
వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య
అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం ఎన్ హనుమాపురం సర్పంచ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తూర్పు విశ్వనాథ్ (39) సోమవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యక్ష సాక్షి పెద్దదేవర ఖలందర్, పోలీసుల కథనం మేరకు.. విశ్వనాథ్ సోమవారం ఉదయం మండల కేంద్రం కణేకల్లు నుంచి సొల్లాపురం తన మిత్రుడు ఖలందర్‌తో కలిసి మోటారు సైకిల్‌పై బయల్దేరారు. ఖలందర్ బైక్ నడుపుతుండగా విశ్వనాథ్ వెనుక కూర్చున్నారు. మాల్యం గ్రామం వద్ద గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వీరిని అనుసరిస్తూ వచ్చారు. రెండు కిలోమీటర్ల దూరం చేరుకోగానే దుండగులు వేగంగా వెళ్లి రివాల్వర్‌తో విశ్వనాథ్‌ను కాల్చారు. వాహనం అదుపు తప్పి కిందపడిన వెంటనే విశ్వనాథ్, అతని స్నేహితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
దుండగుల్లో ఇద్దరు ఖలందర్‌ను పట్టుకుని బెదిరించి, అతని వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కున్నారు. తీవ్రంగా గాయపడి పొలాల్లోకి పారిపోతున్న విశ్వనాథ్‌ను వెంబడించి మరో మారు కాల్చారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. దుండగులు మాల్యం గ్రామం వైపుగా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి ఖలందర్ పోలీసులకు చెప్పారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేత పైనేటి తిమ్మప్పే తన సోదరుడిని దారుణంగా హత్య చేయించాడని విశ్వనాథ్ తమ్ముడు తూర్పు రఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిమ్మప్ప నుంచి ప్రాణభయం ఉందని తన సోదరుడు పోలీసులకు అనేకమార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
కిరాయి హంతకుల పనే: ఎస్‌పీ
సర్పంచ్ తూర్పు విశ్వనాథ్‌ను కిరాయి హంతకులే చంపి ఉంటారని ఎస్‌పీ రాజశేఖర్‌బాబు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. గతంలో మావోయిస్టుగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన విశ్వనాథ్‌కు మావోయిస్టుల్లో ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. ఈ హత్యతో వారెవరికీ సంబంధం లేదని.. గ్రామ కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు.