
వైసీపీ కార్యకర్త హత్య కేసులో తొమ్మిది మంది నిందితుల అరెస్ట్
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్లలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యకర్త మల్లికార్జునను దారుణంగా హత్య చేసిన కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ వివరాలను తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. వారి కథనం మేరకు.. మల్లికార్జునతోపాటు శేఖర్ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీంతో టీడీపీ వర్గీయులు తరచూ వీరితో ఘర్షణకు దిగేవారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తెల్లవారుజామున మురుగు కాలువ విషయమై గొడవకు దిగి మల్లికార్జున, శేఖర్, రామయ్యలపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో మల్లికార్జున మృతిచెందాడు. శేఖర్, రామయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో నిందితులైన టీడీపీ వర్గీయులు వెంగముని, నాగముని, వెంకటేష్, వెంకట్రాముడు, శ్రీనివాసులు, గోపాల్, తిరుపతయ్య, చిన్న యల్లప్ప, చిన్నమునయ్యలను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. దాడికి ఉపయోగించిన కర్రలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.