గంట్యాడ(గజపతినగరం): గంజాయిని అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు సరికొత్త ప్రయోగం చేసి మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి, గిరిజన ప్రాంతాల మీదుగా అరుకు, అనంతగిరి, బొడ్డవర, గంట్యాడ మీదుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు గంజాయి అక్రమ రవాణా దందా కొన్నాళ్లుగా కొనసాగుతుంది. దీనిపై నిఘా పెంచిన గంట్యాడ పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే గురువారం గంట్యాడలో వాహనాల తనిఖీలలో భాగంగా కొబ్బరి బొండాల లోడుతో వస్తున్న లారీ, ముందు, వెనుక వెళ్తున్న మరో మూడు వాహనాలను తనిఖీ చేశారు.
ఈ క్రమంలో స్మగ్లర్లు పరారీ అయ్యేందుకు ప్రయత్నించారు. అనుమానం వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జన సంచారం ఎక్కువ కావడంతో కొందరు నిందితులు వాహనాలను విడిచిపెట్టి తప్పించుకు పారిపోయారు. కొబ్బరి బొండాల లోడుతో ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేయగా బొండాల కింద 21 బస్తాలతో ఉన్న 800 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకొని సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐ పి.నారాయణరావు విచారణ చేపట్టారు. గంజాయి నిల్వలను, వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
తేడాలు రావడంతోనే...
కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న గంజాయి అక్రమ రవాణా ఇటీవల తరచుగా పోలీసులకు పట్టుబడుతుంది. దీనికి వ్యాపారుల మధ్య విభేదాలే కారణమని తెలియవచ్చింది. గతంలో పాడేరు, సీలేరు మీదుగా ఆంధ్రా, తెలంగాణ మీదుగా గుట్టు చప్పుడు కాకుండా దందా జరిపేవారు. ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం కావడంతో రోజుకో మార్గంలో ఇప్పుడు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో సుమారు ఐదు వేల కిలోల గంజాయి పట్టుబడిందంటే వీటి రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధమవుతుంది. గంట్యాడ మండలంలో ఈ ఏడాది ఆగస్టు నెలాఖరులో సుమారు 850 కిలోల గంజాయి పట్టుబడింది. ఇప్పుడు మళ్లీ ఇలా దొరకడంతో సంచలనమైంది.
Comments
Please login to add a commentAdd a comment