ప్రాణభిక్ష పెట్టండి
= అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డకు క్యాన్సర్
= చికిత్స చేయించుకోలేక నరకయాతన పడుతున్న తల్లిదండ్రులు
= రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం
= సాయం కోసం ఎదురుచూపులు
తాళ్లూరు: రోజంతా కష్టపడితే కానీ కడుపు నింపుకోలేని బతుకులు వారివి. సాధారణ జబ్బులకే చికిత్స చేయించుకోలేని దుస్థితి వారిది. బిడ్డపై ఆశలన్నీ పెట్టుకుంటే విధి వారికి మరోవిధంగా పరీక్ష పెడుతుంది. బిడ్డకు క్యాన్సర్ వ్యాధి సోకిందని తెలియడంతో ఆ తల్లిదండ్రుల కాళ్లు చేతులు ఆడడం లేదు. స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. వివరాల్లోకి వెళ్తే తూర్పుగంగవరం గ్రామపరిధిలోని సోమవరప్పాడు గ్రామానికి చెందిన ఏడుకొండలు, రమా దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతులు ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కూలీ డబ్బులతోనే పిల్లలను చదివిస్తుంటారు. వారిలో రమ్యకు ఎనిమిది సంవత్సరాలు. సంతోషంగా బాల్యాన్ని గడపాల్సిన రమ్య క్యాన్సర్ వ్యాధితో కొట్టుమిట్టాడుతోంది. బాలిక పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
ఇప్పటివరకు రూ.2లక్షలు ఖర్చు...: రెండు నెలల కిందట రమ్య అకస్మాత్తుగా పాఠశాలలో పడిపోవటంతో చీమకుర్తిలోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ జ్వరం ఉందని గుర్తించి చికిత్స అందించారు. అయినా పాప హుషారుగా లేకపోవటంతో తల్లిదండ్రులు ఒంగోలులో ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. వారు రిమ్స్‌కు సిఫార్సు చేశారు. రిమ్స్ వైద్యులు పాపను పరీక్షించి క్యాన్సర్‌గా గుర్తించారు. దీంతో చెన్నై అడియార్ ఆçస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన తరువాత చిన్నారికి బ్లడ్, లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బంధువులకు విషయం తెలిపారు. ఇప్పటి వరకు రూ.2లక్షలు ఖర్చు చేశారు. ఇంకా లక్షలు ఖర్చు అవుతుందని తమకు అంత స్థోమత లేదని ఆవేదన చెందుతున్నారు. కలలో కూడా అంత మొత్తాన్ని ఊహించని తల్లిదండ్రులు సాయం కోసం ఆర్థిస్తున్నారు. దాతలు సాయం చేస్తే తమ బిడ్డ బతుకుతుందని ఆశగా ఉన్నారు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు అకౌంట్ నంబర్ 11332809853, ఎస్‌బీఐ పొదిలి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0000268, ఇతర వివరాలకు 91001 16807 నంబర్‌ను సంప్రదించాలని చెప్పారు.