8 మందికి డబుల్ ధమాకా
►ప్రశాంతంగా ఎస్‌ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
►11 మంది గైర్హాజరు నేడూ పరిశీలనకు అవకాశం
►ఒకరికి ట్రిపుల్ ఛాన్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం ప్రశాంతంగా సాగింది. జిల్లా కేంద్రంలోని గిల్డ్‌ఆఫ్ సర్వీస్ స్కూల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. ఉదయాన్నే అభ్యర్థులు కేంద్రానికి చేరుకున్నారు. జిల్లా విద్యాధికారి (డీఈఓ) అంజయ్య, విద్యా శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ (ఏడీ) లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖ అధికారులు ఆయా రిజర్వేషన్ అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 98 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు గాను 89 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మిగిలిన తొమ్మిది పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు. 89 పోస్టులకు గాను తొలిరోజు 78 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చారు. తెలుగులో ఒకరు, ఫిజికల్ సైన్స్‌లో ఒకరు, ఇంగ్లిష్‌లో ముగ్గురు, గణితంలో ముగ్గురు, సోషియల్‌లో ముగ్గురు గైర్హాజరయ్యారు. వీరందరికీ ఫోన్లలో సమాచారం అందించారు. శనివారం కూడా ఈ ప్రక్రియ సాగుతుందని డీఈఓ తెలిపారు.
ఎనిమిది మందికి ‘డబుల్‌ధమాకా’
ఎనిమిది అభ్యర్థులు రెండేసి పోస్టులకు ఎంపికయ్యారు. ఎస్జీటీలో నలుగురు, తెలుగు పండిట్‌లో ఇద్దరు, ఇంగ్లిష్, సోషియల్‌లో ఒక్కొక్కరు చొప్పున రెండేసి పోస్టులకు ఎంపికయ్యారు. ఓ మహిళ తెలుగు పండిత్ పాటు ఇంగ్లిష్, సోషియల్ పోస్టులకు ఎంపిక కావడం విశేషం.