అధికార పార్టీ నేతలే గనుల దొంగలు | 80 percent mines, quarries belongs to telugudesam party leaders | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతలే గనుల దొంగలు

Published Sun, Aug 5 2018 3:10 AM | Last Updated on Sun, Aug 5 2018 3:48 AM

80 percent mines, quarries belongs to telugudesam party leaders - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అక్రమార్జనే పరమార్థంగా భావిస్తున్నారు. అధికారం అండతో రెచ్చిపోతున్నారు. నిబంధనలు మాకొక లెక్కకా దంటూ అత్యంత విలువైన గనులను విచ్చలవిడిగా కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో అమాయక కూలీల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వారి మనసు కరగడం లేదు. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం పుష్కలంగా ఉండడంతో గనుల మాఫియాకు ఎదురే లేకుండా పోతోంది.

రాష్ట్రంలో గనులు, క్వారీల్లో అక్రమాలపై స్వయంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు. గనులు, క్వారీలు చాలావరకు తెలుగుదేశం పార్టీ నాయకులవే కావడంతో అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రతిఏటా రూ.వేల కోట్ల విలువైన ప్రకృతి సహజ సంపద పరాధీనమైపోతోంది. లీజు ఒప్పందాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. లీజు పొందిన దానికంటే అధిక విస్తీర్ణంలో గనులను తవ్వేస్తున్నా ఇదేమిటని అడిగేవారే లేరు.

80 శాతం క్వారీల్లో అక్రమాలు
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో క్వారీ అంచులు కూలిపోయి ముగ్గురు మరణించిన ఘటన మరువక ముందే శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో టీడీపీ నేత శ్రీనివాస్‌ చౌదరికి చెందిన క్వారీలో పేలుళ్లు జరిగి 12 మంది వలస కూలీలు విగత జీవులయ్యారు. క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పేలుళ్లు జరుపుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా ఉండటం లేదు. భారీ ప్రమాదాలు జరిగినప్పుడు తనిఖీలు, కఠిన చర్యలంటూ నాలుగు రోజులు హడావుడి చేయడం, తర్వాత వదిలేయడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గనులు, క్వారీల్లో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఇవన్నీ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, వారి బినామీలవే కావడం గమనార్హం.

యజమానులపై కేసులుండవ్‌!
రాష్ట్రంలో కంకర క్వారీల యజమానులు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే భారీ ఎత్తున జిలెటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు నిల్వచేస్తూ బ్లాస్టింగులు జరుపుతున్నారు. ఈ అక్రమ పేలుళ్ల వల్ల కూలీలు చనిపోతే యజమానులు వెంటనే ప్రభుత్వ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. వెంటనే మంత్రులే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. బాధితుల కుటుంబాలతో రాజీ చేస్తున్నారు. యాజమానులపై కేసులు లేకుండా చూస్తున్నారు.

గనుల భద్రత విభాగం ఏది?
గుంటూరు జిల్లాలో ఇటీవలి కాలంలో రెండు ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు సమీక్షల పేరుతో హడావుడి చేశారు. గనుల్లో భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేకంగా గనుల భద్రతా విభాగం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరు నెలలు గడిచినా అది అతీగతీ లేదు. గనులు, క్వారీల్లో ప్రమాదాలు చోటుచేసుకోకుండా చట్టంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ అవి అమలవుతున్నాయో లేదో చూసే నాథుడే లేడు.  

ఫిర్యాదులు చేసినా ఫలితం సున్నా..
భారీ పేలుడు సంభవించిన కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్‌ సమీపంలోని కంకర క్వారీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాస్‌ చౌదరికి చెందిన శ్రీవిఘ్నేశ్వర క్రషర్స్‌ పేరుతో పొందిన ఈ క్వారీ లీజు వెనుక ముఖ్యనేత సోదరుడు, యువనేత ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

అందుకే నాలుగేళ్లుగా చుట్టుపక్కల గ్రామస్తులు పదేపదే ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వారీలో పేలుళ్లతో తమ ఇళ్లు బీటలు వారుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. విచారణ కోసమంటూ వచ్చిన ప్రభుత్వ అధికారులు శ్రీనివాస్‌ చౌదరి కారులోనే దర్జాగా చక్కర్లు కొట్టడం గమనార్హం. ఈ క్వారీలో అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడికి సైతం వాటా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎనిమిదేళ్లలో రూ.292 కోట్లు
హత్తిబెళగల్‌లో పేలుళ్లు జరిగిన క్వారీ యజమాని శ్రీనివాస్‌ చౌదరి తండ్రి పేరు వీఎల్‌ చౌదరి. ఈయనను గుంతకల్లు బ్రాంచ్, ఆలూరు సబ్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి  మీనాక్షి నాయుడి ద్వారా యువనేతతో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ క్వారీ ద్వారా భారీగా ఆదాయం వస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 500 టన్నుల కంకరను కర్ణాటకకు తరలిస్తున్నారు.

అన్ని ఖర్చులు పోగా రోజుకు సగటున రూ.లక్ష మిగుతోంది. అంటే ఏడాదికి రూ.36.5 కోట్లు. ఎనిమిదేళ్లుగా క్వారీ నడుపుతున్నారు. అంటే ఇప్పటిదాకా రూ.292 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యనేత సోదరుడు, యువనేత తమ జేబుల్లో వేసుకుంది ఎంత అనేదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది.

కనీస అనుమతులు లేకుండానే...
హత్తిబెళగల్‌ గ్రామ సర్వే నంబరు 969లో మొత్తం 150 ఎకరాల్లో క్వారీ ఉంది. ఇందులో 2009లో 6.07 హెక్టార్లలో రోడ్డు మెటల్, క్వారŠట్జ్‌ తవ్వకాల కోసం శ్రీనివాస్‌ చౌదరి లీజు తీసుకున్నారు. శ్రీనివాస్‌ చౌదరి సోదరుడు సుహాన్‌ చౌదరి కూడా ఇదే సర్వే నంబరులో 3 హెక్టార్లలో 2012 జూన్‌ 12న క్వారీ లీజు పొందారు. ఇద్దరూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులే. అనుమతులు, లైసెన్స్‌లు లేకుండానే క్వారీల్లో బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. లీజుకు తీసుకున్న విస్తీర్ణం కంటే మించి పేలుళ్లు జరుపుతున్నా మైనింగ్‌ శాఖ అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.

అగ్నిమాపక శాఖ అనుమతులేవీ?
వాస్తవానికి డిటోనేటర్లను పేల్చాలంటే అగ్నిమాపక శాఖ అనుమతి అవసరం. శ్రీనివాస్‌ చౌదరి, సుహాన్‌ చౌదరి ప్రొవిజనల్‌ అనుమతి కోసం 2010లో అగ్నిమాపక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తేనే ఆక్యుపెన్సీ ఎన్‌వోసీ (నిరంభ్యతర పత్రం) ఇస్తామని అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది.

అయితే, 2010 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లుగా ఎన్‌వోసీ తీసుకోకుండానే క్వారీలో ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లను(ఈడీ) పేలుస్తున్నారు. క్వారీలో కూలీల మరణానికి కారణమైన ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లను అనంతపురం జిల్లా నుంచి అక్రమంగా తెచ్చినట్లు తెలుస్తోంది. ఆ జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేస్తున్నట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement