంగాలు అన్నింటిపై మూడు పార్టీల సీనియర్ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు.
కార్లు అడ్డుపెట్టి.. ట్రాఫిక్ జామ్ చేసి
చిలకలూరిపేట సభకు భారీగా జనసమీకరణ చేయడం కోసం టీడీపీ నాయకులు మొదట దాదాపు 2500 బస్సులు కావాలని ఆర్టీసీ అధికారులను కోరారు. క్షేత్రస్థాయిలో ప్రజా స్పందన వ్యతిరేకంగా ఉందని తెలిసిపోవడంతో ఆఖరి నిమిషంలో 1540 బస్సులను క్యాన్సిల్ చేసి, 960 బస్సులను మాత్రమే తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని ప్రైవేట్ స్కూళ్ల బస్సులనూ తీసుకున్నారు. వీటిలో ఏ బస్సుల్లోనూ సగం కూడా నిండలేదు. ఏ ఒక్క బస్సూ నిండుగా సభకు రాలేదని స్థానికులు చెప్పారు.
ఏలూరు లోక్‌సభ ప్రాంతం మొదలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాంతం మధ్య దాదాపు సగం రాష్ట్రం నుంచి ఈ సభ కోసం మూడు పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని 10 లక్షలకు తక్కువ కాకుండా జనసమీకరణ చేయాలని భావించాయి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినప్పటికీ, పదో వంతు కూడా జనాలు సభలో కనిపించలేదు. చివరకు సభకు ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించుకోవడానికి టీడీపీ నాయకులే జాతీయ రహదారిపై కార్లు అడ్డంగా పెట్టి రెండు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చేసి వాటినే డ్రోన్లతో చిత్రీకరించి చూపించేందుకు ప్రయత్నించారు. వారు కార్లు అడ్డం పెట్టడం సహా పూర్తి వాస్తవ చిత్రం వారి చిత్రాల్లోనే కనిపించేస్తోంది.
సభలో వైఫల్యాలను పోలీసులపై రుద్దే యత్నం
బీజేపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకముందే మార్చి తొలివారంలోనే టీడీపీ జనసేన పార్టీలు చిలకలూరిపేట సభ నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. మూడు పార్టీల పొత్తు ఖరారైన తర్వాత ప్రధాని మోదీని కూడ ఈ సభకు ఆహ్వానించారు. అయితే, ఈ సభకు జనసమీకరణ పూర్తిగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలోనే కొనసాగింది. సభ నిర్వహణను ఆఖరి నిమిషంలో బీజేపీ నాయకులకు అప్పగించారు. సభలో ప్రధాని స్థాయిలో ఉన్న మోదీని అవమానించారు. ప్రధాని వేదికపైకి వచ్చిన తర్వాత బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు సభ నిర్వహణ చేపట్టారు.
వేదికపైకి వచ్చిన ప్రధాని మోదీకి శాలువా కప్పి సన్మానించాలని చంద్రబాబును, పుష్పగుచ్ఛం అందించాలని పవన్‌ను కోరారు. అయితే, చంద్రబాబు, పవన్ వద్ద కనీసం ఓ పూల బొకే కూడా లేకపోవడంతో ప్రధాని అలానే కొద్దిసేపు నిలబడ్డారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తన వద్ద ఉన్న వినాయకుని ప్రతిమను ప్రధానికి బహూకరించి, సన్మాన కార్యక్రమం మ మ అనిపించారు. ఆ తర్వాత ప్రధాని ప్రసంగించే సమయంలో మైకులు మూడు సార్లు మూగబోయాయి.
అంతకు ముందే సభలో జనం పలుచగా ఉండటంతో ఎక్కువ మంది వచ్చారన్నట్లుగా చూపించడానికి టీడీపీ నేతల ఆదేశాల మేరకు పలువురు కార్యకర్తలు సౌండ్ బాక్స్‌లు, ఫ్లడ్ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా, చంద్రబాబు, ఆ సమయంలో ప్రసంగిస్తున్న పవన్ వారిని వారించలేదు. ఇది గమనించి ప్రధానే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా అన్ని అంశాల్లో సభ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ నాయకుల లోపాలు స్పష్టంగా కనపడుతున్నా, ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకున్నారు.
కూటమి రాజకీయ నినాదంపైనా అస్పష్టతే
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారికి ఉమ్మడి రాజకీయ విధానం లేదన్న విషయం వారి ప్రసంగాలే తేల్చేశాయి. రాష్ట్రానికి వచ్చే ఐదేళ్లూ వారు ఏం చేస్తామన్నది కూడా చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా కేవలం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు. తాడేపల్లిగూడెం సభలో పూర్తిగా సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారు. చిలకలూరిపేట సభలో ఓ పక్క మోదీపై ప్రశంసలు కురిపిస్తూ, జగన్‌పై అవే విమర్శలను కొనసాగించారు.
ప్రస్తుత పీసీసీ (రాష్ట్ర కాంగ్రెస్ ) అధ్యక్షురాలుగా కొనసాగుతున్న షర్మిల సొంత చెల్లెలు అయి ఉండి కూడా సీఎం జగన్‌ని నమ్మడంలేదని బాబు, పవన్ విమర్శిస్తే.. అదే సభలో ప్రధాని మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటేనని, ఒకే కుటుంబానికి చెందిన షర్మిల, వైఎస్ జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే ఇలా రెండు పార్టీల్లో ఉన్నారని విమర్శలు చేయడం గమనార్హం. కీలకమైన రాజకీయ విధానంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదనడానికి ఇదే ఉదాహరణ
అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎందుకు విడిపోయారో, మళ్లీ ఎందుకు కలిశారో చెప్పకుండా..
2014 ఎన్నికలప్పుడు ఈ మూడు పార్టీలే ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వందల హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఏ హామీ అమలుచేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ పేరిట రైతులు, మహిళలను వంచించారు. ఐదేళ్లు తిరగకుండానే మూడు పార్టీలు విడిపోయి, ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకొన్నాయి. 2019లో వేర్వేరుగా పోటీ చేశాయి. మళ్లీ ఇప్పుడు ఆ మూడు పార్టీలే కూటమి కట్టాయి. అప్పుడు ఎందుకు విడిపోయారు, తిరిగి మళ్లీ ఎందుకు కలిశారో వారే చెప్పలేకపోతున్నారు. దీంతో వారి కార్యకర్తలే వారిని నమ్మడంలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగుదేశం పేరే ఎత్తని ప్రధాని మోదీ
2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని స్థానంలో ఉన్న నరేంద్ర మోదీపై వ్యక్తిగతంగా, రాజకీయంగానూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వస్తే టీడీపీ నాయకులు గో బ్యాక్ నినాదాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ప్రధాని పాల్గొనే సభలకు సమీపంలో నల్ల బెలూన్లు సైతం ఎగరవేశారు. ఆదివారం చిలకలూరిపేట సభలో చంద్రబాబు, మోదీ ఇరువురు పక్క పక్కనే కూర్చున్నా, ప్రధాని మోదీ గత ఐదేళ్లనాటి చేదు సంఘటనలు ఇంకా మరిచిపోలేదేమో అన్నట్టుగా ముభావంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐదేళ్ల కిత్రం మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబే ఈ సభలో హిందీలో, తెలుగు భాషలో పొగడ్తల వర్షం కురిపించారు. అయితే, ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలుగుదేశం పార్టీ పేరును ఒక్కసారి కూడా ఉచ్ఛరించలేదు. కేవలం ఎన్డీఏ పేరుతో ప్రజలను ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు పేరును కేవలం ఒక్కసారి మాత్రమే పలికారు.
Comments
Please login to add a commentAdd a comment